సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పునర్‌వ్యవస్థీకరణ

ప్రధానాంశాలు

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పునర్‌వ్యవస్థీకరణ

20 దాకా రద్దు.. అదే సంఖ్యలో కొత్తవి ఏర్పాటు

ప్రక్రియను వేగవంతం చేసిన ప్రభుత్వం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల పునర్‌ వ్యవస్థీకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం జరుగుతున్న రిజిస్ట్రేషన్‌లు, ఇతర కార్యకలాపాలు, పనిభారం ప్రాతిపదికగా స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ల శాఖ ఈ కసరత్తు చేస్తోంది.  
ధరణి నేపథ్యంలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు తహసీల్దార్‌ కార్యాలయాల్లోనే జరుగుతున్నాయి. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకే పరిమితమయ్యాయి. గత ఏడాది ధరణి ప్రారంభం నేపథ్యంలో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టి చాలావరకు పూర్తి చేసింది. ధరణి అమల్లోకి వచ్చి 9నెలలు పూర్తికావచ్చిన నేపథ్యంలో పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియను సమగ్రంగా చేపట్టింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని 141 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో తక్కువ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నవి, పూర్తిగా గ్రామీణ ప్రాంతాలతో ముడిపడి ఉన్నవాటిని రద్దుచేసి రిజిస్ట్రేషన్లు ఎక్కువ జరిగేచోట ్లకొత్తవి ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రకారం రాష్ట్రంలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో 20 మూతబడతాయని, సుమారు అదేసంఖ్యలో కొత్తవి ఏర్పాటు కానున్నాయని తెలిసింది. రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల సంఖ్య మారదని కానీ పనితక్కువగా ఉన్నవాటిని రద్దు చేసి ఆ కార్యాలయం పరిధిలోని గ్రామాలను సమీపంలోని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు అనుసంధానం చేస్తారని రిజిస్ట్రేషన్లశాఖ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు.

వ్యవసాయభూముల రిజిస్ట్రేషన్లు లేక తగ్గిన పనిభారం

ధరణి అమల్లోకి రాకముందు రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో ఏటా సుమారు 15 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగేవి. ఇందులో సుమారు 20 శాతం నుంచి 25 శాతం దాకా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌లు ఉండేవి. రాష్ట్రంలో ధరణి నేపథ్యంలో వ్యవసాయ భూములకు సంబంధించి తహసీల్దార్‌ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. దీంతో గ్రామీణ ప్రాంతాలతో ముడిపడి ఉన్న సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు బాగా తగ్గాయి. ఇదే సమయంలో హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్రధానంగా రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజ్‌గిరి, యాదాద్రి-భువనగిరి, మహబూబ్‌నగర్‌, వికారాబాద్‌, సంగారెడ్డి జిల్లాల పరిధిలో రిజిస్ట్రేషన్లు భారీగా పెరిగాయి. రియల్‌ఎస్టేట్‌ నేపథ్యంలో వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు బాగా పెరగడంతో సుమారు 20 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలపై తీవ్రమైన ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో వీటిపై భారం తగ్గించేలా కొత్త సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి.

గ్రామీణ నేపథ్యంలోనివి రద్దు

పూర్వపు నిజామాబాద్‌ జిల్లాలోని బిచ్కుంద, దోమకొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ఆలంపూర్‌, ఆదిలాబాద్‌ జిల్లాలో ఖానాపూర్‌, బోథ్‌, లక్సెట్టిపేట, వరంగల్‌ జిల్లాలో కొడకండ్ల, స్టేషన్‌ఘన్‌పూర్‌, ములుగు, వర్దన్నపేట, ఖమ్మం జిల్లాలో బూర్గంపాడు, కల్లూరు, కరీంనగర్‌ జిల్లాలో తిమ్మాపూర్‌, మల్యాల, నల్గొండ జిల్లాలో చండూరు, మోత్కూరు రామన్నపేట, నిడమనూరు సహా రాష్ట్రంలోని మరికొన్ని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో పనిభారం తక్కువగా ఉండటం వంటి అంశాలపై సమీక్షించారు. వీటిలో పలు రద్దయ్యే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. అదే విధంగా సంగారెడ్డి జిల్లాలో పటాన్‌చెరు, రామచంద్రాపురం, అమీన్‌పూర్‌లతో పాటు హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, వరంగల్‌, యాదాద్రి-భువనగిరి, మంచిర్యాల జిల్లాల్లో సహా మరికొన్ని చోట్ల కొత్తవి ఏర్పాటు కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని