close

తాజా వార్తలు

బ్యాట్‌ పట్టాల్సినోడు.. రాకెట్‌ పట్టాడు!

ఇల్లు తాకట్టుపెట్టి.. అకాడమీ నిర్మించాడు

పుల్లెల గోపీచంద్‌.. పరిచయం అక్కర్లేని పేరు. భారత బ్యాడ్మింటన్‌లో భవిష్యత్‌ ఛాంపియన్లను తయారు చేసే కేరాఫ్‌ అడ్రస్‌. 2001లో ‘ఆల్‌ ఇంగ్లాండ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌’ గెలిచిన గోపీ.. నిస్వార్థమైన ఆలోచనతో అకాడమీని స్థాపించాడు. తనకు లేని సదుపాయాలను భవిష్యత్‌ తరాలకు అందిస్తే.. దేశం గర్వించదగ్గ ఛాంపియన్లు తయారవుతారని బలంగా నమ్మాడు. అలా 2001లో వచ్చిన ఆలోచన కార్యరూపం దాల్చడానికి ఏడేళ్లు పట్టింది. ఎంతో కష్టపడి ప్రపంచస్థాయి శిక్షణ శిబిరం ఏర్పాటు చేసి.. సైనా నెహ్వాల్‌, పీవీ సింధు, పారుపల్లి కశ్యప్‌, కిదాంబి శ్రీకాంత్‌ వంటి ఛాంపియన్లను తీర్చిదిద్దాడు. ఈరోజు గోపీచంద్‌ పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక కథనం..

బ్యాట్‌ పట్టాల్సినోడు.. రాకెట్‌ పట్టాడు:


1973 నవంబర్‌ 16న జన్మించిన పుల్లెల గోపీచంద్‌.. చిన్నప్పుడు క్రికెట్‌పై ఆసక్తి ఉన్నా సోదరుడి ప్రోద్బలంతో బ్యాడ్మింటన్‌ బాట పట్టాడు‌. హైదరాబాద్‌లోనే చదువు పూర్తి చేసి 1990-91లో ఇండియన్‌ కంబైన్డ్‌ యూనివర్సిటీస్‌ బ్యాడ్మింటన్‌ జట్టుకు కెప్టెన్‌గా చేశాడు. ఎస్‌.ఎం. అరిఫ్‌, ప్రకాశ్‌ పదుకొణెల వద్ద శిక్షణలో రాటుదేలాడు. తర్వాత బెంగుళూరు స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో ప్రత్యేకంగా శిక్షణ పొందాడు. నిరంతర సాధనతో 1996 నుంచి 2000వరకు వరసగా ఐదేళ్లు జాతీయ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌గా నిలిచి రికార్డు సృష్టించాడు. 1998 కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో పురుషుల జట్టు విభాగంలో రజతం, పురుషుల సింగిల్స్‌ విభాగంలో కాంస్యం సాధించాడు. ఈ క్రమంలో 1999లో ‘తౌలోస్‌ ఓపెన్‌ ఛాంపియన్‌షిప్‌’, ‘స్కాటిష్‌ ఓపెన్‌ ఛాంపియన్‌షిప్‌’లు సొంతం చేసుకున్న గోపీచంద్‌.. 2001లో ఆల్‌ ఇంగ్లాండ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ను సాధించి చరిత్ర సృష్టించాడు. 1980లో తన గురువు ప్రకాశ్‌ పదుకొణె తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారతీయుడిగా నిలిచాడు. 

ఇల్లు తాకట్టు పెట్టి అకాడమీ నిర్మాణం:

సరైన శిక్షణ సౌకర్యాలు లేకపోయినా గోపీచంద్‌ అలుపెరుగని యోధుడిలా పోరాడాడు. గాయాలు వెంటాడినా, కష్టాలు ఎదురైనా అన్నింటినీ ఎదుర్కొని నిలబడ్డాడు. భారత బ్యాడ్మింటన్‌ను మరో స్థాయికి తీసుకెళ్లి.. ‘గోపీచంద్‌ అకాడమీ’ని స్థాపించాడు. ఈ క్రమంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. అకాడామీ స్థాపనకు ప్రభుత్వం భూమి ఇచ్చినా.. దాని నిర్మాణానికి ఆర్థిక వనరులు ఆయన వద్ద లేవు. సహాయం చేస్తామన్న వాళ్లు ముఖం చాటేసినా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ముందడుగు వేశాడు. ఈ నేపథ్యంలో ఇంటినే తాకట్టు పెట్టి అకాడమీ నిర్మాణం చేపట్టాడు. తర్వాత, ఓ వ్యాపారవేత్త ఆర్థికంగా చేయూతనందించడంతో 2008లో గోపీచంద్‌ అకాడమీ ప్రారంభమైంది. పీవీ సింధు, సైనా నెహ్వాల్‌, కిదాంబి శ్రీకాంత్‌, సాయి ప్రణీత్‌ తదితర ఛాంపియన్లంతా ఆయన శిష్యులే. వీరంతా ఆయన అకాడమీలో శిక్షణ పొందారు. 2012 సమ్మర్‌ ఒలింపిక్స్‌లో సైనా కాంస్యం,  2014 చైనా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌లో కిదాంబి శ్రీకాంత్‌ ఛాంపియన్‌, 2014 కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో పారుపల్లి కశ్యప్‌ స్వర్ణం, 2016 ఒలింపిక్స్‌లో సింధు రజతం.. ఈ పతకాలు చాలు గోపీ గురించి చెప్పడానికి. 

గోపీకి వచ్చిన అవార్డులు: 
* 1999లో అర్జున అవార్డు
* 2001లో రాజీవ్‌ గాంధీ ఖేల్‌ రత్నా అవార్డు
* 2005లో పద్మశ్రీ  
* 2009లో ద్రోణాచార్య అవార్డు
* 2014లో పద్మ భుషణ్‌


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.