close

తాజా వార్తలు

Published : 06/12/2019 01:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వెన్నకాని వెన్న... వెన్న లేకున్నా నేనున్నా!

హాయ్‌ ఫ్రెండ్స్‌... బాగున్నారా? నేను ఆవకాడో చెట్టును... నా ఫలాన్ని వెన్నపండు అంటారు తెలుసా..! నా విశేషాలు మీతో పంచుకుందామని ఇదిగో.. ఇలా వచ్చాను. ఇంకెందుకాలస్యం.. చదివేయండి మరి!

క్రీస్తు పూర్వం నుంచే...
* నేను మధ్య మెక్సికో ప్రాంతానికి చెందిన చెట్టును.
* పెర్సీ అమెరికానా.. నా శాస్త్రీయ నామం.
* సుమారు 66 అడుగుల ఎత్తు పెరుగుతాను.
* నా ఫలాలను క్రీస్తు పూర్వం 10 వేల సంవత్సరాల నుంచే తింటున్నారు.
* దక్షిణ, మధ్య అమెరికాల్లో క్రీస్తు శకం 900 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు.
* నేను సారవంతమైన ఎర్రనేలల్లో పెరుగుతాను.
* మీ దేశంలో దక్షిణాది రాష్ట్రాల్లో అక్కడక్కడా.. ఇప్పుడిప్పుడే నన్ను పెంచుతున్నారు.
* విత్తనం నాటిన 4 నుంచి 6 సంవత్సరాలకు కాయలు కాస్తాను.
* చొక్వెట్‌, హాస్‌, గ్వెన్‌, లుల, పింకర్టన్‌, రీడ్‌, బెకాన్‌, బ్రాగ్డెన్‌, ఏట్టింగర్‌ అనేవి నాలో రకాలు. ఇందులో కొన్ని కాయలు ఆకుపచ్చగా, కొన్ని నలుపు రంగులో ఉంటాయి.  
* నలుపురంగులో కనిపించే హాస్‌, ఆకుపచ్చరంగులో కనిపించే గ్వెన్‌ రకాలు ఎక్కువగా సాగు చేస్తున్నారు.
* నా పండు లోపల మెత్తగా ఉంటుంది. తింటే కొద్దిగా ఆవు వెన్న రుచిలా అనిపిస్తుంది. చిరు చేదుగానూ ఉంటుంది.

పండుతో ప్రయోజనాలు
* వెన్న పూస దొరకని సమయాల్లో చిన్న పిల్లలకు నా పండు మంచిదని పెడతారు.
* నా పండ్లలో ఎక్కువ శాతం కొవ్వు ఉన్నప్పటికీ గుండెకు మేలు చేస్తుంది. ఎందుకంటే బీ6, ఫోలిక్‌ ఆమ్లం ఎక్కువగా ఉంటుంది.
* 100 గ్రాముల నా పండు గుజ్జు తింటే మీకు 160 కిలో కేలరీల శక్తి వచ్చేస్తుంది.
* అరటి పండులో కంటే ఎక్కువ పొటాషియం నా పండులోనే ఉంటుంది.
* ఇంకా మీకు ఎ, బి, ఇ విటమిన్లూ లభిస్తాయి. వీటితో పాటు సమృద్ధిగా పీచు పదార్థం, ఖనిజాలు ఉంటాయి.
* వెన్నకు బదులుగా నన్ను కొన్ని హోటళ్లలో మాంసాహార వంటకాల్లో వాడతారు.
* నా పండు గుజ్జును సలాడ్లు, ఇంకా బోలెడు రకాల ఐస్‌క్రీంల తయారీలోనూ వాడతారు.
* నా పండు తినడం వల్ల మీ గుండెకు, చర్మానికి మంచిది. ఇన్సులిన్‌ ఉత్పత్తి సమన్వయం అవుతుంది. కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
* అన్నీ ఓకే కానీ.. నా ఆకులు, బెరడు కాస్త విషపూరితం. ఇవి.. ఆవులు, గేదెలు, మేకలు, కుందేళ్లు, పక్షులు, గుర్రాలకు హాని చేస్తాయి.

ఒకే ఒక గింజ!

* పండు మధ్యలో ఒకే ఒక గింజ ఉంటుంది. వీటిని కొన్ని ఔషధాల తయారీలో వాడుతారు.
* దాల్చినచెక్క, కర్పూర చెట్టు, బే లౌరెల్‌ చెట్లు చాలా వరకు నన్ను పోలి ఉంటాయి.
* నన్ను అవకాడో, వెన్న పండు అనే కాదు, అలగేటర్‌ పియర్‌ అనీ పిలుస్తుంటారు.


మామిడి కాయతో ఆవకాయ ఎలా తయారుచేస్తారో.. అలాగే అవకాడోతోనూ నిల్వపచ్చడి చేసు కోవచ్చు.
* కేలరీలు, ఆరోగ్యవంతమైన కొవ్వు అధికంగా ఉండటం వల్ల సహజ సిద్ధంగా బరువు పెరగాలనుకునే వారికి అవకాడో ఉపయోగ పడుతుంది.

ఇప్పటికే మీతో చాలా విషయాలు చెప్పా... నేను ఉంటాను మరి.. బై...బై.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన