
తాజా వార్తలు
కొవాగ్జిన్, కొవిషీల్డ్ రెండూ సురక్షితమే: కేంద్రం
దిల్లీ: కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలు రెండూ సురక్షితమేనని నీతి ఆయోగ్ సభ్యుడు డా.వీకే పాల్ అన్నారు. కొందరు వైద్య సిబ్బంది టీకా తీసుకునేందుకు నిరాకరించడం బాధిస్తోందని.. వారు ముందుకు రావాలని కోరారు. ఈ మేరకు ఆయన మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలు రెండూ సురక్షితమైనవే. ఈ టీకాలు అధిక రోగనిరోధక శక్తిని కలిగి ఉన్నాయి. ప్రపంచం మొత్తం వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తోంది. వైద్యులు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది వ్యాక్సిన్ వేయించుకునేందుకు నిరాకరించడం బాధిస్తోంది. దయచేసి టీకా వేయించుకోవాలని వారిని కోరుతున్నా’ అని పాల్ విజ్ఞప్తి చేశారు.
కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషన్ మాట్లాడుతూ.. ‘టీకా ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ 0.18శాతం ప్రతికూలత కేసులు నమోదయ్యాయి. ఆస్పత్రి పాలైన కేసులు అత్యల్పంగా 0.002శాతం మాత్రమే నమోదయ్యాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ తొలిరోజునే అత్యధిక టీకాలతో భారత్ రికార్డు సృష్టించింది. భారత్‌లో తొలి రోజున మొత్తం 2.07లక్షల మంది టీకా వేయించుకోగా.. యూఎస్‌లో ఆ సంఖ్య 79వేలుగా, యూకేలో 19వేలుగా నమోదైంది. అమెరికాలో వ్యాక్సినేషన్ ప్రారంభించిన తొలి వారంలో 5లక్షల మందికి వేశారు. అదే భారత్‌లో మూడో రోజునే ఆ సంఖ్యకు చేరువైందన్నారు. యూకేలో 1.37లక్షల మందికి తొలి వారం టీకాలు వేశారు’ అని భూషన్ తెలిపారు. కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ తొమ్మిది రాష్ట్రాల్లో 70శాతానికి పైగా పనితీరు కనబరించిందని ఆయన వెల్లడించారు. లక్షద్వీప్(89.3శాతం), సిక్కిం(85శాతం), ఒడిశా(82శాతం), తెలంగాణ(81శాతం), యూపీ(71.4శాతం), రాజస్థాన్(71.3శాతం) చొప్పున నమోదైనట్లు భూషణ్ పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా మంగళవారం నాటికి 4.54లక్షల మంది ప్రజలు కరోనా వైరస్ టీకా వేయించుకున్నారు. కాగా గడిచిన 24 గంటల్లో దేశంలో 10వేల కరోనా కేసులు నమోదయ్యాయి. గత ఏడు నెలల్లో కేసుల సంఖ్య ఇదే అత్యల్పం కావడం విశేషం. ఇప్పటివరకూ దేశంలో 1.05 కోట్ల కేసులు నమోదు కాగా.. 1.52లక్షల మంది కరోనా కారణంగా మరణించారు.
ఇదీ చదవండి
వ్యాక్సినేషన్ ప్రక్రియలో మరో ముందడుగు