close

తాజా వార్తలు

ధోనీ దేశభక్తి × ఐసీసీ అధికార దర్పం

ప్రేరణ..! మూడు అక్షరాల పదం. కానీ అపార శక్తిమంతం. కొండల్ని కరిగించగలదు. కదిలించగలదు. దేశాల్ని పాలించగలదు. ప్రపంచాన్ని శాసించగలదు. సామాన్యుడిని మహారాజ శ్రీగా మార్చగలదు. ప్రేరణ రెండు రకాలు. బాహ్యం, అంతర్గతం. ఈ రెండోది మహా బలశాలి. రక్తం సలసలా మరిగించి అసాధ్యాన్ని సుసాధ్యం చేయిస్తుంది. అంతర్గత ప్రేరణ పొందేందుకు ఏదైనా ఒక వస్తువును గుర్తుగా పెట్టుకుంటారు. అంటే భారత వికెట్‌ కీపర్‌ మహేంద్రసింగ్‌ ధోనీ గ్లోవ్స్‌పై ‘బలిదాన్‌’ గుర్తులా అన్నమాట. దానినే ఐసీసీ తొలగించాలని చెప్పింది. రెండో ప్రపంచకప్‌ ముద్దాడి ఆటకు వీడ్కోలు పలకాలన్న మహేంద్రుడి ప్రేరణని సింపుల్‌గా చంపేయాలని చెప్పేసిందన్నమాట. అందుకే ఇది దేశవ్యాప్తంగా అగ్గిని రాజేసింది. తీవ్ర చర్చకు దారితీసింది.

అపార దేశభక్తి
భారత్‌కు ఒక టీ20, రెండో వన్డే ప్రపంచకప్‌ అందించిన సారథి మహేంద్రసింగ్‌ ధోనీ. అతడికి ఎంత దేశభక్తి ఉందో అందరికీ తెలిసిందే. అప్పుడప్పుడూ నేలపై పెట్టాల్సి వస్తుందని కీపింగ్‌ హెల్మెట్‌పై జాతీయ జెండా చిహ్నం ఉంచుకోడు. తన దృష్టిలో మువ్వన్నెల జెండా ఎప్పటికీ వినీలాకాశంలో అంతెత్తున రెపరెపలాడాల్సిందే. క్రికెటర్‌ కాకపోయి ఉంటే సైన్యంలో చేరేవాడినని గతంలో మహీ ఎన్నోసార్లు చెప్పాడు. అతడికి సైన్యంతో అవినాభావ సంబంధం ఉంది. టెరిటోరియల్‌ ఆర్మీ ప్యారాచూట్‌ రెజిమెంట్‌లో ఎంఎస్‌ ధోనీ లెఫ్టినెంట్‌ కల్నల్‌ అన్న సంగతి తెలిసిందే. అందుకే పద్మభూషణ్‌ పురస్కారాన్ని అతడు సైనిక దుస్తుల్లో స్వీకరించాడు. ఈ మధ్యే ఓ అభిమాని మైదానంలోకి దూసుకొచ్చి మహీని కలిసే క్రమంలో జాతీయ జెండాను నేలపై పెట్టేందుకు ప్రయత్నించాడు. అప్పుడు ధోనీ దానికి కిందపడకుండా అందుకొని ప్రశంసలు పొందాడు. ఇవన్నీ అతడి దేశభక్తికి నిదర్శనాలే.

ఇప్పుడే ఎందుకు?
ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ధోనీ గ్లోవ్స్‌పై బలిదాన్‌ గుర్తు కనిపించింది. వీడియోగ్రాఫర్లు దానిని టీవీ తెరలపై పెద్దది చేసి చూపించారు. దీంతో అభిమానులు అతడి దేశభక్తిని మెచ్చుకుంటూ సోషల్‌ మీడియాలో విపరీతంగా పోస్టులు పెట్టారు. ప్రశంసించారు. ఇవి స్వయంగా ఐసీసీ కంటపడ్డాయా లేదా గిట్టని వారెవరైనా ఫిర్యాదు చేశారో తెలీదు గానీ బలిదాన్‌ గుర్తు తొలగించాలని బీసీసీఐకి సూచించింది. అసలు ధోనీ ఇప్పుడే ఎందుకు ఆ గుర్తు ధరించాడు? ఎందుకంటే అతడి కెరీర్‌ దాదాపు చరమాంకంలో ఉంది. టెస్టులకు ఎప్పుడో  వీడ్కోలు పలికాడు. ఫిట్‌నెస్‌ ఫర్వాలేదు గానీ నడుం నొప్పి విపరీతంగా వేధిస్తోంది. మునుపటిలా ఆడటం కష్టమవుతోంది. దాదాపుగా ఇదే చివరి ప్రపంచకప్‌ టోర్నీ! తన అనుభవంతో ప్రపంచకప్‌ను దేశానికి అందించి క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాలన్నది ధోనీ తలంపు కావొచ్చని చాలామంది అభిప్రాయం. అదే జరిగితే అతడి కెరీర్‌ సైతం పరిపూర్ణం అవుతుంది. దీనికి ఎంతో ప్రేరణ అవసరం. గ్లోవ్స్‌పై ‘బలిదాన్‌’ గుర్తు ప్రేరణ ఇవ్వగలదు.

