close

తాజా వార్తలు

ఈ ఆరుగురు అదుర్స్‌

ఐపీఎల్‌.. భారత క్రికెట్‌కు యువక్రికెటర్లను అందించడంతో పాటు తమ సత్తా చూపేందుకు విదేశీ ఆటగాళ్లకూ మంచి వేదికైంది. పదకొండేళ్ల ఐపీఎల్‌ ప్రస్థానంలో ఎంతోమంది యువ క్రికెటర్లు జాతీయ జట్టు తలుపు తట్టారు. కొందరు విదేశీ ఆటగాళ్లు అంతర్జాతీయ ఖ్యాతి సంపాదించారు. అలా ఐపీఎల్‌లో మెరిసి తమ కెరీర్‌నే మలుపుతిప్పేసుకున్న ఆటగాళ్లు చాలామంది ఉన్నారు. అందులో కొంతమంది విదేశీ ఆటగాళ్ల రికార్డులు ఓ సారి చూద్దాం.

విధ్వంసానికి మరో రూపం క్రిస్‌ గేల్‌

క్రిస్టోఫర్‌ క్రిస్‌ హెన్రీ గేల్‌. క్రికెట్‌ ప్రపంచానికి తెలిసిన పేరు క్రిస్‌ గేల్‌. టీ20 క్రికెట్‌లో అతడిని మించిన విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ మరొకరు లేరంటే అతిశయోక్తి కాదేమో! ఐపీఎల్‌లో అత్యంత ప్రమాదకరమైన బ్యాట్స్‌మెన్‌లో క్రిస్‌గేల్‌ ముందు వరుసలో ఉంటాడు. 111 మ్యాచ్‌లు. 41.17సగటు.. 150.71స్ర్టైక్‌రేట్‌.. 3,994పరుగులు.. 5 సెంచరీలు.. 175 నాటౌట్‌ బెస్ట్‌.. 292 సిక్స్‌లు.. ఇది గేల్‌ రికార్డు. అత్యధిక పరుగులు చేసిన రెండో విదేశీ ఆటగాడు గేల్‌. సగటు విషయంలో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ విండీస్‌ వీరుడు ఐపీఎల్‌లో మొత్తం మూడు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ప్రస్తుతం కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కు ఆడుతున్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు సేవలు అందించాడు. ఆర్‌సీబీ తరఫున గేల్‌ సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. తాను చేసిన ఆరు ఐపీఎల్‌ సెంచరీల్లో అన్నీ బెంగళూరు తరఫున చేసినవే. బెంగళూరు తరఫున 84 మ్యాచ్‌లాడిన గేల్‌.. సగటు 43.32తో 3,163పరుగులు చేశాడు. స్ట్రైక్‌రేట్‌ 152.72 ఉండటంతో పాటు తన 175పరుగుల ఊచకోత ఇన్నింగ్స్‌ బెంగళూరు తరఫున చేసిందే. అంతేకాదు 30బంతుల్లోనే శతకం బాది ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన శతకం నమోదు చేశాడు. 2011-13 మధ్య కాలంలో గేల్‌ 55పైన సగటుతో 600కి పైగా పరుగులు చేశాడు.

మ్యాచ్‌ విన్నర్‌.. డేవిడ్‌ వార్నర్‌

క్రీజులోకి రావడమే ఆలస్యం.. ఎడాపెడా బౌండరీలు బాదుతూ పరుగుల వరద పారించే ఈ డ్యాషింగ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెనర్ కు  ఐపీఎల్‌లో మెరుగైన రికార్డు ఉంది. 114 మ్యాచుల్లో 40.54 సగటుతో 4,014పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన విదేశీ ఆటగాడు వార్నర్‌. స్ట్రైక్‌రేట్‌ కూడా 142.13గా ఉంది. తన ఐపీఎల్‌ కెరీర్‌లో తొలుత దిల్లీ డేర్‌ డెవిల్స్‌ తరఫున ఆడాడు. 2014లో హైదరాబాద్‌కు మారాడు. జట్టు మారిన తర్వాత వార్నర్‌ మరింత రెచ్చిపోయాడు. నాలుగు సీజన్లలో 59 మ్యాచుల్లోనే 52.93సగటుతో 2,579పరుగులు చేశాడు. హైదరాబాద్‌ తరఫున 26 అర్ధశతకాలు, ఒక శతకం బాదాడు. 2016లో బెంగళూరుతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో వార్నర్ 38బంతుల్లో 69పరుగులు చేసి సన్‌రైజర్స్‌కు ట్రోఫీ అందించాడు. 2016 సీజన్‌లో 9 అర్ధశతకాలు బాదాడు. 17మ్యాచుల్లో 60.57సగటుతో 848పరుగులు చేసి సీజన్‌లో రెండో అత్యధిక  పరుగుల వీరుడిగా నిలిచాడు.

