
తాజా వార్తలు
రైతులపై జలఫిరంగులు.. క్రూరమైన చర్య
కేంద్రంపై శివసేన మండిపాటు
ముంబయి: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతుల పట్ల కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై శివసేన పార్టీ తీవ్రంగా మండిపడింది. ఓ వైపు వణికించే చలిలో అన్నదాతలు నిరసన చేస్తుంటే వారిపై జలఫిరంగులు ప్రయోగించడం క్రూరమైన చర్య అని దుయ్యబట్టింది. ఈ మేరకు తమ అధికారిక పత్రిక సామ్నా సంపాదకీయంలో కేంద్రంపై విమర్శలు గుప్పించింది.
‘కశ్మీర్లో దేశ సరిహద్దుల వద్ద ఉగ్రవాదులు మన జవాన్ల ప్రాణాలు తీసుకుంటుంటే.. దిల్లీ సరిహద్దుల్లో మన దేశ రైతులను ఉగ్రవాదులుగా చూస్తూ వారిపై దాడులు చేస్తున్నారు’ అంటూ కేంద్రంపై శివసేన విరుచుకుపడింది. ఈ సందర్భంగా గుజరాత్లో నిర్మించిన సర్దార్ పటేల్ ఐక్యతా విగ్రహాన్ని ప్రస్తావిస్తూ.. బ్రిటిష్ హయాంలో రైతుల కోసం పటేల్ ఎన్నో ఆందోళనలు చేశారని గుర్తుచేసింది. అలాంటిది ఇప్పుడు రైతుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును చూసి ఆయన విగ్రహం కళ్లు తప్పకుండా చెమర్చుతాయని పేర్కొంది.
అన్నదాతల ఆందోళన వెనుక ఖలిస్థానీ హస్తం ఉందన్న హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వ్యాఖ్యలను ఖండించిన శివసేన.. ‘భాజపాది అరాచకత్వం. ఖలిస్థాన్ ఓ ముగిసిన అధ్యాయం. దాని వల్ల ఇందిరాగాంధీ, జనరల్ అరుణ్ కుమార్ లాంటి వాళ్లు ప్రాణాలు కోల్పోయారు’ అని తెలిపింది. రాజకీయ ప్రత్యర్థులను అణచివేసేందుకు ప్రభుత్వం తీవ్రంగా యత్నిస్తోందని శివసేన ఆరోపించింది.
కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా అన్నదాతలు చేపట్టిన ఆందోళన ఐదో రోజుకు చేరిన విషయం తెలిసిందే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘చలో దిల్లీ’ పేరుతో రైతులు ర్యాలీ చేపట్టగా.. వారిపై గతవారం హరియాణా సరిహద్దుల్లో భద్రతా బలగాలు జలఫిరంగులు, బాష్పవాయువు ప్రయోగించారు. అయినప్పటికీ వెనుకంజ వేయని రైతులు దిల్లీ దిశగా కదం తొక్కారు. ప్రస్తుతం దిల్లీ సరిహద్దుల్లో బైఠాయించారు. కేంద్రం చట్టాల్ని వెనక్కితీసుకునే వరకు తమ ఆందోళన విరమించేది లేదని తేల్చి చెబుతున్నారు.
ఇదీ చదవండి..
ఇంకా దిల్లీ సరిహద్దుల్లోనే అన్నదాతలు