ఏదో ఒకరోజు యావత్‌ కశ్మీర్‌ మనదే

ప్రధానాంశాలు

Updated : 28/10/2021 10:35 IST

ఏదో ఒకరోజు యావత్‌ కశ్మీర్‌ మనదే

పీవోకే స్వాధీనానికి ప్రస్తుతం ప్రణాళిక లేదు

భారత వాయుసేన ఉన్నతాధికారి వెల్లడి

శ్రీనగర్‌: పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)ను స్వాధీనం చేసుకోవాలనే ప్రణాళికేదీ ప్రస్తుతానికి లేదని భారత వాయుసేన పశ్చిమ దళం ‘ఎయిర్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఇన్‌ చీఫ్‌’, ఎయిర్‌ మార్షల్‌ అమిత్‌ దేవ్‌ స్పష్టం చేశారు. అయితే యావత్‌ కశ్మీర్‌ ఏదో ఒకనాడు భారత్‌ సొంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత సేనలు బద్గాంలో అడుగుమోపిన ఘటన 75వ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం శ్రీనగర్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. పీవోకేలో ఉన్న ప్రజల్ని పాకిస్థానీలు తగిన రీతిలో చూడడం లేదని చెప్పారు. ఐరాస జోక్యం చేసుకుని ఉండకపోతే ఖాయంగా కశ్మీర్‌ మొత్తం భారత్‌కే చెంది ఉండేదని అన్నారు. డ్రోన్లతో కలిగించగలగే నష్టం తక్కువేననీ, దానిని ఎదుర్కొనే పరికరాలూ మనవద్ద ఉన్నాయని చెప్పారు.

ఆనాటి సన్నివేశం పునఃసృష్టి

1947 అక్టోబరు 27న సైన్యం, వాయుసేన కలిసి బద్గాంకు స్వేచ్ఛ కల్పించిన తీరును శ్రీనగర్‌ శివార్లలోని రంగ్‌రీత్‌ వైమానిక స్థావరం వద్ద పునఃసృష్టించారు. పాక్‌ సేనల నుంచి కశ్మీర్‌ను రక్షించడానికి సైన్యం ఎలాంటి ప్రయత్నం చేసిందో దీని ద్వారా వివరించారు. ఆనాడు పాక్‌ అకృత్యాలకు అడ్డుకట్ట వేయడంలో అమరులైన సైనిక వీరులను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన