close

తాజా వార్తలు

ఉత్తమ తల్లిదండ్రులు అవ్వాలంటే..!

పిల్లలను తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచుతారు. వారికి కావాల్సినవన్నీ కొని పెడుతూ అచ్చటాముచ్చటా తీరుస్తుంటారు. వేలు పట్టి నడిపించిన దగ్గరి నుంచి వారికి వివాహం చేసేంత వరకూ బాధ్యతంతా తమపైనే వేసుకుంటారు.  వృద్ధాప్యంలో తమను కూడా పిల్లలు అంతే ప్రేమతో చూసుకోవాలని ఆశిస్తారు. కానీ, కొన్ని సందర్భాల్లో ఆ కోరిక బెడిసికొడుతోంది.  తల్లిదండ్రులను ద్వేషించిన వారు కొందరైతే.. వారిని వృద్ధాశ్రమాల్లో చేర్పించి తమ బాధ్యత తీరిపోయిందని  చేతులు దులుపుకొనే వారు ఇంకొందరు. ఇలాంటి పరిణామాలకు బాల్యంలో పిల్లల్ని పెంచే పరిస్థితులు కూడా  దోహదం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఉత్తమ తల్లిదండ్రులుగా ఎలా మారాలో కొన్ని చిట్కాలు అందిస్తున్నారు. అవేంటో చూసేద్దామా?

అభిప్రాయలను రుద్దకండి


 

తమ పిల్లలకు మంచి జీవితం ఇవ్వాలన్న తపన ప్రతి ఒక్క తల్లిదండ్రులకూ ఉంటుంది. ఎంత చేసినా ఇంకా చేయాలనే ఆరాటపడుతుంటారు. అవసరమైన వసతులన్నీ కల్పిస్తూ తక్కువ సమయంలోనే వారు అభివృద్ధి చెందాలనుకుంటారు. కానీ, ఇలా చేయడం మంచిదికాదంటున్నారు నిపుణులు.  మన అభిప్రాయాలను వారిపై రుద్దకూడదని,  వారికి దేనిపై ఆసక్తి ఉందో అందులోనే వాళ్లు రాణించేలా చూడాలంటున్నారు. అంతేకాకుండా పిల్లలు ఏదైనా విజయం సాధించినప్పుడు కుటుంబమంతా ఆ విజయాన్ని ఆస్వాదించాలని చెబుతున్నారు. దీనివల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరిగి, మరిన్ని విజయాలు సాధించడానికి బాటలు వేస్తుందట.

 

వారికి కొంత సమయాన్ని కేటాయించండి


ఈ హడావుడి జీవితాల్లో భార్యాభర్తలిద్దరూ  ఉద్యోగం చేయడం సర్వసాధారణమైపోయింది. పుట్టిన కొన్ని నెలలకే చిన్నారులను ‘ బేబీ కేర్‌ సెంటర్‌’లలో పడేసి ఉద్యోగానికి వెళ్లిపోతున్నారు. సాయంత్రం ఇంటికి తీసుకొచ్చి కావాల్సినవన్నీ పెడుతున్నారు. ఇలా చేయడం వల్ల పిల్లలు ఒంటరి తనానికి గురయ్యే అవకాశాలున్నాయి. అందువల్ల పిల్లలతో వీలైనంత ఎక్కువ సమయం గడిపేలా తల్లిదండ్రులు ప్రణాళిక వేసుకోవాలి. వారితో  కలిసి ఆడుతూ.. నీతి కథలు చెప్తూ వారి జ్ఞానాన్ని పెంపొందించేందుకు ప్రయత్నించాలి. కనీసం వారాంతాల్లోనైనా ఇంకెలాంటి పనులు పెట్టుకోకుండా పూర్తి సమయం వారికే కేటాయించేలా చూసుకోవాలి.

ఇచ్చి పుచ్చుకోవడం నేర్పండి

ఇంట్లో ఒకరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పుడు వారి మధ్య ఇచ్చి పుచ్చుకునే ధోరణిని పెంపొందించాలి.  సాధారణంగా చిన్నారులు తమ దగ్గర ఉన్న వస్తువులను వేరొకరికి ఇచ్చేందుకు ఇష్టపడరు. అలాంటప్పుడు తల్లిదండ్రులే చొరవ తీసుకొని ఎదుటివారికి ఇప్పించేలా నచ్చజెప్పాలి. దీని వల్ల భవిష్యత్‌లో వేరొకరికి సాయపడటం అలవాటవుతుంది. 

ఒత్తిడిని తగ్గించండి

పాఠశాల, కళాశాలలకు వెళ్లే పిల్లలకు చదువుల్లో కొంత ఒత్తిడి ఉండటం సహజం. అటు స్కూళ్లలో సబ్జెక్టులతో కుస్తీ పట్టి.. ఇంటికి రాగానే మళ్లీ చదవమంటే అలసట వస్తుంది. క్రమేపీ చదువు పట్ల ఆసక్తి కోల్పోతారు. అందువల్ల ఎప్పుడూ చదువే కాకుండా వాళ్లతో కలిసి ఆడుకోవడమో.. అలా వారిని  బయట తిప్పి తీసుకురావడమో చేయాలి.  వారాంతాల్లో ఏదైనా విహార యాత్రకు తీసుకెళ్లడం, చిన్న చిన్న బహుమతుతో వారిని ఆశ్చర్య పరచడం లాంటి వారిలో ఒత్తిడిని కొంత వరకు తగ్గిస్తాయి. 

వారు చెప్పే ముచ్చట్లు వినండి

స్కూలుకు వెళ్తున్న చిన్నారులు క్లాసులో జరిగిన సంగతులను ