చర్చ లేకుండానే పార్లమెంటు వాయిదా

ప్రధానాంశాలు

Published : 27/07/2021 06:10 IST

చర్చ లేకుండానే పార్లమెంటు వాయిదా

మళ్లీ కుదిపేసిన పెగాసస్‌
విపక్షాల నిరసనల నడుమ రెండు బిల్లులకు ఆమోదం
మీరాబాయి చానును అభినందించిన ఉభయసభలు

దిల్లీ: ఫోన్లపై నిఘా, రైతుల ఉద్యమ సంబంధిత ప్రస్తావనలతో సోమవారం కూడా పార్లమెంటు ఉభయ సభలు వేడెక్కాయి. పెగాసస్‌ వ్యవహారంపై తమ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటూ విపక్ష సభ్యులు లోక్‌సభ, రాజ్యసభలను స్తంభింపజేశారు. గందరగోళం నడుమ ఉభయ సభలూ మంగళవారానికి వాయిదా పడ్డాయి. వ్యాపారాలకు సంబంధించిన రెండు వేర్వేరు బిల్లుల్ని లోక్‌సభ ఆమోదించింది. ఈసారి వర్షాకాల సమావేశాల్లో ఆమోదం పొందిన తొలి బిల్లులు ఇవి. తాము లేవనెత్తిన అంశాలపై చర్చ జరగాలంటూ విపక్ష సభ్యులు నిరసనలు కొనసాగించడంతో ఈ రెండు బిల్లులపై చర్చించడానికి ఆస్కారం లభించలేదు. గందరగోళం నడుమే ‘దివాలా స్మృతి సవరణ బిల్లు’ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టారు. 1999 కార్గిల్‌ యుద్ధంలో దేశం తరఫున పాకిస్థాన్‌తో పోరాడి అమరులైన వీరులకు స్పీకర్‌ ఓంబిర్లా అంతకుముందు నివాళులర్పించారు. యుద్ధవీరుల త్యాగాలను కొనియాడారు. ఆనాటి త్యాగాలకు నివాళిగా సభ్యులంతా మౌనం పాటించారు. టోక్యో ఒలింపిక్స్‌లో మన దేశం తరఫున పాల్గొని వెయిట్‌ లిఫ్టింగ్‌లో రజత పతకాన్ని సాధించిన మీరాబాయి చానును స్పీకర్‌ అభినందించారు. ఆ తర్వాత విపక్ష సభ్యులు సభాపతి స్థానం వద్ద బైఠాయించారు. పెగాసస్‌పై సమాధానం చెప్పడానికి సభకు ప్రధాని నరేంద్రమోదీ రావాలని డిమాండ్‌ చేశారు.

ప్రతిపక్షం అడ్డుకోవడంపై వెంకయ్యనాయుడు ఆవేదన

కార్గిల్‌ యుద్ధవీరులకు నివాళులు, ఒలింపిక్‌ పతక విజేత మీరాబాయి చానుకు అభినందనలు తెలిపిన అనంతరం.. రాజ్యసభలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. కాంగ్రెస్‌, టీఎంసీ సహా విపక్ష ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. దీంతో సభ రోజుమొత్తం మీద ఐదుసార్లు వాయిదా పడింది. ఈ సందర్భంగా విపక్ష సభ్యుల తీరుపై ఛైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు అసహనం వ్యక్తం చేశారు. ప్రజా ప్రాముఖ్య అంశాలను మిగతా సభ్యులు ప్రస్తావించకుండా వారు అడ్డుకుంటున్నారని వ్యాఖ్యానించారు. శూన్యగంట, ప్రత్యేక ప్రస్తావనల ద్వారా ముఖ్యమైన అంశాలను లేవనెత్తవచ్చని చెప్పారు. 267 నిబంధన కింద పలువురు విపక్ష నేతలు ఇచ్చిన నోటీసులను ఆయన అనుమతించలేదు. రోజురోజుకూ నిస్సహాయంగా తయారవుతున్నామని ఆవేదన వ్యక్తం చేసి, సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన