close

తాజా వార్తలు

ఆయన నన్ను తమ్ముడిలా ఆదరించారు: కేసీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణ గవర్నర్‌గా నరసింహన్‌ సేవలను కోల్పోవడం అత్యంత బాధగా ఉందని సీఎం కేసీఆర్‌ అన్నారు. తెలంగాణలో గవర్నర్‌గా నరసింహన్‌ సేవలు ముగియడంతో ప్రగతి భవన్‌లో ఏర్పాటుచేసిన ఆత్మీయ వీడ్కోలు సభలో సీఎం మాట్లాడారు. గవర్నర్‌తో తనకున్న అనుబంధాన్ని, ఎప్పటికప్పుడు తనకు అండగా నిలుస్తూ, ప్రోత్సహించిన విధానాన్ని గుర్తు చేసుకున్నారు. తనకు ఓ పెద్దదిక్కులా, రాష్ట్రానికి మార్గదర్శకుడిగా వ్యవహరించిన గవర్నర్ పదవీ విరమణ చేసి వెళ్లిపోవడం బాధాకరంగా ఉందని అన్నారు. తొమ్మిదినరేళ్లుగా గవర్నర్‌గా నరసింహన్.. ఓ ఉద్యమకారుడిగా  ముఖ్యమంత్రిగా తాను బాధ్యతలు నిర్వర్తించానన్న కేసీఆర్... ఇద్దరి మధ్య అనేక గొప్ప జ్ఞాపకాలున్నాయని ఉద్వేగంతో అన్నారు. ఉద్ధృతంగా సాగుతున్న తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసేందుకే మాజీ ఐపీఎస్ అధికారి అయిన నరసింహన్ గవర్నర్‌గా వచ్చారన్న భయం కొందరిలో ఉండేదని.. ఆ సమయంలో తాను కలిసినప్పుడు ఉద్యమ నేపథ్యాన్ని, ఇన్నేళ్లుగా ఉద్యమం సజీవంగా ఉండడానికి గల కారణాలను ఆయన ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారని సీఎం గుర్తు చేశారు. కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో విభాగాధిపతిగా పనిచేసిన అనుభవం కలిగిన గవర్నర్ తెలంగాణ ఉద్యమం గురించి, ఇక్కడి ప్రజల డిమాండ్ గురించి కేంద్రానికి సరైన నివేదికలు పంపి న్యాయం చేస్తారనే నమ్మకం ఉందన్న విశ్వాసాన్ని తొలినాళ్లలోనే వ్యక్తం చేశానని అన్నారు. 

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వాకబు చేసేవారు
నరసింహన్ గవర్నర్‌గా ఉన్నపుడే రాష్ట్ర ఆవిర్భావంతో పాటు తెరాస రెండు మార్లు అధికారంలోకి వచ్చిందన్న ముఖ్యమంత్రి... ఆయనను ఓ పెద్ద మనిషిలా చూశానని, ఆయన కూడా తనను తమ్ముడిలా ఆదరించని తెలిపారు. పథకాల మంచి, చెడులు ఎప్పటికప్పుడు చర్చించేవారని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వాకబు చేసేవారని చెప్పారు. కేసీఆర్ కిట్స్, రెండు పడకగదుల ఇండ్లు, హరితహారం, మిషన్ భగీరథ లాంటి పథకాలు నరసింహన్‌కు ఎంతో బాగా నచ్చాయని... పేదలకు ఉపయోగపడుతున్నాయన్న సంతృప్తి వ్యక్తం చేశారని సీఎం గుర్తు చేశారు. ఎప్పుడైనా కొంచెం బాధపడినా, ఇబ్బంది అనిపించినా వెన్ను తట్టి ధైర్యం చెప్పేవారని... ప్రజల మంచి కోసం చేసే పనికి భగవంతుడి దీవెనలుంటాయని అనేవారని తెలిపారు. 

తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి చొరవ

రాజ్ భవన్‌కు వెళ్లిన ప్రతిసారీ ఎంతో ఆత్మీయంగా మాట్లాడి అన్ని విషయాలు చర్చించేవారని ముఖ్యమంత్రి చెప్పారు. రాజ్ భవన్‌ను నరసింహన్ ప్రజావేదికగా మార్చారన్న కేసీఆర్.. ఎవరైనా వెళ్లి సమస్యలు చెప్పుకునే వీలుండేదని అన్నారు. రాజ్ భవన్ వద్దకు వెళ్లేవారిని గవర్నర్ దంపతులు తల్లిదండ్రుల్లా ఆదరించేవారని.. పండగల సమయంలో నోరూరించే రుచులు అందించే వారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసే మంచి పనులకు కేంద్ర మంత్రులకు, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు గవర్నర్ వివరించేవారని... దాంతో మనకు మంచి ప్రశంసలు లభించేవని సీఎం అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి చొరవ చూపారని తెలిపారు. యాదాద్రి పునరుద్ధరణకు శ్రీకారం చుట్టినప్పుడు గవర్నర్ దంపతులు ఎంతో నిష్ఠతో మడికట్టుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.

యాదాద్రి పూర్తయ్యాక రావాలని విజ్ఞప్తి
తల్లిదండ్రులను కోల్పోయిన తాను... పెద్దదిక్కుగా కనిపించిన గవర్నర్ దంపతులకు సోదరభావంతో పాదాభివందనం చేసి ప్రారంభించిన గుడి పని విజయవంతగా కొనసాగుతోందని తెలిపారు. యాదాద్రి పనులు పూర్తయ్యాక నరసింహన్ మళ్లీ వచ్చి పూజలో పాల్గొనాలని కేసీఆర్ కోరారు. గవర్నర్ నరసింహన్ చూపిన ప్రేమ, అభిమానం జీవితాంతం గుర్తుండి పోతాయన్న ఆయన... నరసింహన్‌కు ఇచ్చినట్లే వచ్చే గవర్నర్ కూడా అదే గౌరవం ఇస్తామని, రాజ్ భవన్ ప్రాశస్త్యాన్ని కాపాడతామని చెప్పారు. ప్రసంగం మధ్యలో సీఎం పలుమార్లు ఉద్వేగానికి లోనయ్యారు.

అనంతరం నరసింహన్‌ మాట్లాడుతూ.. ఎంతో పట్టుదల ఉన్న నేత కేసీఆర్‌ అని కొనియాడారు. ప్రజా సంక్షేమం కోసం నిబద్ధతతో పాటుపడతారని చెప్పారు. ప్రతి అంశంపైనా ఆయన తనతో చర్చించేవారని గుర్తుచేసుకున్నారు. 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.