close

తాజా వార్తలు

వీడు ఎక్కువ చేస్తున్నాడు అనుకున్నావా క్రిష్‌: నాని

‘వాడు దిల్లీ వెళ్లనని ఏడుస్తూ కూర్చున్నాడు’

నేచురల్‌ స్టార్‌, గౌతమ్‌ను ఇంటర్వ్యూ చేసిన క్రిష్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: రోజులు గడుస్తున్నా.. ‘జెర్సీ’ సినిమా విషయంలో తనపై కురుస్తున్న ప్రశంసల జల్లు ఆగలేదని కథానాయకుడు నాని ఆనందం వ్యక్తం చేశారు. ఈ చిత్రం విజయం సాధించిన నేపథ్యంలో దర్శకుడు క్రిష్‌.. నాని, దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరిని ఇంటర్వ్యూ చేశారు. ముందుగా సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకున్న క్రిష్‌ తర్వాత పలు ప్రశ్నలు అడిగారు.

క్రిష్‌: గౌతమ్‌ కథను అద్భుతంగా రాశారని అందరూ అంటున్నారు. దర్శకత్వం పక్కనపెడితే.. ఈ కథను ఆలోచించడం, రాయడం గొప్ప విషయం. దానికి నిన్ను నేను మెచ్చుకుంటున్నా. నిజానికి మనం ఎన్నో కథలు రాసుకుంటాం.. నిర్మాతల దగ్గరకు వెళ్తాం. వారు కూడా సినిమా చేయడానికి రెడీగానే ఉంటారు. కానీ వీటికంటే ముందు ఓ హీరో కావాలి. కాబట్టి నీ కన్నా అగ్ర పీఠం నేను నానికి ఇస్తాను.

ఓ రోజు నేను నానితో కలిసి కూర్చుని ఉన్నా. నాని మామూలుగా మాట్లాడుతూ ‘జెర్సీ’ గురించి టూకీగా చెప్పాడు. ‘షూటింగ్‌ చివరిరోజు బాధ వచ్చేసింది క్రిష్‌. మళ్లీ నేను ఈ కథలో ఉండను. ఈ సినిమా తర్వాత నేను ఎలాంటి కథలు ఎంచుకోవాలి. ఎలా చేయాలి’ అని అన్నాడు. ఎంత గొప్పగా చెప్పాడంటే.. అతిశయోక్తిలాగా చెప్పాడు. (నాని అందుకుంటూ.. ‘వీడేంటి చాలా ఎక్కువ ఫీల్‌ అవుతున్నాడు ఈ సినిమా గురించి అనుకున్నావా?..’ నవ్వుతూ). లేదు.. తర్వాత ట్రైలర్‌ వచ్చింది. అమేజింగ్‌గా ఫీల్‌ అయ్యా. అప్పుడు నేను ముంబయిలో ఉన్నాను. చాలా సంతోషంగా నానికి వాయిస్‌ మెసేజ్‌ పెట్టా. తర్వాత థియేటర్‌లో సినిమా చూస్తున్నప్పుడు.. అందరూ లేని నిల్చుని చప్పట్లు కొట్టారు. నాతోపాటు థియేటర్‌కు వచ్చిన స్నేహితులు ‘రేపు పిల్లల్ని తీసుకురావాలి’ అని భావోద్వేగానికి గురయ్యారు. నేను ‘జెర్సీ’ని రెండు రోజుల తర్వాత మళ్లీ చూశా. నాని ఈ సినిమా కథను నమ్మి.. నేను డబ్బులు తర్వాత తీసుకుంటాను. ముందు ఈ కథ సినిమాగా రావాలి అనుకోవడం గొప్ప విషయం (ధన్యవాదాలు: నాని).

