జ్వరాల వరద

ప్రధానాంశాలు

జ్వరాల వరద

ఒక్క ఆగస్టులోనే 3 లక్షలకు పైగా కేసుల నమోదు

గత రెండు నెలల్లో 5 లక్షల మంది బాధితులు

విజృంభిస్తున్న డెంగీ, మలేరియా

వెంటాడుతున్న కరోనా భయం

కిటకిటలాడుతున్న ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు

ఈనాడు - హైదరాబాద్‌

రాష్ట్రంలో పల్లె.. పట్నం తేడా లేకుండా గత నెలరోజులుగా విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. జ్వరపీడితులతో జిల్లా ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ప్రజారోగ్య విభాగం గణాంకాల ప్రకారమే.. గత నెల(ఆగస్టు)లో 3 లక్షల మందికి పైగా అకారణ జ్వరాలతో చికిత్స పొందారు. జులైలోనూ సుమారు 2 లక్షల మంది జ్వర బాధితులున్నట్లు అంచనా. రెండు నెలల్లో 5 లక్షలకు పైగా కేసులు నమోదు కావడంతో.. బాధితులు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. దీంతో దవాఖానాలన్నీ.. ముఖ్యంగా పిల్లల ఆసుపత్రులన్నీ రోగులతో నిండిపోతున్నాయి. ప్రభుత్వం ఇంటింటి జ్వర సర్వే నిర్వహిస్తుండడం, జ్వర క్లినిక్‌లను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంతో.. వీటిద్వారా గత రెండు నెలల్లోనే సుమారు 3 లక్షల మందికి పైగా కొవిడ్‌ కిట్లను పంపిణీ చేశారు. తద్వారా కరోనాను అడ్డుకోవడమే కాకుండా ఒకవేళ ఫ్లూ జ్వరం అయినా.. ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా ముందుగానే నివారించినట్లవుతుందని వైద్యశాఖ భావిస్తోంది. వరుసగా వర్షాలు కురుస్తుండటంతో పలుచోట్ల ఇళ్లలో నీళ్లు నిలుస్తున్నాయి. దీంతో పలువురు డెంగీ వంటి జ్వరాల బారిన పడుతున్నారు. ఇంకొన్నిచోట్ల మురుగు నీటి కారణంగా మలేరియా వంటి జ్వరాలతో వణుకుతున్నారు. ఒకపక్క సీజనల్‌(కాలానుగుణ) జ్వరాల తాకిడి పెరగగా.. మరోవైపు కొవిడ్‌ భయం వెన్నాడుతోంది. జలుబు, దగ్గు, జ్వరం రాగానే ఇది కరోనా కావచ్చేమోననే ఆందోళన నెలకొంటోంది. ఆదిలాబాద్‌ జిల్లాలో అకారణ జ్వరాలు జులై నుంచి ఆగస్టు నెలకొచ్చేసరికి 12 రెట్లు పెరగడం గమనార్హం. హైదరాబాద్‌లో స్థిరంగా కొనసాగుతుండగా.. మంచిర్యాల జిల్లాలో దాదాపు మూడింతలు అధికమయ్యాయి. రాష్ట్రంలో డెంగీ జ్వరాలు గతేడాది ఆగస్టులో కేవలం 140 కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది 12 రెట్లు పెరిగాయి. మలేరియా కేసులు 2020 ఆగస్టులో 59 నమోదు కాగా.. ఈ ఏడాది ఇదే నెలలో అంతకంటే రెట్టింపు సంఖ్యలో నమోదయ్యాయి. ఈ నెలలో తొలి 2 రోజుల్లోనే 188 డెంగీ కేసులు నమోదవ్వగా.. 72 మలేరియా కేసులు నిర్ధారణ అయ్యాయి. కొన్ని జిల్లాల్లో మలేరియా, డెంగీ కేసులు స్వల్ప సంఖ్యలో నమోదైనట్లు గణాంకాల్లో చూపారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ ఆదిలాబాద్‌లో 2, హైదరాబాద్‌లో 16 మాత్రమే మలేరియా కేసులు నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు. ఖమ్మంలో అయితే ఇప్పటివరకూ ఒక్క మలేరియా కేసూ నమోదు కాలేదని నివేదిక ఇవ్వడం వైద్యాధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. కొన్ని జిల్లాల్లో అధికారులు ఉద్దేశపూర్వకంగానే కేసుల సంఖ్యను తక్కువచేసి చూపుతున్నారనే ఆరోపణలున్నాయి. వీటిపై ఒక జిల్లా వైద్యాధికారులను ఉన్నత స్థాయి అధికారులు హెచ్చరించినట్లుగా వైద్యవర్గాలు చెబుతున్నాయి.

ప్రైవేటులో ధరల బాదుడు

ప్రభుత్వ లెక్కల కంటే మూడు రెట్లు అదనంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో జ్వరాలతో చికిత్స పొందుతున్నారని అంచనా. హైదరాబాద్‌లోని పలు ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో జ్వర పీడితుల సంఖ్య గణనీయంగా నమోదవుతోంది. ఇదే అదనుగా ప్రైవేటు ఆసుపత్రులు రోగులను దోచుకుంటున్నాయన్న ఆరోపణలున్నాయి.


అప్రమత్తతతోనే అడ్డుకట్ట

- డాక్టర్‌ మనోహర్‌, విశ్రాంత ఆచార్యులు, ఉస్మానియా వైద్య కళాశాల

వరద నీటితో నిండిన ఇళ్లలో నీటిని పూర్తిగా తొలగించిన అనంతరం.. ఇంట్లో ఉపరితలాలను, వస్తువులను హైపోక్లోరైట్‌ ద్రావణంతో ఇన్‌ఫెక్షన్‌ రహితంగా చేసుకోవాలి. ఒక లీటరు నీటిలో 50 మి.లీ. హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని కలిపి 15 నిమిషాల అనంతరం వినియోగించాలి. శుభ్రపర్చిన వస్తువులను, దుస్తులను ఎండలోనే ఆరబెట్టాలి. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి. దోమ తెరలు వినియోగించాలి. కాచి చల్లార్చి వడబోసిన నీరు తాగాలి. తాజాగా, వేడిగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.  


పిల్లల ఆరోగ్యం జాగ్రత్త

-డాక్టర్‌ మంచుకొండ రంగయ్య, ప్రముఖ పిల్లల వైద్యనిపుణులు

వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్న సందర్భాల్లో వైరస్‌, బ్యాక్టీరియాలు స్వైరవిహారం చేస్తున్నాయి. అయిదేళ్లలోపు చిన్నారులపై తీవ్ర దుష్ప్రభావం చూపుతాయి. పిల్లలు ఉపయోగించే వస్తువులను ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేస్తే.. 50శాతానికి పైగా వైరస్‌ దాడిని నియంత్రించొచ్చు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నప్పుడు, చికిత్స పొందుతున్న సమయంలోనూ మూడు నాలుగు రోజులకు కూడా లక్షణాలు తగ్గకపోగా, పెరిగినట్లు కనిపిస్తే తక్షణమే వైద్యుడిని సంప్రదించాలి.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని