close

తాజా వార్తలు

ఇంటినంబరుగెలిచాడు

హైదరాబాద్‌లో వివరంగా ఉన్న ఓ అడ్రస్‌ గురించి చెబితే.. వెంకట్రామా అండ్‌ కో ఎక్కాల బుక్కు కొనుక్కోమనీ.. ఈ లెక్కలన్నీ అందులో ఉంటాయనీ చెప్పిన కామెడీ సీను నవ్వులు పండించినా.. అందులో అతిశయోక్తి లేదనిపిస్తుంది.

ఇంటి నంబరు చాంతాడంత ఉంటే.. ఇంటికి దారి తీసే వీధులు పద్మవ్యూహాన్ని తలపిస్తాయి..

ఇంటి చుట్టూ పదిసార్లు ప్రదక్షిణ చేసి.. నాలుగుసార్లు ఇంటి యజమానికి ఫోన్‌ చేస్తే గానీ.. అతిథికి సత్కారం పొందే భాగ్యం దక్కదు.

అంతుచిక్కని ఇంటినంబర్ల మాయజాలమిది.

ఎంత గూగుల్‌ మ్యాప్‌లు వచ్చినా... నగరంలో ఇల్లు కనుక్కోడానికి మరీ ఇంత కష్టమైతే ఎలా?

ఈ ఆలోచన ఓ హైదరాబాద్‌ యువకుడితో ఓ ఆవిష్కరణ చేయించింది.

ది అలాంటిలాంటి ఆవిష్కరణ కాదు. దాంతో ఒక్క హైదరాబాదే కాదు దేశంలోని అనేక నగరాల్లో ఇంటి చిరునామాను అత్యంత సులభంగా తెలుసుకోవచ్ఛు మూడేళ్ల పరిశోధన... రెండేళ్ల సంప్రదింపులు... ఏడాది పాటు ప్రయోగాత్మక పరిశీలనతో ‘డిజిటల్‌ డోర్‌ నంబర్‌’ను సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆదిత్య కనుగొన్నాడు. కాలిఫోర్నియాలో తాను పనిచేస్తున్న కంపెనీ నుంచి రూ.లక్షల్లో జీతం వస్తున్నా.. మనదేశంలోని మెట్రో నగరాలు.. పట్టణాల్లో ఇంటి నంబర్లను సరళంగా మార్చాలన్న లక్ష్యంతో ఉద్యోగానికి రాజీనామా చేశాడు. జిప్పర్‌ పేరుతో ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థను ఏర్పాటు చేసి ‘డిజిటల్‌ డోర్‌ నంబర్‌’ను తెలుగు రాష్ట్రాలకు పరిచయం చేశాడు. రెండు రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులకు తన ఆలోచనను వివరించి కాంట్రాక్టు ద్వారా ఈ ప్రాజెక్టును దక్కించుకున్నాడు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు దేశంలోని ఆకర్షణీయ నగరాల్లో (స్మార్ట్‌ సిటీస్‌లో) ‘డిజటల్‌ డోర్‌ నంబర్‌’ ప్రాజెక్ట్‌ను ప్రయోగాత్మకంగా చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి పట్టణంలో 90శాతం ఇళ్లకు ‘డిజిటల్‌ డోర్‌ నంబరు’ కేటాయించారు. కొత్త ఏడాదిలో తిరుపతిలోని ప్రతి ఇల్లూ ‘డిజిటల్‌ డోర్‌ నంబర్‌’తో ఉండనుంది.

160 నగరాల్లో..

జిప్పర్‌ కంపెనీ ప్రస్తుతం 160 నగరాలు, పట్టణాల్లో డిజిటల్‌ డోర్‌ నంబర్‌ ప్రాజెక్టులను వేగంగా చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని 120 అసెంబ్లీ నియోజకవర్గాలు, తెలంగాణలోని ఉమ్మడి పది జిల్లాల్లో డిజిటల్‌ డోర్‌ నంబర్‌ ప్రక్రియ మొదలయ్యింది. న్యూ దిల్లీ లో డిజిటల్‌ డోర్‌ నంబర్‌ ప్రాజెక్ట్‌ 80 శాతం పూర్తయ్యింది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌, ఒడిశాలోని బ్రహ్మపుర పట్టణాల్లో ఇంటినంబర్ల ప్రాజెక్టు దాదాపు పూర్తికావొచ్చింది.

ఆలోచన ఎలా వచ్చిందంటే..? హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ఆదిత్య.. సీబీఐటీ ఇంజినీరింగ్‌ కళాశాలలో పదిహేడేళ్ల కిందట ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు. తర్వాత అమెరికాలోని వెస్ట్‌ వర్జినియా యూనివర్సిటీలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో ఎం.ఎస్‌. చదివేందుకు వెళ్లాడు. కొన్నాళ్లకు కాలిఫోర్నియాలో ఓ ఆన్‌లైన్‌ అడ్వర్టైజింగ్‌ కంపెనీలో చేరాడు. అక్కడే ఉంటున్న తెలుగు స్నేహితులు కొందరు ఆదిత్య గదికి వచ్చేవారు. చిరునామా చెప్పగానే నేరుగా అతడి ఇంటికి చేరుకునేవారు. కొత్త ప్రదేశం కదా చిరునామా ఎలా తెలుసుకున్నారని ప్రశ్నిస్తే... అక్కడ ఇంటి నంబర్ల కేటాయింపే దానికి కారణమని తెలిసింది. మరింత లోతుగా అధ్యయనం కోసం కాలిఫోర్నియా వీధులన్నీ చుట్టేశాడు. అక్కడి అధికారులతో మాట్లాడాడు. ఇంత తేలిగ్గా భారతదేశంలోనూ అమలు చేయడమెలా? అని ఆలోచించాడు. డిజిటల్‌ ఆవిష్కరణతోనే అది సాధ్యమని నిర్ణయించుకున్నాడు.

