close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 9 AM

1. 360 మందే చేరిక

రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు విధుల్లో చేరికపై విధించిన గడువు ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా కొద్దిమంది సిబ్బంది మాత్రమే విధుల్లో చేరారు. మంగళవారం అర్ధరాత్రిలోగా విధుల్లోకి చేరకపోతే మిగిలిన బస్సులను కూడా ప్రైవేటుపరం చేస్తామని గత శనివారం రాత్రి సీఎం కేసీఆర్‌ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం పొద్దుపోయేవరకు మొత్తం 360 మంది విధుల్లో చేరేందుకు లేఖలిచ్చినట్లు సమాచారం. ఇందులో బస్‌భవన్‌లోని పరిపాలన సిబ్బంది 200 మంది వరకు ఉన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌లో 62 మంది, హైదరాబాద్‌ జోన్‌లో 31, ఇతర డిపోల పరిధిలో మిగిలిన వారు విధుల్లో చేరేందుకు ముందుకు వచ్చినట్లు తెలిసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. వినోదాల హరివిల్లు ఈటీవీ విన్‌

డిజిటల్‌ మాధ్యమంలో సరికొత్త అధ్యాయానికి ఈనాడు టెలివిజన్‌ శ్రీకారం చుట్టింది. ఎక్కడ ఉన్నా, ఏ సమయంలోనైనా ప్రేక్షకులను వినోదాల ప్రపంచంలో విహరింపజేసే ‘ఈటీవీ విన్‌’ మొబైల్‌ యాప్‌ను ప్రారంభించింది. రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు  దీన్ని ఆవిష్కరించారు. ఈ యాప్‌ను గూగుల్‌ ప్లేస్టోర్‌ లేదా యాప్‌స్టోర్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈటీవీ నెట్‌వర్క్‌లోని 7 ఛానళ్ల కార్యక్రమాలన్నీ ఈ యాప్‌లో లభిస్తాయి. తెలుగువారంతా అభిమానించే ఈటీవీ సీరియల్స్‌ అన్నీ ఇందులోనూ చూడవచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. 500 మంది విద్యార్థులుంటే కళాశాల

మండలకేంద్రంలో 500మంది కంటే ఎక్కువ విద్యార్థులుండే పాఠశాలను జూనియర్‌ కళాశాలగా మార్పు చేయాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి  ఆదేశించారు. పాఠశాలలు, ఆస్పత్రుల్లో ‘నాడు-నేడు’ కార్యక్రమం కింద కల్పించనున్న మౌలిక వసతులపై మంగళవారం ఆయన అధికారులతో సమీక్షించారు. ఈనెల 14న నాడు-నేడు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 45 వేల పాఠశాలల్లో 3 విడతల్లో మౌలిక సదుపాయాలు కల్పించనున్నామన్నారు. పాఠశాలల తర్వాత జూనియర్‌, డిగ్రీ, పాలిటెక్నిక్‌, ఐటీఐ, గురుకుల పాఠశాలలు, వసతిగృహాలను బాగు చేయనున్నామని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. తితిదే ఆగమ సలహామండలి సభ్యుడిగా రమణదీక్షితులు

తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమ సలహాదారుగా తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులిచ్చింది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గతంలో ఇచ్చిన హామీ మేరకు రమణ దీక్షితులతో పాటు మరో నలుగురు విశ్రాంత అర్చకులను ఆగమ సలహామండలి సభ్యులుగా నియమించారు. ఈ విషయమై మంగళవారం రమణ దీక్షితులు ఎలాంటి ప్రకటనా చేయలేదు. బుధవారం శ్రీవారి ఆలయ ప్రవేశం అనంతరం మీడియాతో మాట్లాడతానని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. వాతావరణ ఒప్పందానికి అమెరికా టాటా

భూతాపాన్ని కట్టడి చేయడానికి 2015లో కుదిరిన పారిస్‌ వాతావరణ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు అమెరికా లాంఛనంగా ఐక్యరాజ్య సమితి (ఐరాస)కి తెలియజేసింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో ఒక నోటీసు ఇచ్చారు. చరిత్రాత్మకమైన పారిస్‌ ఒప్పందంపై భారత్‌ సహా 188 దేశాలు సంతకాలు పెట్టిన సంగతి తెలిసిందే. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఇందులో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. సౌర కుటుంబ హద్దులు దాటేసిన ‘వాయేజర్‌-2’

అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా)కు చెందిన వాయేజర్‌-2 వ్యోమనౌక సౌర కుటుంబ పరిధిని దాటి వెళ్లిపోయింది. సూర్యుడి ప్రభావం లేని, తారాంతర మాధ్యమాన్ని (ఇంటర్‌స్టెల్లార్‌ స్పేస్‌ మీడియం-ఐఎస్‌ఎంకు) చేరుకుంది. భూమి నుంచి పయనమైన 4 దశాబ్దాల తర్వాత ఈ వ్యోమనౌక ఈ లక్ష్యాన్ని సాధించింది. దీంతో ఆ ఘనతను సాధించిన రెండో వ్యోమనౌకగా చరిత్ర సృష్టించింది. 2012లో వాయేజర్‌-1 ఆ ప్రత్యేకతను అందుకుంది. సూర్యుడి నుంచి వెలువడే గాలులు.. సౌర కుటుంబం చుట్టూ బుడగ ఆకృతిలో ఒక సరిహద్దును ఏర్పరుస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. వేడుకల్లో తుపాకీ పేలిస్తే జైలు!

ఆయుధాల అక్రమ తయారీ, అనుమతి లేకుండా విక్రయాలు, అనుమతి లేకుండా వాటిని కలిగి ఉండటం వంటి పరిణామాలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. వీటిని కట్టడి చేసేందుకు ఆయుధాల చట్టాన్ని మరింత కఠినతరం చేయాలని భావిస్తోంది. అక్రమ ఆయుధాలతో నేరాలకు పాల్పడేవారికి ప్రస్తుతమున్న మూడేళ్ల కనీస జైలు శిక్షను... నేర తీవ్రతను బట్టి ఏడేళ్ల నుంచి జీవిత ఖైదుగా మార్చాలని యోచిస్తోంది. ముఖ్యంగా బహిరంగ, ఆధ్యాత్మిక ప్రదేశాల్లో; పుట్టిన రోజు, వివాహ వేడుకల్లో వినోదం కోసం తుపాకులు పేలిస్తే.. రెండేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధించాలని ప్రతిపాదిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఫేస్‌బుక్‌ గ్రూప్‌ కొత్త లోగో

ఫేస్‌బుక్‌ తాజాగా తన లోగోను మార్చింది. తన అనుబంధ కంపెనీలు జతచేరిన అనంతరం జరిగిన మార్పును సూచిస్తూ ఈ లోగో ఉంది. ఫేస్‌బుక్‌ అనే వర్ణమాలను క్యాపిటల్‌ అక్షరాలుగా చేసి.. కొత్త ఫాంట్‌లోకి మార్చారు. నీలం, ఆకుపచ్చలతో పాటు వంగపండు రంగు, ఎరుపు, నారింజ రంగులతో కలగలిపిన రంగులతో కొత్త లోగో తీసుకొచ్చింది. తద్వారా ఇతర బ్రాండ్లనూ లోగోలో కనిపింపజేశారు.(నీలం-ఫేస్‌బుక్‌, ఆకుపచ్చ-వాట్సప్‌, వంగపండు, ఎరుపు, నారింజ-ఇన్‌స్టాగ్రామ్‌). తనకు చెందిన యాప్స్‌ల విషయంలో వినియోగదారులకు మరింత స్పష్టత నిచ్చేలా ఈ లోగోను తీర్చిదిద్దినట్లు అనిపిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఐపీఎల్‌లో నోబాల్‌ అంపైర్‌!

ఐపీఎల్‌లో కేవలం నోబాల్స్‌ కోసమే ఓ అంపైర్‌ను నియమించాలని ఐపీఎల్‌ పాలకవర్గం భావిస్తోంది. గత కొన్ని సీజన్లలో నోబాల్స్‌ విషయంలో అనేక తప్పిదాలు జరగడంతో భారత అంపైర్ల ప్రమాణాలపై ఆందోళన వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌ పాలకవర్గ సమావేశంలో ఫ్రంట్‌ఫుట్‌, హైట్‌ నోబాల్స్‌పై నిర్ణయం తీసుకునేందుకు ప్రత్యేకంగా అంపైర్‌ను నియమించడంపై ప్రధానంగా చర్చ జరిగింది. ‘‘అంతా అనుకున్నట్లు సాగితే వచ్చే ఐపీఎల్‌లో ఎప్పుడూ ఉండే ఇద్దరు అంపైర్లకు తోడు మరో అంపైర్‌ మైదానంలో ఉంటాడు. నోబాల్స్‌ చూడటమే అతడి విధి. ఈ పద్ధతి చాలా విచిత్రంగా అనిపించవచ్చు. కానీ దీనిపై చర్చ జరిగింది’’ అని ఓ ఐపీఎల్‌ పాలకవర్గ సభ్యుడు చెప్పాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. 24 గంటలు.. ఎన్నో మలుపులు

ఈషా రెబ్బా నటించిన చిత్రం ‘రాగల 24 గంటల్లో’. శ్రీనివాస్‌రెడ్డి దర్శకుడు. శ్రీనివాస్‌ కానూరు నిర్మాత. సత్యదేవ్‌, శ్రీరామ్‌, ముస్కాన్‌ కీలక పాత్రధారులు. మంగళవారం హైదరాబాద్‌లో ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. అనంతరం  ఆయన మాట్లాడుతూ ‘‘ప్రచార చిత్రం బాగుంది. సినిమా చూడాలన్న ఆసక్తి రేకెత్తిస్తోంద’’న్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఆద్యంతం మలుపులతో సాగే చిత్రమిది. చివరి నిమిషం వరకూ సస్పెన్స్‌ను కొనసాగించాం. ఈషా రెబ్బా సరికొత్త అవతారంలో కనిపించనుంది. ఇటీవల విడుదల చేసిన పాటలకు మంచి స్పందన వస్తోంద’’న్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.