
తాజా వార్తలు
టీకా తెరిస్తే ఆలోగా వాడేయాలి.. లేదంటే
వైద్యనిపుణుల సూచనలివి..
దిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద కొవిడ్ వ్యాక్సిన్ సరఫరా కార్యక్రమాన్ని భారత్ విజయవంతంగా కొనసాగిస్తోంది. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం అత్యంత కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీకాల వాడకంపై వైద్య నిపుణులు పలు సూచనలు చేశారు.. ఒకసారి సీలు తెరిచిన సీసాలోని టీకాను.. నాలుగు గంటల్లోగా ఉపయోగించాలని వారు ప్రకటించారు. అనంతరం అవి నిర్వీర్యం అవుతాయని.. వాటిని నాశనం చేయాలని తెలిపారు.
‘‘ప్రతి 5 ఎం.ఎల్ వ్యాక్సిన్ సీసా 10 డోసులను కలిగి ఉంటుంది. ఒకసారి దీనిని తెరిచిన అనంతరం అందులో ఉండే పది డోసులను నాలుగు గంటల్లోగా వాడేయాల్సి ఉంటుంది. ఈ వ్యవధి లోగా వినియోగించడం వీలుకానప్పుడు మిగిలిపోయిన డోసులు వ్యర్థమైనట్లే. వాటిని వినియోగించకుండా, నాశనం చేయాలి’’ అని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి (ఆర్జీఎస్ఎస్హెచ్) అధికార ప్రతినిధి ఛవీ గుప్తా తెలిపారు.
తమ వద్ద తొలి రోజు 45 మందికి టీకా ఇచ్చామని.. ఈ క్రమంలో నాలుగు సీసాలు పూర్తిగా వినియోగమయ్యాయన్నారు. ఇక ఐదో దానిలో ఐదు డోసులు వాడిన అనంతరం మిగిలిన ఐదు నిరుపయోగమయ్యాయని ఆమె తెలిపారు. ఈ విధమైన వృథా అనివార్యమని.. ఇటువంటి కారణాలను పరిగణనలోకి తీసుకుని.. ప్రభుత్వం పది శాతం అధికంగా టీకాలను అందజేస్తోందని ఆమె వెల్లడించారు. దిల్లీలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి (ఆర్జీఎస్ఎస్హెచ్) దేశంలో వ్యాక్సిన్ నిల్వకు కేంద్ర స్థానం ‘సెంట్రల్ స్టోరేజ్ ఫెసిలిటీ’గా వినియోగిస్తున్నారు.
ఇదీ చదవండి..
భారత్ నుంచి భూటాన్‌కు కొవిడ్ టీకాలు