ఉద్యోగానికి గుడ్‌బై చెప్పేసి... ఇంతలో తాను పని చేస్తున్న అడ్వర్‌టైజింగ్‌ కంపెనీ దిల్లీలో తమ కార్యకలాపాలు ప్రారంభించింది. ఆదిత్యను పదోన్నతి కల్పించి అక్కడకు పంపింది. 2010లో దిల్లీకి వచ్చిన ఆదిత్య రెండు నెలల్లోనే కంపెనీ కార్యకలపాలు ఊపందుకునేలా చేశాడు. కొద్ది రోజుల తర్వాత తాను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి, హైదరాబాద్‌ వచ్చి సొంతంగా ఒక సంస్థను ప్రారంభించాడు. తన భార్య నీలిమతో కలిసి ‘మీడియా మింట్‌’ పేరుతో ఆన్‌లైన్‌ ప్రకటనల సంస్థను మొదలుపెట్టాడు. రెండేళ్లలోనే కంపెనీ నిలదొక్కుకోవడంతో ఆదిత్య ‘డిజిటల్‌ డోర్‌ నంబర్‌’ ప్రాజెక్ట్‌పై దృష్టి కేంద్రీకరించాడు.

ఆ ప్రకటన సగం బలం.. డిజిటల్‌ డోర్‌ నంబర్‌ ప్రాజెక్టును సాకారం చేసేందుకు ఆదిత్య తన బృందంతో కలిసి అహోరాత్రాలు శ్రమించాడు. సమీకరణాలు, రోడ్‌ మ్యాప్‌లు, ఇతర సాంకేతిక అంశాలతో కుస్తీపట్టాడు. ఆరేళ్ల క్రితం జోన్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్లాన్‌ (జిప్‌) కలిసివచ్చేలా జిప్పర్‌ అనే సంస్థను ప్రారంభించాడు. ఇంతలో కేంద్ర ప్రభుత్వం స్మార్ట్‌ సిటీస్‌ ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది. ఈ ప్రాజెక్టులో చాలా అంశాలున్నా... ఇంటి నంబర్‌ సరిగ్గా ఆదిత్య అనుకున్నట్టే ఉంది. దీంతో అతడికి సగం బలం వచ్చింది. ఆయా నగరాల జాబితాలో నగరాలకు వెళ్లి అక్కడి ప్రభుత్వ అధికారులకు తమ ప్రాజెక్టు గురించి వివరించేవాడు. ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులను కలుసుకుని తన ఆలోచనలు, భవిష్యత్తు పరిణామాలను వారికి అర్థమయ్యేలా చెప్పేవాడు.

మూడంకెల సంఖ్యే... ఇంటి చిరునామా విద్యావంతులకే కాకుండా కాస్త అక్షరజ్ఞానం ఉన్నవారికి అర్థమయ్యేలా ఆదిత్య, అతడి బృందం తయారు చేసింది. ఇల్లు/ఫ్లాట్‌ చిరునామాలో మూడు అంకెల సంఖ్య మాత్రమే ఉంటుంది. ఇంటి చిరునామా ఫలకంలో పెద్ద అక్షరాల్లో డిజిటల్‌ డోర్‌ నంబర్‌ ఉంటుంది. దాని కింద రాష్ట్రం/జిల్లా, తర్వాత ప్రాంతం, వీధి ఉంటుంది. సరిగ్గా ఇక్కడే ఆదిత్య బృందం వేల ప్రశ్నలను వారంతట వారే వేసుకుని వాటికి సమాధానాలను కనుగొన్నారు. భవిష్యత్తులో రాబోయే పరిణామాలను ముందుగానే ఆలోచించి జిప్పర్‌ కంపెనీ శాస్త్రీయ విధానాన్ని తెరపైకి తెచ్చింది. ఉదాహరణకు చార్మినార్‌లో నివసిస్తున్న ఒక ఇంటి యజమానికి ఇద్దరు కుమారులున్నారు. భవిష్యత్తులో ఆ ఇంటిని సోదరులిద్దరూ రెండు భాగాలుగా చేసుకుంటారు. అప్పుడు ఇంటి నంబర్‌ ఎలా?.. ఇలాంటి పరిస్థితులకూ జిప్పర్‌ వద్ద సమాధానాలున్నాయి. ఇంటిని మ్యుటేషన్‌ చేసుకున్నా... ఒక ఇంటిని పడగొట్టి అపార్ట్‌మెంట్‌గా మార్చినా ఇంటి నంబర్లు సులభంగా ఉండేలా ఒక సాఫ్ట్‌వేర్‌నూ రూపొందించారు. ప్రతి డిజిటల్‌ డోర్‌ నంబర్‌కు క్యూఆర్‌ కోడ్‌తోపాటు జియోట్యాగింగ్‌ ఉండడంతో ఇంటి నంబర్‌ స్కాన్‌ చేసిన వెంటనే చిరునామా తెలిసిపోతుంది. ఏ వీధిలో ఉందో ఇట్టే తెలిసిపోతుంది. ఎలా వెళ్లాలో సులభంగా అర్థమవుతుంది.

-బి.సునీల్‌కుమార్‌, హైదరాబాద్‌


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.