
తాజా వార్తలు
వేసవి నాటికి 10 వ్యాక్సిన్లు
తయారీకి తప్పనిసరి లైసెన్స్‌పై ఐఎఫ్పిఎంఏ విముఖత
జెనీవా: వచ్చే వేసవి నాటికి ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారిని అరికట్టే 10 వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అంతర్జాతీయ ఔషధ తయారీ సంస్థల సమాఖ్య(ఐఎఫ్పిఎంఏ) వెల్లడించింది. ఫైజర్, మోడెర్నా, ఆస్ట్రాజెనెకా నుంచి ఇప్పటికే మంచి ఫలితాలు వెలువడ్డాయని తెలిపింది. అయితే, టీకాను వేగంగా తీసుకురావాలన్న తొందరలో భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఐఎఫ్పిఎంఏ డైరెక్టర్ జనరల్ థామస్ క్వెనీ స్పష్టం చేశారు.
జాన్సన్ అండ్ జాన్సన్, నోవావాక్స్, సనోఫీ పాశ్చర్, మెర్క్, జీఎస్కే నుంచి కూడా త్వరలోనే మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉందని క్వెనీ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అనేక ఔషధ తయారీ, బయోటెక్ సంస్థలు కరోనా టీకాపై పరిశోధనలకు భారీగా వెచ్చించాయని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నాయన్నారు.
ఈ క్రమంలో ఆయా సంస్థలు తమ వ్యాక్సిన్‌పై పెటేంట్ హక్కుల్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల జరిగిన ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో) సదస్సులో టీకా తయారీకి ‘తప్పనిసరిగా లైసెన్స్’ ఇవ్వాలన్న కొన్ని దేశాల ప్రతిపాదనపై క్వెనీ అభ్యంతరం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ తయారీ ఎన్నో భద్రతా ప్రమాణాలను పాటిస్తూ నిపుణుల పర్యవేక్షణలో అత్యంత జాగ్రత్తగా చేపట్టాల్సిన ప్రక్రియ అని తెలిపారు. సరైన ప్రమాణాలు పాటించని సంస్థ చేతికి తయారీ హక్కులు వెళితే భద్రత విషయంలో లోపం తలెత్తే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు ఏ వ్యాక్సిన్‌కూ ‘తప్పనిసరి లైసెన్స్’ ఇవ్వలేదని తెలిపారు. మహమ్మారి వ్యాప్తి సమయంలో అన్ని ఔషధ తయారీ కంపెనీలు ఎలాంటి లాభాపేక్ష లేకుండా అందుబాటు ధరలో టీకా అందించేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.