close

తాజా వార్తలు

Updated : 05/05/2021 12:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మరాఠా రిజర్వేషన్లపై సుప్రీం సంచలన తీర్పు

దిల్లీ: మరాఠా రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మహారాష్ట్రలోని మరాఠా సంఘం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పింది. రిజర్వేషన్లను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. గతంలో రిజర్వేషన్లపై విధించిన 50 శాతం పరిమితిని ఇది అధిగమించిందని తెలిపింది. 2018లో మరాఠాలకు మహారాష్ట్ర సర్కార్‌ ఉద్యోగ నియామకాలు, విద్యాసంస్థల ప్రవేశాల్లో 16 శాతం రిజర్వేషన్‌ కల్పించింది.  దీన్ని వ్యతిరేకిస్తూ బాంబే హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. విచారణ జరిపిన కోర్టు రిజర్వేషన్లను సమర్థిస్తూ 2019లో తీర్పు వెలువరించింది. అయితే, కోటాను 16 శాతం నుంచి విద్యాసంస్థల ప్రవేశాల్లో 12 శాతానికి, ఉద్యోగ నియామకాల్లో 13 శాతానికి తగ్గించాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ కేసును విచారించిన జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం నేడు తుది తీర్పును వెలువరించింది.

ఆర్థిక, సామాజిక వెనకబాటుతనం ఆధారంగా మారాఠాలకు రిజర్వేషన్‌ కల్పించారని కోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడింది. గతంలో పార్లమెంటు చేసిన ఓ సవరణ ప్రకారం.. ఒక వర్గాన్ని సామాజిక, ఆర్థికంగా వెనుకబడిన జాబితా(ఎస్‌ఈబీసీ)లో చేర్చే హక్కు రాష్ట్రాలకు లేదని సుప్రీంకోర్టు గుర్తుచేసింది. రాష్ట్రాలు కేవలం ఆయా వర్గాలను గుర్తించి కేంద్రానికి సిఫార్సు మాత్రమే చేయాలని.. అనంతరం రాష్ట్రపతి వాటిని వెనుకబడిన వర్గాల జాబితాలో చేరుస్తారని వివరించింది. 

అలాగే, ఈ కోటా కింద ఇప్పటికే చేపట్టిన నియామకాలు, విద్యాసంస్థల ప్రవేశాలపై తాజా తీర్పు ప్రభావం ఉండబోదని.. వాటిని అలాగే కొనసాగించాలని స్పష్టం చేసింది. మండల్‌ తీర్పుగా పేరొందిన ఇందిరా సాహ్నీ తీర్పు (1992)ను  పునఃసమీక్షించాల్సిన అసవరం కూడా లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పీజీ మెడికల్‌ కోర్సుల్లో మునుపటి ప్రవేశాలు కొనసాగుతాయని వెల్లడించింది. గతంలో జరిగిన అన్ని నియామకాలకు ఎలాంటి ఇబ్బంది లేదని వివరించింది.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని