IND vs PAK: ప్రపంచకప్‌లో భారత్‌ను ఓడిస్తాం: పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌

ప్రధానాంశాలు

Updated : 15/10/2021 18:48 IST

IND vs PAK: ప్రపంచకప్‌లో భారత్‌ను ఓడిస్తాం: పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌

కరాచి: ప్రపంచకప్‌లో భారత్‌ను ఓడించగలమని పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. యూఏఈలో పరిస్థితులపై తమకు మంచి అవగాహన ఉందని అన్నాడు. ‘‘గత 3-4 ఏళ్లుగా మేం యూఏఈలో క్రికెట్‌ ఆడుతున్నాం. ఇక్కడి పరిస్థితులపై మాకు చక్కని అవగాహన ఉంది. పిచ్‌ ఎలా స్పందిస్తుందో, బ్యాట్స్‌మెన్‌ ఎలా సర్దుబాట్లు చేసుకోవాలో మాకు బాగా తెలుసు. మ్యాచ్‌ రోజు ఎవరు బాగా ఆడితే వాళ్లు గెలుస్తారు. మేం గెలుస్తాం’’ అని బాబర్‌ చెప్పాడు. తమ జట్టు ఆత్మవిశ్వాసంతో ఉందని అన్నాడు. 2009 తర్వాత అంతర్జాతీయ జట్లు తమ దేశానికి రావడం మానేయడంతో పాకిస్థాన్‌ తన సొంతగడ్డపై ఆడాల్సిన మ్యాచ్‌లను యూఏఈలో ఆడుతున్న సంగతి తెలిసిందే.

నిర్భయంగా ఆడండి... భారత్‌తో టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌లో నిర్భయంగా ఆడడమే పాకిస్థాన్‌ అవకాశాలకు కీలకమని ఆ జట్టు మాజీ కెప్టెన్‌ మియాందాద్‌ అన్నాడు. ఈ రెండు జట్లు ఈ నెల 24న తలపడనున్నాయి. టోర్నీలో రెంటికీ అదే తొలి మ్యాచ్‌. భారత్‌.. వన్డే ప్రపంచకప్‌లో గానీ, టీ20 ప్రపంచకప్‌లోనూ గానీ ఎప్పుడూ పాకిస్థాన్‌ చేతిలో ఓడిపోలేదు. ‘‘టోర్నమెంట్లో జోరందుకోవడానికి భారత్‌తో మ్యాచ్‌ కీలకం. అది చాలా బలమైన జట్టు. అగ్రశ్రేణి ఆటగాళ్లు ఆ జట్టులో ఉన్నారు. కానీ పాక్‌ ఎలాంటి భయం, ఒత్తిడి లేకుండే ఆడితే.. ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషిస్తే వాళ్లను ఓడించవచ్చు’’ అని మియాందాద్‌ అన్నాడు. సమష్టిగా ఆడితే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ మెరుగైన ఫలితాలు రాబట్టగలదని చెప్పాడు. జట్టు కేవలం బాబర్‌ అజామ్‌పైనే ఆధారపడొద్దని అన్నాడు. టీ20 క్రికెట్టంటే సిక్స్‌లు, ఫోర్లు కొట్టడమే కాదని చెప్పాడు. ‘‘ఎప్పుడూ బాదడం కోసమే ప్రయత్నించొద్దు. సరైన సమయం చూసి ప్రణాళికలను అమలు చేయాలి’’ అని మియాందాద్‌ అన్నాడు.

 



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన