close

తాజా వార్తలు

కొలువుల వేటలో అపూర్వ ఆయుధం

స్నేహితులే తోడుగా అలమ్నై నెట్‌వర్క్‌

కొలువుల వేటలో అపూర్వ ఆయుధం

కళాశాల జీవితమంటే ‘దోస్త్‌ మేరా దోస్త్‌’ అంటూ చెట్టాపట్టాలేసుకుని తిరగడం, నోట్స్‌ ఇచ్చి పుచ్చుకోవడం, మరెన్నో తీపి జ్ఞాపకాలు. ‘ఆ సినిమా బాగుంది, ఫలానా సంస్థలో ప్రాజెక్టు చేసే అవకాశం దొరుకుతుంది, నయా దుస్తుల ట్రెండ్‌ మార్కెట్‌లోకి వచ్చింది...’ కళాశాలలో ఉన్నంతవరకూ ఇదే రకం సమాచారం మార్పిడి అవుతుంది. ఇక్కడ స్నేహితులనే కాదు. తరగతిలో ప్రతి ఒక్కరికీ ఈ సమాచారం అందుతుంది. మరి ఆపై? కళాశాల జీవితం ముగియడంతోనే ఆ బంధానికి బ్రేక్‌ పడటమేనా? కొనసాగించాల్సిందేననీ, ఇది కెరియర్‌కు కూడా అద్భుతమైన తోడ్పాటునిస్తుందనీ అంటున్నారు నిపుణులు.

విద్యార్థి జీవితాన్ని ఓసారి గుర్తుచేసుకోండి. అల్లరితోపాటు.. పరీక్షలనగానే కంబైన్డ్‌ స్టడీలు, ప్రాజెక్టులగానే బృందంగా వాటి వేటలో పడిపోవడం, ప్రాంగణ నియామకాలకు స్నేహితులతో సాధన.. ఇవన్నీ గుర్తుకొస్తాయి. చదువు పూర్తవ్వగానే ఎవరి జీవితం వారిది. కానీ కాలేజ్‌ ఫెస్ట్‌, పండుగలు ఇలా ఏదో ఒక సందర్భంలో తరగతిలోని ప్రతి ఒక్కరితో కలిసి పనిచేసుంటారు కదా! మరి చదువు పూర్తయ్యాకా ఎందుకు కొనసాగించకూడదు? ఇంట్లో ఫంక్షన్లకో, ఈవెంట్లకో దగ్గరి స్నేహితులను ఎలాగూ పిలుస్తాం. ఏదైనా ప్రత్యేక రోజుల్లో ఫోన్లలో మాట్లాడుతాం. చాలు కదా! ఇంకా అలమ్నై (పూర్వ విద్యార్థులు) నెట్‌వర్క్‌ అవసరమేంటి? అనేదే చాలామంది ప్రశ్న.

కొలువుల వేటలో అపూర్వ ఆయుధం

వ్యక్తిగత ఎదుగుదలకు సహజంగా కుటుంబం ద్వారా వచ్చే బంధాలు సరిపోతాయి. వృత్తిరీత్యా ఎదగాలంటే స్నేహితులు, కలిసి చదివినవారి సహకారం అవసరమవుతుంది. వీరిలో ఆలోచనలు కలిసే వారితో సంబంధ బాంధవ్యాలు కొనసాగించడం మేలు. వీరిలో ఎవరైనా సంస్థల పరంగా బలమైన నేపథ్యం ఏర్పరచుకుంటే మీ నెట్‌వర్క్‌ పరిధి పెంచుకోవడానికే కాదు. భవిష్యత్తులో అవసరమైతే సాయం అవసరమైనపుడూ పనికొస్తుంది. మన దగ్గర కళాశాలలే ఎప్పుడైనా ఆయా సంవత్సరాల విద్యార్థులను ప్రత్యేకంగా ఆహ్వానించడం లాంటివో, విద్యార్థులే ప్రత్యేకంగా ఏడాదికో, రెండేళ్లకో సమావేశమవడమో మినహాయించి పెద్దగా ఏమీ ఉండదు.

కానీ విదేశాల్లో పరిస్థితి వేరు. విద్యాసంస్థల్లో ప్రత్యేకంగా దీనికో విభాగం ఉంటుంది. వీరు కార్యక్రమాలను నిర్వహించడం, ప్రత్యేకంగా ఒక్కొక్కరికీ లేఖలు పంపడం, నిధులను సేకరించడం, వ్యాపార సంబంధాలను మెరుగుపరచడం వంటివి చేస్తుంటారు. ఒక్కోసారి పూర్వ విద్యార్థులు ప్రస్తుత విద్యార్థులకు కెరియర్‌ పరంగా సలహాలు ఇవ్వడం ద్వారా తోడ్పడుతుంటారు.

ఆరంభం.. ఎప్పుడు?ఎలా?

ఏ పనినైనా మొదలుపెట్టడానికి ‘ఇదే సరైన సమయం’ అనేదేమీ ఉండదు. కానీ, ప్రారంభించిన సమయాన్ని బట్టి ఫలితాల్లో మార్పులుంటాయి. ఉదాహరణకు ఇంటర్‌ నుంచే నెట్‌వర్క్‌ ప్రారంభించారనుకుందాం. విద్యార్థి తాను ఎంచుకున్న గ్రూపులోనే కాకుండా ఇతర గ్రూపుల్లో చేరిన తన స్నేహితులు, వాళ్లకు స్నేహితులైన వాళ్లతో పరిచయం పెంచుకునే వీలుంటుంది. డిగ్రీకొచ్చేసరికి ఆ నెట్‌వర్క్‌ పరిధి ఇంకాస్త పెరుగుతుంటుంది. ఒక వ్యక్తికి తాను చదివిన దానిలో మినహా ఇతర రంగాలపై ఎక్కువ అవగాహన ఉండదు. అవసరం వచ్చినపుడు తన స్నేహితుడి ద్వారానో, ఆ వ్యక్తికి పరిచయమున్న నిపుణుడి ద్వారానో తెలుసుకోవడం సాధ్యమవుతుంది. ఇది సాధ్యమవ్వాలంటే.. తన నెట్‌వర్క్‌లో ఆ వ్యక్తి ఉండాలి మరి!

ఇటీవలే చదువు పూర్తి చేసుకున్నవారైతే తిరిగి స్నేహితులకు అందుబాటులోకి రావడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. కళాశాల నుంచో, తరగతిలో అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి ద్వారానో కాంటాక్టులను పొందొచ్చు. చదువు పూర్తయ్యి కొన్నేళ్లు అయితే.. సామాజిక మాధ్యమాల సాయం పొందొచ్చు. ఉదాహరణకు- లింక్‌డిన్‌లో కళాశాలకు చెందిన గ్రూపు ఉందేమో వెతకండి. దానిలో మీ పూర్వ స్నేహితులుంటే వారిని ఆడ్‌ చేసుకోండి. లేదా కొత్తవారిలో ఆసక్తికరమైన ప్రొఫైళ్లు ఉంటే వారిని జత చేసుకోండి. మీ రంగానికి చెందినవారే ఉండాలన్న నిబంధన ఏమీలేదు. నచ్చినవారినెవర్నైనా జత చేసుకుంటూ వెళ్లొచ్చు. లింక్‌డిన్‌లో కళాశాలకు సంబంధించిన ఆనవాళ్లేమీ కనిపించలేదనిపిస్తే.. ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాల సాయం తీసుకోవచ్చు. ముందుగా గుర్తొచ్చినవారి పేర్లతో వెతకండి. రూఢి చేసుకున్నాక ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌తోపాటుగా మీ వివరాలతో మెసేజ్‌ కూడా పెట్టండి. ఆపై వారి స్నేహితుల జాబితాలో ఇంకా మీకెవరైనా తెలుసేమో చూసుకుని వారినీ ఈ విధంగా సంప్రదించొచ్చు.

తేలిక భావన వద్దు

కొలువుల వేటలో అపూర్వ ఆయుధంరవి, ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. మెరుగైన స్థాయి కోసం సంస్థ మారాలనుకున్నాడు. మంచి సంస్థలో అవకాశముందని తెలిసి, దరఖాస్తు చేసుకున్నాడు. అదే సంస్థలో తనతోపాటు చదివిన వ్యక్తే మంచి స్థాయిలో ఉన్నట్లు తెలుసుకున్నాడు. నేరుగా ఇంటర్వ్యూకు ఎంపికయ్యేలా సాయం చేయమని ఈ-మెయిల్‌ ద్వారా కోరాడు. కానీ ఆ వ్యక్తి ఈ విషయాన్ని నేరుగా హెచ్‌ఆర్‌ వాళ్లకు తెలియజేశాడు. దీంతో రవి రెజ్యూమె బుట్టపాలైంది.

ఇక్కడ గమనిస్తే.. రవి తన పాత స్నేహితుడితో కాంటాక్ట్‌లో లేడు. కనీసం తన గురించైనా అడగకుండా సాయం కోరాడు. అంటే.. ‘ఏముందిలే, చేస్తారుగా’ అన్న ధోరణి. ఇది పొరపాటు. పూర్వ స్నేహితులతో నెట్‌వర్క్‌ ఏర్పరచుకోవాలనుకుంటే.. ఏ ఇతర ఉద్దేశాలు లేకుండానే సంభాషణ ప్రారంభించాలి. రోజూ మాట్లాడటం కుదరదు. కాబట్టి, వారానికో, నెలకోసారో కలిసేలా ప్లాన్‌ చేసుకోవచ్చు. లేదంటే సామాజిక మాధ్యమాల్లో మాట్లాడుతుండొచ్చు. అప్పుడప్పుడూ ఫోన్‌ చేస్తుండటమూ చేయాలి. రోజూ మీరు కేటాయించే ఈ కొద్ది సమయం ఏడాది కాలంలో అలమ్నైతో పటిష్ఠమైన నెట్‌వర్క్‌ను మీ సొంతం చేస్తుంది.

పారదర్శకంగా..

కొలువుల వేటలో అపూర్వ ఆయుధంశ్రవణ్‌.. తరగతిలో ప్రతి ఒక్కరికీ తెలిసిన పేరు. ఏ సహాయం కావాలన్నా ముందుంటాడు. కళాశాల అయిపోయాకా తన బ్యాచ్‌లోని అందరికీ అందుబాటులో ఉండేవాడు. ఏవైనా ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే, అందరికీ చేరవేసేవాడు. పూర్వ విద్యార్థుల సమావేశాల వివరాలు ఎవరికైనా తన ద్వారానే తెలిసేవి. తన రంగంలో పదేళ్ల అనుభవం తరువాత సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకున్నాడు. తన నెట్‌వర్క్‌లోని అందరినీ సంప్రదించాడు. వ్యాపారానికి కావాల్సిన పెట్టుబడిదారులు, పంపిణీదార్లు, వినియోగదార్లు అందరూ సమకూరారు.
పారదర్శకంగా ఉండటం ఎప్పుడూ కష్టం కాదు. స్నేహితులతో తరచూ మాట్లాడుతుండండి. పూర్వవిద్యార్థుల సమావేశాలు ఏవైనా జరుగుతున్నపుడు హాజరవ్వండి. గతంలో మీరు చదివిన కళాశాలకు వెళ్లడం, ఉపాధ్యాయులతో మాట్లాడటం చేయండి. కళాశాల హాస్టల్‌లో ఉండుంటే అక్కడికీ వెళ్లండి. ప్రస్తుతం ఉన్నవారితో మాట్లాడండి. సోషల్‌ మీడియాలో ఒకే అభిరుచి ఉన్నవారితో ఒక గ్రూప్‌ ఏర్పరచడం లాంటివి చేయండి. ఇలా చేయడం ద్వారా పరిచయాలే కాదు. ఎక్కువమందికి దగ్గరవుతారు కూడా!

మొదట ఇవ్వండి

కొలువుల వేటలో అపూర్వ ఆయుధంఏమీ ఆశించకుండానే ఇతరులకు సాయం చేయండి. ఉదాహరణకు- మీ సంస్థలో ఏవైనా ఖాళీలుంటే, స్నేహితులకో, జూనియర్లకో తెలియజేయండి. ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ వంటి వాటిలో వెనుకబడినవారికి సాయం చేయండి. ఇంటర్న్‌షిప్‌ అవకాశం కల్పించండి. అలమ్నై నెట్‌వర్క్‌కు ఇవ్వడం అలవాటు చేసుకోండి. అది భవిష్యత్తులో మీకుపయోగపడుతుంది. ఎవరైనా సాయమడిగినప్పుడు వీలైనంతగా చేయండి. ఉన్నత విద్య సమాచారం అందించడం, వివిధ పరీక్షలు, ఇంటర్వ్యూలకు ఎలా సన్నద్ధమవ్వాలో చెప్పడమూ సాయంలో భాగమే. వివిధ రంగాల్లో స్నేహితులుంటే, వాటిలో ఏవైనా పోకడలు మీ దృష్టికి వస్తే వాటిని పంచుకోవచ్చు.

సలహా కోరండి, ఉద్యోగం కాదు

కొలువుల వేటలో అపూర్వ ఆయుధంఉద్యోగ వేటలో ఉన్నపుడు రిఫరెన్సునో, సలహానో కోరొచ్చు. నేరుగా వెళ్లి వారిని ఉద్యోగం ఇప్పించమని అడగడం వారిని ఇబ్బందికి గురి చేసినట్లు అవుతుంది. ‘ఉద్యోగం కోసం చూస్తున్నాను, ఏవైనా ఖాళీల వివరాలు తెలిస్తే చెప్ప’మని అడగొచ్చు. మీరు సంప్రదించిన విధానం నచ్చితే వారే నేరుగా సాయం అందించే అవకాశం ఉంటుంది. అలాగే ఇలాంటి విషయాల్లో ఫోన్‌ ద్వారా కంటే నేరుగా కలవడం ద్వారా మంచి ఫలితాలు రాబట్టవచ్చు.

పాటించాలివి!

* ఈ-మెయిల్‌ ద్వారా ఏదైనా విషయాన్ని పంచుకుంటున్నపుడు (ఉదా: పూర్వ విద్యార్థుల సమావేశ వివరాలను పంపుతున్నపుడు) అందరి మెయిల్‌ ఐడీలనూ గుంపగుత్తగా చేర్చి ఒకే మెయిల్‌లో పంపకూడదు. ఇది అశ్రద్ధనూ, నిర్లక్ష్యాన్నీ సూచిస్తుంది.
* ఉద్యోగానికి సంబంధించో, వ్యాపారానికి సంబంధించిన విషయంలోనో మీ నెట్‌వర్క్‌లోని ఒక వ్యక్తిని రిఫరెన్స్‌గా ఉపయోగించేటపుడు ముందస్తుగానే సంబంధిత వ్యక్తి అంగీకారం తీసుకోవాలి. ఇది ఆ వ్యక్తికి మీపై నమ్మకాన్ని ఏర్పరుస్తుంది.
* ఏదైనా పని నిమిత్తం అలమ్నై నెట్‌వర్క్‌లోని వ్యక్తిని కలిస్తే.. తన బిజీ రోజున మీకు సమాచారాన్ని ఇవ్వడానికి సమయం కేటాయించినందుకు మరుసటి రోజు కృతజ్ఞతలతో చిన్న సంక్షిప్త సందేశమో, మెయిలో పంపండి. ఇదెంతో అనుకూల ప్రభావం చూపుతుంది. కానీ దాదాపుగా 90% మంది ఈ ప్రాథమిక మర్యాదను మర్చిపోతారు.

* చాలాకాలంగా పాత మిత్రులకు దూరంగా ఉండి, హఠాత్తుగా కలిశారనుకోండి. మీ గురించి మీరే.. ముఖ్యంగా మీ విజయాలను ఏకరువు పెట్టుకోకండి. అది ఆసక్తి కలిగించదు. ఇంకో స్నేహితుడి ద్వారా మిగతావారిని కలవడం, అందరికీ కామన్‌ ఆసక్తి ఉన్న విషయాన్ని ప్రస్తావించడం మంచిది.

ఉత్తమ వ్యూహం

ఎవరైనా నిపుణుడిని ఉద్యోగ వేటలో ఉత్తమమైన వ్యూహమేదని అడిగి చూడండి. సమాధానం ‘నెట్‌వర్క్‌’ అనే వస్తుంది. గత ఏడాది చాలావరకూ సంస్థల్లో నియామకాలు నెట్‌వర్క్‌ ద్వారానే జరిగాయి. నిజానికి మిగతా విధానాల్లో పోలిస్తే ఈ విధానంలోనే ఎక్కువగా నియామకాలు జరిగాయి. ఏదైనా సంస్థలో ఖాళీలు ఉన్నప్పుడు హెచ్‌ఆర్‌ విభాగం ముందుగా తమ ఉద్యోగులకే తెలియజేస్తున్నాయి. వారు తమకు తెలిసినవారికి సమాచారం అందిస్తే.. వారిలో ఉత్తమమైనవారికి నేరుగా ఇంటర్వ్యూ నిర్వహించి, సంస్థలు కొలువులందించాయి.
- నీరుకొండ అనూష

Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.