ప్రగతికి పునాది

ప్రధానాంశాలు

Updated : 14/10/2021 10:06 IST

ప్రగతికి పునాది

పీఎం గతిశక్తి బృహత్‌ ప్రణాళికను ఆవిష్కరించిన మోదీ

వేగం పుంజుకోనున్న మౌలిక వసతుల అభివృద్ధి 

నవ భారత నిర్మాణానికి దోహదం

ఈనాడు, దిల్లీ: ప్రగతి పథంలో దేశాన్ని పరుగులు పెట్టించే బృహత్తర కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు. దేశాన్ని రోడ్డు, రైలు, విమానం, విద్యుత్తు, ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ వ్యవస్థలతో అనుసంధానించేందుకు రూ.100 లక్షల కోట్లతో ప్రతిష్ఠాత్మక ‘పీఎం గతిశక్తి’ మాస్టర్‌ ప్లాన్‌ను దిల్లీలో బుధవారం ఆవిష్కరించారు. రాబోయే పాతికేళ్ల అభివృద్ధికి ఈ ప్రణాళిక ద్వారా పునాది వేస్తున్నట్లు ఉద్ఘాటించారు.

21వ శతాబ్దపు అవసరాలకు తగ్గట్టుగా నవ భారత్‌ను నిర్మించేందుకు అది దోహదపడుతుందన్నారు. పీఎం గతిశక్తి బృహత్‌ ప్రణాళిక ఆవిష్కరణ కార్యక్రమంలో మోదీ ప్రసంగిస్తూ.. ‘‘ప్రభుత్వ పని అనే మాట వినిపిస్తే చాలు.. నాణ్యతాలోపం, ఏళ్ల తరబడి సాగదీత, ప్రజాధనం వృథా వంటి ప్రతికూల ఆలోచనలే ప్రజల మనసుల్లో మెదులుతుంటాయి. ప్రజాధనాన్ని వృథా చేయకూడదన్న భావన గత ప్రభుత్వాల్లో కొరవడింది. ఫలితంగా సర్కారీ పథకాల అమలులో ఉదాసీనత కనిపించేది. అలాంటి పరిస్థితులు ఉన్నంత కాలం దేశ ప్రగతి సాధ్యం కాదు. ఆ జాడ్యాలను వదిలి మా ప్రభుత్వం ముందుకు కదులుతోంది. పురోగతి కోసం పరిశ్రమిస్తోంది. ప్రాజెక్టులను సరైన సమయంలో పూర్తిచేసే సంస్కృతిని తీసుకొచ్చింది’’ అని పేర్కొన్నారు.

‘‘మౌలిక వసతుల ప్రాజెక్టుల విషయంలో తగిన ప్రణాళికలు కొరవడటంతో గతంలో ఎన్నో అడ్డంకులు ఎదురయ్యేవి. రైల్వే, రోడ్డు రవాణా, టెలికాం, గ్యాస్‌ నెట్‌వర్క్‌ విభాగాల వారు ఎవరికివారు సొంత ప్రణాళికలను అమలు చేసుకుంటూ పోవడంతో.. చేసిన పనినే మళ్లీ మళ్లీ చేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి. సమయం, డబ్బు వృథా అయ్యాయి. దశాబ్దాలుగా నిలిచిపోయిన ప్రాజెక్టుల పనులను నేను ప్రధాని పీఠమెక్కాక సమీక్షించాను. అన్ని విభాగాలు, శాఖలను ఏకతాటిపైకి తీసుకొచ్చాను. ఫలితంగా ప్రస్తుతం చాలా ప్రాజెక్టులు పూర్తవుతున్నాయి. ఇకపై మౌలికవసతులకు సంబంధించిన అన్ని ప్రాజెక్టులను పీఎం గతిశక్తి మాస్టర్‌ ప్లాన్‌తో అనుసంధానిస్తాం. ఒక శాఖ (డిపార్ట్‌మెంట్‌) చేసే పనిని మరో శాఖ తెలుసుకునేలా సాంకేతిక వేదికను తయారుచేశాం. ఇందులో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా జతకావొచ్చు. దానివల్ల ఎప్పుడు ఏ పనిచేయాలన్నది అందరికీ స్పష్టంగా తెలుస్తుంది. ప్రభుత్వ ప్రణాళికల అమలు వేగం పుంజుకుంటుంది. డబ్బు, సమయం ఆదా అవుతాయి. ప్రాజెక్టులు తక్కువ ఖర్చుతో, సరైన సమయంలో పూర్తయ్యేందుకు పీఎం గతిశక్తి దోహదపడుతుంది. పారిశ్రామికవేత్తలు, రైతులు, గ్రామాలు, వర్తమాన-భవిష్యత్తు తరాలకు అవసరమైన 21 శతాబ్దపు భారత నిర్మాణానికి ఇది కొత్త శక్తిని అందిస్తుంది’’ అని మోదీ పేర్కొన్నారు.

మౌలికవసతుల రంగంలో విజయబావుటా

‘‘సుస్థిర అభివృద్ధికి.. మౌలికవసతుల కల్పన తప్పనిసరి అన్న సిద్ధాంతం ప్రపంచవ్యాప్తంగా నిరూపితమైంది. అది ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చి పెద్దఎత్తున ఉపాధికి బాటలు వేస్తుంది’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రాబోయే నాలుగైదేళ్లలో రైల్వే, పోర్ట్‌ కార్గోని పెంచడం, పోర్టుల్లో టర్న్‌అరౌండ్‌ సమయం తగ్గించడమే తమ లక్ష్యమని ప్రకటించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పనుల వేగం పెరిగిందని గుర్తుచేశారు. దేశంలో 1987లో సహజవాయు పైప్‌లైన్‌ ప్రారంభమైన తర్వాత 27 ఏళ్లలో 15 వేల కిలోమీటర్ల నిర్మాణం జరిగితే, తాము అధికారంలోకి వచ్చాక 5-6 ఏళ్లలోనే 16 వేల కిలోమీటర్లు పూర్తిచేసినట్లు పేర్కొన్నారు. 2014కు ముందు అయిదేళ్లలో 1,900 కిలోమీటర్ల రైల్వేలైన్‌ను డబ్లింగ్‌గా మారిస్తే, గత ఏడేళ్లలో తాము 9 వేల కిలోమీటర్లను డబ్లింగ్‌ చేసినట్లు చెప్పారు. గత ప్రభుత్వ చివరి అయిదేళ్లలో 3 వేల కిలోమీటర్ల రైల్వేలైన్‌ను విద్యుదీకరిస్తే గత ఏడేళ్లలో 24 వేల కిలోమీటర్లను విద్యుదీకరించినట్లు చెప్పారు. 2014కు ముందు దేశంలో 250 కిలోమీటర్ల మెట్రో రైల్‌ మార్గం నిర్మాణం జరిగితే తమ హయాంలో 700 కిలోమీటర్లు జరిగిందని, మరో వెయ్యి కిలోమీటర్లు నిర్మాణ దశలో ఉందని స్పష్టం చేశారు. 2014కు ముందు అయిదేళ్లలో కేవలం 60 గ్రామ పంచాయతీలకు ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ కనెక్షన్‌ ఇస్తే గత 7 ఏళ్లలో తాము 1.5 లక్షల పంచాయతీలకు ఫైబర్‌ అనుసంధానం కల్పించినట్లు వివరించారు. ఇదివరకు 2కు పరిమితమైన మెగా ఫుడ్‌పార్క్‌లు ఇప్పుడు 19కి చేరాయని, వీటిని 40కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇదివరకు 5 వరకు ఉన్న అంతర్గత జలరవాణా వ్యవస్థలు ఇప్పుడు 13కు చేరినట్లు తెలిపారు. పోర్టుల్లో టర్నఅరౌండ్‌ సమయం 41 గంటల నుంచి 27 గంటలకు తగ్గినట్లు చెప్పారు. విద్యుత్తు సరఫరా వ్యవస్థ ఇదివరకు 3 లక్షల సర్క్యూట్‌ కిలోమీటర్లు ఉండగా, ఇప్పుడు అది 4.25 లక్షల సర్క్యూట్‌ కిలోమీటర్లకు చేరినట్లు చెప్పారు. జన్‌ధన్‌, ఆధార్‌, మొబైల్‌ ద్వారా ప్రభుత్వ పథకాలను నేరుగా ప్రజలకు వద్దకు తీసుకెళ్లడంలో విజయవంతమైన తమ ప్రభుత్వం ఇప్పుడు పీఎం గతిశక్తి ద్వారా మౌలికవసతుల రంగంలో విజయబావుటా ఎగురవేస్తుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు.

పీఎం గతిశక్తి కింద విధించుకున్న మరికొన్ని లక్ష్యాలు (2024-25 కల్లా సాధించేందుకు..)

