close

తాజా వార్తలు

విరాట్‌కు విశ్రాంతి! 6 నెలలకు పుజారా బ్యాటింగ్‌

రిషభ్‌ పంత్‌, వృద్ధిమాన్‌ సాహా మధ్య పోటీ 

కూలిడ్జ్‌ (ఆంటిగ్వా)

వెస్టిండీస్‌పై టీ20, వన్డే సిరీసులను వరుసగా క్లీన్‌స్వీస్‌ చేసిన టీమిండియా టెస్టులపై కన్నేసింది. సుదీర్ఘ ఫార్మాట్‌ స్పెషలిస్టులు అజింక్య రహానె, ఛెతేశ్వర్‌ పుజారా, సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌, పేసుగుర్రం జస్ప్రీత్‌ బుమ్రా జట్టులో పునరాగమనం చేశారు. శనివారం నుంచే విండీస్‌ క్రికెట్‌ బోర్డ్‌ XIతో మూడు రోజుల సన్నాహక మ్యాచ్‌. టెస్టు ఛాంపియన్‌షిప్‌ తొలి పోరులో అదరగొట్టేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆటగాళ్లు భావిస్తున్నారు. సారథి విరాట్‌ కోహ్లీ ఆడటంపై స్పష్టత లేదు. టీ20, వన్డే సిరీసుల్లో విఫలమైన పంత్‌కు సాహాతో పోటీ ఎదురుకానుంది.


విరాట్‌కు విశ్రాంతి!

విండీస్‌ XI పోరులో ముందు జాగ్రత్తగా విరాట్‌కు విశ్రాంతి కల్పించొచ్చు. మూడో వన్డేలో అతడి కుడిచేతి బొటనవేలికి గాయమైంది. టెస్టు ఛాంపియన్‌షిప్‌లో శుభారంభం చేయాలని పట్టుదలతో ఉన్న ప్రపంచ నంబర్‌వన్‌ టెస్టు జట్టుకు అతడెంతో కీలకం. విరాట్‌ కరీబియన్‌ జట్టుపై టీ20ల్లో 106 పరుగులు, వన్డేల్లో 234 పరుగులు సాధించాడు. వరుసగా రెండు శతకాలు చేసి జోరు మీదున్నాడు. పరిమిత ఓవర్ల సిరీసులను క్లీన్‌స్వీప్‌ చేసిన టీమిండియా టెస్టు సిరీస్‌నూ స్వీప్‌ చేయాలని ప్రయత్నిస్తోంది.


ఆరు నెలలకు..

టీమిండియా నయావాల్‌ ఛెతేశ్వర్‌ పుజారా ఆరునెలల తర్వాత ఎరుపుబంతి క్రికెట్‌ ఆడుతున్నాడు. అతడు చివరగా రంజీ ట్రోఫీ ఫైనల్లో సౌరాష్ట్ర తరఫున ఆడాడు. నిలకడకు మారుపేరైన అజింక్య రహానె తిరిగి ఫామ్‌ అందుకొనేందుకు ఇంకా తంటాలు పడుతూనే ఉన్నాడు. కౌంటీల్లోనూ అతడిని అదృష్టం వరించలేదు. 7 మ్యాచుల్లో 23.61 సగటుతో కేవలం 307 పరుగులే చేశాడు. అందులో ఓ శతకం, అర్ధశతకం ఉండటం గమనార్హం. జోరు అందుకొనేందుకు అతడికి ఈ మ్యాచ్‌ ఎంతో కీలకం. ప్రపంచకప్‌ తర్వాత విశ్రాంతి తీసుకున్న జస్ప్రీత్‌ బుమ్రా కాస్త సేదతీరి తాజాగా తిరిగొస్తున్నాడు. లయ అందుకొనేందుకు అతడికి సన్నాహక మ్యాచ్‌ ఉపయోగపడనుంది.


ఓపెనర్‌గా మయాంక్‌

కర్ణాటక కుర్రాడు మయాంక్‌ అగర్వాల్‌ ఓపెనింగ్‌ చేయడం దాదాపు ఖాయం. సహచరుడు కేఎల్‌ రాహుల్‌, ఆంధ్రా ఆటగాడు హనుమ విహారితో అతడికి పోటీ ఉంది. పేసర్లు ఇషాంత్‌ శర్మ, ఉమేశ్‌ యాదవ్‌ జట్టు యాజమాన్యాన్ని ఆకట్టుకొనేందుకు ఇది సదవకాశం. రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా స్పిన్‌ విభాగాన్ని నడిపించనున్నారు. వన్డేల్లో విఫలమైన రిషభ్‌పంత్‌ పరిణతి చూపేందుకు, జట్టులో స్థానం సుస్థిరం చేసుకోవాలంటే ఇందులో రాణించక తప్పదు. భారత్‌-ఏ మ్యాచుల్లో రెండు అర్ధశతకాలు సాధించిన వృద్ధిమాన్‌ సాహా నుంచి అతడికి తీవ్ర పోటీ నెలకొంది. టెస్టుల్లో స్థానం కోసం పరితపిస్తున్న రోహిత్‌ శర్మకు ఇది కీలకం.


భారత జట్టు: విరాట్‌ కోహ్లీ (సారథి), అజింక్య రహానె, మయాంక్‌ అగర్వాల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, జస్ప్రీత్‌ బుమ్రా, రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ షమి, రిషభ్‌ పంత్‌, ఛెతేశ్వర్‌ పుజారా, కేఎల్‌ రాహుల్‌, వృద్ధిమాన్‌ సాహా, ఇషాంత్‌ శర్మ, రోహిత్‌ శర్మ, హనుమ విహారి, ఉమేశ్‌ యాదవ్‌


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.