 

బంతితో.. బ్యాటుతో.. షేన్‌ వాట్సన్‌

 

అటు బంతితో ఇటు బ్యాటుతో ప్రత్యర్థులకు చెమటలు పట్టించే షేన్‌ వాట్సన్‌ అత్యధిక పరుగులు సాధించిన విదేశీ ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. 113 మ్యాచుల్లో 32.41 సగటుతో 3,177 పరుగులు చేశాడు. అతడి ఐపీఎల్‌ కెరీర్‌లో 4 శతకాలు, 16 అర్ధశతకాలు ఉన్నాయి. బౌలింగ్‌లోనూ 92 వికెట్లు పడగొట్టాడు. రెండు జట్లు ఐపీఎల్‌ టైటిల్‌ కొట్టడంలో కీలకపాత్ర వహించాడు. రాజస్థాన్‌ తరఫున 15 మ్యాచులాడిన వాట్సన్‌ 47.20తో 472పరుగులు చేశాడు. 17 వికెట్లు తీశాడు. ఆ తర్వాత చెన్నై సూపర్‌కింగ్స్‌ తరఫున 15 మ్యాచుల్లో 39.64 సగటుతో 555 పరుగులు చేశాడు. 2018 హైదరాబాద్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో 57బంతుల్లో 117పరుగులు బాది చెన్నైకి అలవోక విజయాన్ని కట్టబెట్టాడు.

యార్కర్‌ కింగ్‌.. లసిత్‌ మలింగ

తన యార్కర్లతో బ్యాట్స్‌మెన్‌కు మూడు చెరువుల నీళ్లు తాగించే మలింగ మరే బౌలర్‌కూ అందనంత ఎత్తులో ఉన్నాడు. తన ఐపీఎల్‌ కెరీర్‌లో 110 మ్యాచ్‌ల్లో 154 వికెట్లు పడగొట్టాడు. బౌలింగ్‌ సగటులో ఇప్పటికీ అగ్రస్థానంలో ఉన్నాడు. 6.86 ఎకానమీతో ముంబయి ఇండియన్స్‌ జట్టుకు ఎన్నో విజయాలందించాడు. ఆ జట్టు మూడుసార్లు ఛాంపియన్‌గా అవతరించగా అందులో రెండు విజయాల్లో మలింగదే అగ్రభాగం. 24 వికెట్లు తీసిన మలింగ 2015లో అత్యధిక వికెట్ల తీసిన రెండో బౌలర్‌. 

ఛాంపియన్‌ డ్వేన్‌ బ్రావో

పేస్‌ బౌలర్ల జాబితాలో మలింగ తర్వాతి స్థానం బ్రావోదే. 119 మ్యాచుల్లో 136 వికెట్లు పడగొట్టాడు. చెన్నై రెండు సార్లు ఐపీఎల్‌ టైటిల్‌ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు ఈ ఆల్‌రౌండర్‌. 2018 సీజన్‌లో 14 వికెట్లు పడగొట్టడంతో పాటు 155 స్ట్రైక్‌ రేట్‌తో 141 పరుగులు చేశాడు. 2013లో ఏకంగా 32 వికెట్లు నేలకూల్చాడు. ఐపీఎల్‌ చరిత్రలో ఒక సీజన్‌లో మరే బౌలర్‌ ఇన్ని వికెట్లు తీయకపోవడం గమనార్హం. 2015లోనూ 26 వికెట్లు పడగొట్టి అగ్రస్థానంలో నిలిచాడు. తన ఐపీఎల్‌ కెరీర్‌లో 128.71 స్ట్రైక్‌రేట్‌, 23.77 సగటుతో 1,403పరుగులు చేశాడు.

మిస్టర్‌ 360.. ఏబీడీ

360 డిగ్రీల కోణంలో ఎటువైపు అయినా సరే కళ్లు చెదిరే షాట్లు కొట్టే డివిలియర్స్‌ బెంగళూరు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. క్రీజులో కుదురుకున్నాడంటే.. బంతి మైదానంలో కంటే స్టాండ్స్‌లోనే ఎక్కువ కనిపిస్తుంది. 2018లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతున్న ఓ మ్యాచ్‌లో అలెక్స్‌ హేల్స్‌ కొట్టిన షాట్‌ను బౌండరీ లైను వద్ద స్పైడర్‌మ్యాన్‌లా గాల్లో ఎగిరి అందుకున్నాడు. అది ఐపీఎల్‌లోనే ఉత్తమ క్యాచుల్లో ఒకటిగా నిలిచింది. బెంగళూరు సారథి విరాట్‌ కోహ్లితో కలిసి మెరుగైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఇద్దరూ కలిసి ఐదుసార్లు 100పరుగులు.. రెండుసార్లు  200 పరుగులకు పైగా భాగస్వామ్యాలు నెలకొల్పారు. ప్రపంచంలో మరే జోడీ ఈ రికార్డును చేరుకోలేదు.  డివిలియర్స్‌ తన ఐపీఎల్‌ కెరీర్‌లో 141 మ్యాచ్‌లాడి 39.33 సగటుతో 3,953 పరుగులు నమోదు చేశాడు. అందులో 3 శతకాలు, 28 అర్ధశతకాలు ఉండగా 151 స్ట్రైక్‌రేట్‌తో 326 ఫోర్లు, 186 సిక్సర్లు బాదాడు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.