క్రిష్‌: ‘జెర్సీ’ సినిమా విడుదలై ఇన్ని రోజులైంది. ఇంకా ప్రశంసలు వస్తూనే ఉన్నాయా?
నాని: మామూలుగా ఓ సినిమా వచ్చినప్పుడు ప్రశంసల తాకిడంతా వారాంతంలో ఉంటుంది. సోమవారం నుంచి మనం వేరే పనుల్లో పడిపోతాం.. రోజులు గడుస్తున్న కొద్దీ మాట్లాడేవారు తగ్గిపోతుంటారు. కానీ ‘జెర్సీ’ విషయంలో అలా లేదు. వారాంతంలో విపరీతమైన స్పందన వచ్చింది. ఇదేంటి.. ఇదంతా నిజమేనా?అన్న రేంజ్‌లో ఓపెన్‌ అయ్యింది. మేమంతా నమ్మకంతో ఉన్నాం. ఎందుకంటే సినిమా అలా ఉంది. ప్రేక్షకులు ఈ సినిమాపై ఎంత ప్రేమ చూపిస్తారో ముందే ఊహించాం. అది నిజంగానే జరిగింది. చిత్ర పరిశ్రమలో నా సహ నటుడు చాలా ట్వీట్లు చేశారు. ఇంతకు ముందులా సినిమా బాగుంది, చాలా నచ్చింది అని మాట్లాడలేదు. మనసువిప్పి మాట్లాడారు.
క్రిష్‌: ఈ కథ మీరు రాసుకున్నారు. రాస్తున్నప్పుడు మనసులో అనుకున్న విధంగానే సన్నివేశాలు వచ్చాయా?
గౌతమ్‌: సినిమా చూసినప్పుడు రాసుకున్నదానికంటే బాగా వచ్చింది అనిపించింది. కొన్ని సీన్లు మిక్సింగ్‌ థియేటర్‌లో చూసినప్పుడు.. ఇదంతా మనం తీసిన సినిమానేనా? అని అనుమానం వచ్చింది (నవ్వుతూ).
నాని: ఇంతకు ముందు గౌతమ్‌ రచయితగా పనిచేశారు. ‘జెర్సీ’ కథ గురించి ఓ సందర్భంలో ఆయన నాతో మాట్లాడుతూ.. ‘సాధారణంగా ఓ సినిమా కథ రాస్తున్నప్పుడు హద్దులు ఉండవు కాబట్టి రాసుకుంటూ వెళ్లిపోతాం. కానీ సెట్‌పైకి వచ్చే సరికీ అనుకున్నదానికంటే తక్కువగానే అనిపిస్తుంది. తొలిసారి ‘జెర్సీ’ విషయంలో నేను రాసుకున్నదానికంటే బాగా షూట్‌ చేసినట్లు అనిపించింది’ అని అన్నారు.
గౌతమ్‌: అవును.. ఎందుకు అలా అన్నానంటే.. ఇప్పుడు అందరూ రైల్వేస్టేషన్‌ సీన్‌ చాలా బాగుంది అంటున్నారు. కానీ ఆ సీన్‌ స్క్రిప్టులో కేవలం ఒకపేరా ఉంటుంది అంతే.. కానీ అది షూట్‌ చేసినప్పుడు పూర్తిగా విభిన్నంగా వచ్చింది.
క్రిష్‌: నా సినిమా ‘వేదం’లో బన్నీ ఏడుస్తుంటాడు. అది అందరికీ అలా గుర్తుండి పోయింది. ‘జెర్సీ’లో నాని ఏడుస్తుంటే.. అందరూ మౌనంగా ఉండిపోయారు. నాని ప్రతి సీన్‌లో పాత్రకు జీవం పోశాడు. ఇది మాత్రం అతిశయోక్తికాదు.
నాని: చాలాసార్లు నేను, గౌతమ్‌ కొన్ని సీన్లు చర్చించుకున్నాం. తొలిసారి సినిమా చూస్తే ప్రేక్షకుడికి ఏమీ అనిపించకూడదు. కానీ మరోసారి చూస్తే.. ‘హో.. అందుకు ఇలా చేశారా..’ అనిపించాలి అనుకున్నాం. దాన్ని సవాలుగా తీసుకున్నాం.
క్రిష్‌: తొలిసారి సినిమాలో హీరోను చూసినప్పుడు వావ్‌ అనుకున్నా. రెండోసారి సినిమా చూసే సమయంలో నాకు కొన్ని సన్నివేశాల్లో మాటలు రాలేదు. ఎంతో బాధేసింది.
నాని: అవును.. అర్జున్‌ మనసులో ఏం జరుగుతోందని వచ్చే ఆలోచన గుండెల్ని పిండేస్తుంది.
గౌతమ్‌: నిజానికి నానికి ఓ సీన్‌ వివరిస్తున్నప్పుడు చెప్పడానికి కొంచెం బెరుకుగా అనిపించింది. ఎవరికైనా సరే.. వెళ్లి సీన్‌ ఇలా రావాలి అని చెప్పొచ్చు కానీ.. సినిమాను రెండో సారి చూసినప్పుడు ఇలా అనిపించాలి అంటే నాని కొడతారేమో అనుకున్నా (నవ్వుతూ). 
నాని: నాకు ఇంకా గుర్తుంది. క్రికెట్‌ మైదానంలో నేను అలసిపోయిన తర్వాత సత్యరాజ్‌ దగ్గరికి వెళ్లి.. కొంచెం తేడాగా ఉంది. ఆసుపత్రికి వెళ్దాం అనాలి. ఆసుపత్రికా!.. వీడికి ఏదో సమస్య ఉంది అని ప్రేక్షకులు అనుకోకూడదు. సినిమాను అలా తీయకూడదు అనుకున్నాం. సరే ఒక టేక్‌ తీశాం. మేం ఎలా అనుకున్నామో అలా వచ్చింది. అప్పుడు గౌతమ్‌.. ‘నేను ఏం చెప్పానో తెలియదు, మీరు ఏం చేశారో తెలియదు కానీ సీన్‌ మాత్రం అనుకున్నట్లే వచ్చింది’ అన్నారు (నవ్వుతూ).
గౌతమ్‌: కొన్ని సీన్లను మనం వివరించలేం. అది నటుడి కళ్ల నుంచి రావాలి. నాని సూపర్‌గా నటించారు.
క్రిష్‌: నాని నటించడం నేచురల్‌గా ఉంది అనడం సాధారణం. ఆయన బాగా చేస్తాడు కాబట్టే వెళ్లి కథ చెప్పారు. కానీ సినిమాలోని మిగిలిన వారు కూడా అంతే నేచురల్‌గా చేశారు. ఆ చిన్నపిల్లాడు రోనిత్‌, శ్రద్ధా శ్రీనాథ్‌, సత్యరాజ్‌ అద్భుతంగా చేశారు.
నాని: వాడే ఈ సినిమాకు సూపర్‌స్టార్‌. షూటింగ్ తర్వాత ఇక్కడి నుంచి వెళ్తున్నప్పుడు ఏడ్చేశాడు. మొన్న థాంక్స్‌ మీట్‌కు వచ్చినప్పుడు కూడా ఏడ్చాడు. మేమంతా ఈవెంట్ పూర్తి చేసుకున్నాం, చక్కగా జోక్‌లు వేసుకున్నాం. ఉన్నట్టుండి మా మేనేజర్‌ ఫోన్‌ చేసి.. సర్‌ పక్కన ఎవరైనా ఉంటే ఆ ఫోన్‌ నుంచి రోనిత్‌కు ఫోన్‌ చేయండి సర్‌ అని అన్నాడు. ఏమైంది అంటే.. ‘మళ్లీ దిల్లీ వెళ్లనని ఏడుస్తున్నాడు సర్‌ ’ అన్నాడు. వాళ్ల అమ్మవాళ్లంతా కంగారుపడ్డారు. వాడు కూడా నాతో అంత కలిసిపోయాడు.
క్రిష్‌: కొన్ని సినిమాలకు అన్నీ అలా కుదురుతాయి. ఇందాకా గౌతమ్‌ అన్నాడు.. ‘సర్‌ ఈ కథ ముందు నేను రాసుకున్నప్పుడు అంత కమర్షియల్‌ కాదు అనుకున్నా. కానీ మంచి ఫలితం లభించింది’ అన్నాడు. నువ్వు కథ కేవలం ఒక్క నానికి మాత్రమే చెప్పావు. తర్వాత నేరుగా నిర్మాత వంశీ దగ్గరికి వెళ్లావు. ఆయన ఒకే చెప్పారు. ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి నానికి ఆ విషయం చెప్పావు. దీనికంటే కమర్షియల్‌ ఏం ఉంటుంది గౌతమ్‌.
నాని: తెలుగులో తీసిన హీరోయిక్‌ ఫిల్మ్‌ ఇది. ఇక్కడ హీరోను గొప్పగా చూపించాలని అతిశయోక్తిగా ఏం చేయలేదు. అంతా సహజంగా చూపించాం.

క్రిష్‌: ఇక నుంచి మిమ్మల్ని ‘జెర్సీ’ లాంటి సినిమా తీయండి సర్‌ అంటారేమో.. ఇప్పటికే తీశాం అని చెప్పినా వినరేమో?

నాని: ఫర్వాలేదు ఆ మాట అన్నప్పుడు అది వేరే వాళ్ల సినిమా అయితే సమస్య, మన సినిమానే కాబట్టి ఓకే. మనం కూడా ఇక నుంచి పరిగెత్తుదాం.

 

 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.