ఐసీసీ బాధేంటి?
ఐసీసీ నిబంధనల ప్రకారం ఆటగాళ్ల దుస్తులపై, యాక్సెసరీస్‌పై మత, వాణిజ్య, సైనిక చిహ్నాలు ధరించొద్దు. అందుకే ‘ఇది నిబంధనలకు విరుద్ధం. గుర్తు తొలగించాలని బీసీసీఐని కోరాం. మొదటి ఉల్లంఘన కాబట్టి జరిమానా విధించడం లేదు’ అని ఐసీసీ ప్రతినిధి క్లెయిర్‌ ఫోర్లాంగ్‌ తెలిపారు. దీంతో ఐసీసీపై అభిమానులు భగ్గుమన్నారు. ధోనీ లెఫ్టినెంట్‌ కల్నల్‌, అతడి దేశభక్తితో ఇతరులకు ఏం నష్టం అని ప్రశ్నించడం మొదలుపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ‘#DhoniKeepTheGlove’ యాష్‌ట్యాగ్‌ను ట్రెండింగ్‌ చేస్తున్నారు. ఇక్కడే ఓ ప్రశ్న తలెత్తుతోంది. అంతర్జాతీయ క్రికెట్‌ నిబంధనల్ని ఔపోశన పట్టిన ధోనీ నిజానికి నిబంధనలను ఎలా ఉల్లంఘిస్తాడు? వాస్తవంగా ధోనీ గ్లోవ్స్‌పై గుర్తును పరిశీలిస్తే అది ‘బలిదాన్‌’ గుర్తు కాదని స్పష్టంగా తెలుస్తోంది. ఆకారం మాత్రమే అలా ఉంది. అందులో దేవనాగరి లిపిలో ‘బలిదాన్’ అక్షరాలు లేవు. అంటే సైన్యానికి సంబంధం లేదు. మతపరమైంది కాదు. వాణిజ్య అంశాలూ లేవు. ఏ లెక్కన చూసినా ఇది నిబంధనల కిందకు రానేరాదు!

అండగా బీసీసీఐ
ఈ వ్యవహారంలో ధోనీకి బీసీసీఐ అండగా నిలిచింది. అతడు ప్రపంచకప్‌లో ఇవే గ్లోవ్స్‌ ఉపయోగిస్తాడని ఐసీసీకి చెప్పింది. తమ ప్రతిపాదన ఆమోదించాలని క్రికెట్‌ పాలకుల కమిటీ అధినేత వినోద్‌ రాయ్‌ ఐసీసీని కోరారు. ‘బీసీసీఐ ఇప్పటికే ఐసీసీకి అధికారిక అభ్యర్థన పంపించింది. ఐసీసీ నిబంధనల ప్రకారం ఆటగాళ్లు మత, వాణిజ్య, సైనిక గుర్తులు ఉంచుకోరాదు. ధోనీ వ్యవహారంలో ఇవేవీ లేవు. అతడు ధరించింది పారామిటలరీ బలిదాన్ గుర్తుకాదు. ఇది నిబంధనలను ఉల్లంఘించినట్టు కాదు’ అని రాయ్‌ అన్నారు. ఆసీస్‌తో మ్యాచ్‌కు ముందే దీనిపై బీసీసీఐ సీఈవో రాహుల్‌ జోహ్రీ స్పష్టత తీసుకొస్తారని వెల్లడించారు. ఒకవేళ ఐసీసీ గుర్తు తీసేయాలని పట్టుబడితే మాత్రం చేసేదేమీ లేదని సమాచారం.

ప్రముఖుల మద్దతు
ధోనీకి ప్రస్తుతం దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. సాధారణ అభిమానుల నుంచి ప్రముఖుల వరకు అతనికి అండగా నిలుస్తున్నారు. ‘ఐసీసీ కేవలం బీసీసీఐ, ధోనీకే కాదు యావత్‌ దేశానికి క్షమాపణలు చెప్పాలి. ధోనీ రెండు ప్రపంచకప్‌లు అందించాడు. దేశమంతా అతడికి అండగా ఉంది. ఐసీసీ తన ప్రతిపాదనను విరమించుకొని క్షమాపణ చెప్పాలి’ అని వెటరన్‌ క్రికెటర్‌ శ్రీశాంత్‌ డిమాండ్‌ చేశారు. దిగ్గజ స్ప్రింటర్‌ మిల్కాసింగ్‌, రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌దీ అదే మాట. ‘ధోనీ తప్పేమీ చేయలేదు. భారత సైన్యం, జవాన్లను గౌరవించాడు. అందులో చెడు ఏముంది? అతడు చిహ్నం ధరించి మంచే చేశాడు. సైన్యం వల్లే కదా మేమంతా ప్రపంచానికి తెలిసింది’ అని మిల్కాసింగ్‌ అన్నారు.

‘ముందుగా ధోనీ సోదరుడికి అభినందనలు. ప్రపంచకప్‌లో అతడు రాణిస్తాడు. ప్రతి వ్యక్తికీ దేశానికీ నడుమ భావోద్వేగం ఒక్కో విధంగా ఉంటుంది. ధోనీకి సైన్యంతో అనుబంధం ఉంది. అత్యున్నతంగా ఆడేందుకు ప్రేరణ లభించాలనే అతడు ఆ గ్లోవ్స్‌ ధరించాడు’ అని సుశీల్‌ వెల్లడించాడు. ‘ఇది రాజకీయమో, మతపరమైందో కాదు. ఎంఎస్ ధోనీ, నిజానికి లెఫ్టినెంట్‌ కల్నల్‌ ఎంఎస్‌ ధోనీ. అందులో భాగంగానే ధోనీ బలిదాన్‌ గుర్తు ధరించాడు’ అని రిటైర్డ్‌ మేజర్‌ గౌరవ్‌ ఆర్య అన్నారు. ఏదేమైనప్పటికీ భారత్‌×ఆస్ట్రేలియా, భారత్‌×పాకిస్థాన్‌ మ్యాచులకు ముందు ఈ వివాదం రేగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

- ఈనాడు.నెట్‌ ప్రత్యేకం


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.