* రైల్వే కార్గో హ్యాండ్లింగ్‌ సామర్థ్యాన్ని 1,210 మిలియన్‌ టన్నుల నుంచి 1,600 మిలియన్‌ టన్నులకు పెంచడం. ఓడరేవుల్లో కార్గో సామర్థ్యం 1,282 మిలియన్‌ టన్నుల నుంచి 1,759 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులకు చేర్చడం. జాతీయ జల రవాణా మార్గం నుంచి సరకు రవాణాను 74 మిలియన్‌ టన్నుల నుంచి 95 మిలియన్‌ టన్నులకు పెంచడం.

* 2027 కల్లా అన్ని రాష్ట్రాలను ట్రంక్‌ న్యాచురల్‌ గ్యాస్‌ పైప్‌లైన్‌ నెట్‌వర్క్‌తో అనుసంధానించడం.

* 202 ఫిషింగ్‌ క్లస్టర్లు/హార్బర్లు/ల్యాండింగ్‌ సెంటర్ల అభివృద్ధి.

* 220 విమానాశ్రయాలు, హెలిప్యాడ్లు, వాటర్‌ ఏరోడ్రోమ్స్‌ అందుబాటులోకి తీసుకురావడం.

* 197 మెగా ఫుడ్‌పార్కులు, ఆగ్రోప్రాసెసింగ్‌ సెంటర్ల ఏర్పాటు. ఆహారశుద్ధి సామర్థ్యం 222 లక్షల టన్నుల నుంచి 847 లక్షల టన్నులకు పెంపు.

* 90 మెగా టెక్స్‌టైల్‌ పార్కుల నిర్మాణం.

* 38 ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటుచేసి, అక్కడి ఉత్పత్తి సామర్థ్యాన్ని రూ.15 లక్షల కోట్లకు చేర్చడం.

* ప్లగ్‌ అండ్‌ ప్లే విధానంలో 23 క్లస్టర్ల ఏర్పాటు.

* 109 ఫార్మా, మెడికల్‌ డివైజ్‌ క్లస్టర్ల ఏర్పాటు. 

చివరి మైలు వరకూ అడ్డంకుల్లేని అనుసంధానత

రాబోయే నాలుగైదేళ్లలో రైలు, ఓడరేవు మార్గాల్లో సరకు రవాణాను పెంచే దిశగా కృషిచేయనున్నట్లు ప్రధాని తెలిపారు. ప్రస్తుతం దేశంలో ఉత్పత్తి కేంద్రాల నుంచి ఓడరేవులు, విమానాశ్రయాలకు అనుసంధానం కొరవడిందని అన్నారు. ఫలితంగా రవాణా ఖర్చులు అధికమై, ఉత్పత్తి వ్యయం పెరిగిపోతోందన్నారు. దేశంలో లాజిస్టిక్‌ ఖర్చు జీడీపీలో 13% మేర ఉందని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇలాంటి పరిస్థితి లేదన్నారు. ఉత్పత్తి కేంద్రాల నుంచి ఓడరేవులకు సరకులు తరలించడానికి మన దేశంలో ఎగుమతిదారులు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని గుర్తుచేశారు. ఎగుమతుల ప్రపంచంలో ఎదురయ్యే పోటీని తట్టుకోవడంలో ఇది ప్రతిబంధకంగా మారుతోందని చెప్పారు. ఇకపై చివరి మైలు వరకూ అడ్డంకులు లేని అనుసంధానత కల్పించడానికి పీఎం గతిశక్తి ఉపకరిస్తుందన్నారు.


పీఎం గతిశక్తి లక్ష్యాలు

* 11 పారిశ్రామిక నడవాల నిర్మాణం. తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌లో రక్షణ కారిడార్ల ఏర్పాటు.

* 35 లక్షల కిలోమీటర్ల మేర ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ నిర్మించి, 2.5 లక్షల గ్రామ పంచాయతీలకు 2022 కల్లా నెట్‌వర్క్‌ అనుసంధానం కల్పించడం. 2023 కల్లా అన్ని గ్రామాలకూ 4జీ అంతర్జాల అనుసంధానత ఏర్పాటుచేయడం.

* పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని 87.7 గిగావాట్ల నుంచి 225 గిగావాట్లకు పెంచడం. ఉత్పత్తయ్యే విద్యుత్తులో 50% వాటా పునరుత్పాదక ఇంధనానిదే ఉండేలా చూడటం.

* జాతీయ రహదారుల పొడవును 2 లక్షల కిలోమీటర్లకు చేర్చడం.

* విద్యుత్తు సరఫరా వ్యవస్థను 4,54,200 సర్క్యూట్‌ కిలోమీటర్లకు పెంచడం.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన