అప్పుడు కొవిడ్‌ పోరులో.. ఇప్పుడు పతక వేటలో

ప్రధానాంశాలు

Published : 29/07/2021 03:02 IST

అప్పుడు కొవిడ్‌ పోరులో.. ఇప్పుడు పతక వేటలో

కరోనా మహమ్మారిపై ఎడతెగని పోరాటం చేసిన వైద్యులు, నర్సులు వాళ్లు.. కానీ ఇప్పుడు వాళ్ల పోరాటం టోక్యోలో ఉంది. కారణం ఒలింపిక్స్‌! ఒకప్పుడు పీపీఈ కిట్లు ధరించి సేవలందించిన వాళ్లే ఇప్పుడు బరిలో దిగి పతకాల కోసం పోటీపడుతున్నారు. అలాంటి వాళ్లెవరో చూద్దామా..

సెలైన్‌ పెట్టి.. స్వర్ణం కొట్టి: కొవిడ్‌ సమయంలో నర్స్‌గా సేవలందించిన ఇరాన్‌ షూటర్‌ జావెద్‌ ఒలింపిక్స్‌లో పతకంతో మెరిశాడు. 10 మీటర్ల ఎయిర్‌పిస్టల్‌లో అతడు పసిడి గెలిచాడు. అంతేకాదు ప్రపంచ రికార్డు కూడా సృష్టించాడు. సేవలందించే క్రమంలో రెండుసార్లు కొవిడ్‌ బారినపడ్డా కూడా శిక్షణ కొనసాగించాడు.

స్టెత్‌ పక్కనపెడితే..: అర్జెంటీనా అమ్మాయి పౌలా పెరెటో వృత్తిరీత్యా వైద్యురాలు. కొవిడ్‌ సమయంలో ప్రాణాలకు తెగించిన ఎంతోమందికి వైద్యం అందించింది. అయితే స్టెత్‌ పక్కనపెడితే ఆమె ఓ జూడో ఛాంపియన్‌ అయిపోతుంది. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన పౌలా.. రియో క్రీడల్లో స్వర్ణం కైవసం చేసుకుంది. టోక్యోలోనూ బరిలో దిగింది.

అటు వేగం.. ఇటు వైద్యం: గాబి థామస్‌.. అత్యంత వేగంగా 200 మీటర్ల పరుగును పూర్తి చేసిన అథ్లెట్ల జాబితాలో ఆమెది రెండో స్థానం. అయితే ట్రాక్‌ దాటిందంటే ఆమె వైద్య పరిశోధనలో మునిగిపోతుంది. వృత్తిరీత్యా ఎపిడిమాలజిస్ట్‌ అయిన గాబి.. టెక్సాస్‌ యూనివర్సిటీలో పరిశోధనాశాలలో పని చేస్తోంది. ఒలింపిక్స్‌ ట్రయల్స్‌లో 200 మీ పరుగును 21.61 సెకన్లలో పూర్తి చేసిన గాబీ.. టోక్యోలో సత్తాచాటాలనే ఉత్సాహంతో ఉంది.

నర్సుగా పనిచేసి: కొవిడ్‌ మహమ్మారి తీవ్రంగా ఉన్న వేళ ఆస్ట్రేలియాకు చెందిన రేచల్‌ లీచ్‌ నర్సుగా పని చేసింది. ఒక మైనింగ్‌ కంపెనీలో కొవిడ్‌ సేవలందించింది. అయితే టోక్యోలో ఆమె గోల్స్‌ను ఆపే పనిలో ఉంది. ఎందుకంటే ఆస్ట్రేలియా హాకీ జట్టులో గోల్‌కీపర్‌ కనుక. అత్యవసర సమయాల్లో నర్సుగా పని చేయడం.. ఇప్పుడు ఒలింపిక్స్‌కు వచ్చి దేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందని ఆమె తెలిపింది. ఆస్ట్రేలియా తరఫునే కయాకింగ్‌లో బరిలో దిగుతున్న జో బ్రిడెన్‌ జోన్స్‌ కూడా అంబులెన్స్‌ డ్రైవర్‌గా పని చేస్తోంది. కొవిడ్‌ సమయంలో వేగంగా స్పందించిన ఆమె ఎంతోమంది ప్రాణాలు నిలవడంలో తన వంతు పాత్ర పోషించింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన