close

తాజా వార్తలు

యువీ ఆరు సిక్సులు గుర్తున్నాయా?

స్టువర్ట్‌ బ్రాడ్‌కు చుక్కలు చూపించి నేటికి పన్నెండేళ్లు

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: ధోనీ సారథ్యంలోని టీమిండియా రెండుసార్లు ప్రపంచకప్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించిన యువరాజ్‌ సింగ్‌ని ఎంత మెచ్చుకున్నా తక్కువే. ముఖ్యంగా 2007 తొలి టీ20 ప్రపంచకప్‌ సందర్భంగా ఇంగ్లాండ్‌పై ఒకే ఓవర్‌లో బాదిన ఆరు సిక్సులు ఏ టీమిండియా అభిమాని మర్చిపోలేడు. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆండ్రూ ఫ్లింటాప్‌ అనవసరంగా యువీని రెచ్చగొట్టి భారీ మూల్యం చెల్లించుకున్నాడు. అతడి వల్ల స్టువర్ట్‌బ్రాడ్‌ బాధితుడయ్యాడు. బ్రాడ్‌ వేసిన 19వ ఓవర్‌లో యువీ ఆరు బంతుల్లో ఆరు సిక్సులు సాధించడంతో పాటు 12 బంతుల్లో అర్ధశతకం సాధించి చరిత్ర సృష్టించాడు. ఈ నేపథ్యంలో ఆ మ్యాచ్‌ జరిగి నేటికి 12 ఏళ్లు పూర్తైన సందర్భంగా మరోసారి ఆ మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుందాం..

టీమిండియా బ్యాటింగ్‌: 

డర్బన్‌ వేదికగా భారత్‌ X ఇంగ్లాండ్‌ మ్యాచ్‌లో తొలుత టాస్‌ గెలిచిన ధోనీసేన నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. గంభీర్‌(58), సెహ్వాగ్‌(68)ల ఓపెనింగ్‌ జోడి 136 పరుగుల శుభారంభం చేసింది. తర్వాతి 19 పరుగుల వ్యవధిలో వీరిద్దరితో పాటు రాబిన్‌ ఊతప్ప(6) ఔటయ్యాక.. కెప్టెన్‌ ధోనీ(10), యువరాజ్‌సింగ్‌(58) క్రీజులోకి వచ్చారు. ఆఖరి మూడు ఓవర్లలో వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 61 పరుగులు జోడించగా యువీ 16 బంతుల్లోనే 58 పరుగులు చేశాడు. 19వ ఓవర్‌ ఐదో బంతికి ఫ్లింటాప్‌ బౌలింగ్‌లో కాలింగ్‌వుడ్‌ చేతికి చిక్కి వెనుదిరిగాడు. దీంతో ఇంగ్లాండ్‌ ముందు టీమిండియా భారీ లక్ష్యాన్ని ఉంచింది.

ఆరు బంతుల్లో ఆరు సిక్సులు:

తొలి ఇన్నింగ్స్‌లో యువీ బ్యాటింగ్‌ చేస్తుండగా 18వ ఓవర్‌ అనంతరం ఇంగ్లాండ్‌ ఆటగాడు ఆండ్రూ ఫ్లింటాఫ్‌ వాగ్వాదానికి దిగాడు. దీంతో రెచ్చిపోయిన యువరాజ్‌ అప్పటికే యువపేసర్‌ స్టువర్ట్‌బ్రాడ్‌పై విరుచుకుపడ్డాడు. అతడికి ఓ పీడకలలా మారి ఆరు బంతుల్లో ఆరు సిక్సులు బాదాడు. నిజానికి తాను వరుసగా ఆరు సిక్సులు బాదాలనుకోలేదని.. మొదటి నాలుగు సిక్సులు బాదాక అలా ఆడాల్సి వచ్చిందని మ్యాచ్‌ అనంతరం చెప్పాడు. తొలి బంతికి డీప్‌కవర్‌లోకి సిక్స్‌ కొట్టిన యువీ తర్వాతి బంతిని బ్యాక్‌వర్డ్‌పాయింట్‌ దిశగా తరలించాడు. మూడో బంతి డీప్‌ మిడ్‌ఆన్‌లో వెళ్లగా నాలుగో బంతి డీప్‌ బ్యాక్‌వర్డ్‌ స్క్వేర్‌లెగ్‌లో దూసుకెళ్లింది. ఐదో బంతిని స్వీప్‌షాట్‌తో తరలించి ఆఖరి సిక్స్‌ను లాంగ్‌ ఆఫ్‌లో తరలించాడు. 

12 బంతుల్లో అర్ధశతకం:

ఈ ఓవర్‌కి ముందు 171 పరుగులు ఉన్న టీమిండియా స్కోర్‌ ఆరు బంతుల తర్వాత 207 పరుగులకి చేరింది. యువీ వరుసగా ఆరు సిక్సులు కొట్టడంతో పాటు టీ20ల్లో 12 బంతుల్లోనే అర్ధశతకం సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు.  

పోరాడిన ఇంగ్లాండ్‌: 

అనంతరం లక్ష్య చేదనకు దిగిన ఇంగ్లాండ్‌ జట్టు నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 18 పరుగులతో గెలుపొందింది. డారెన్‌ మ్యాడీ(29), విక్రమ్‌సోలంకి(43) శుభారంభం చేయగా కెవిన్‌ పీటర్‌సన్‌(39), కాలింగ్‌వుడ్‌(28) తక్కువ పరుగులకే ఔటయ్యారు. ఆఖర్లో ఓవైస్‌ షా(21), లూక్‌రైట్‌(16) పోరాడినా ఇంగ్లాండ్‌ను గెలిపించలేకపోయారు. 

 



Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.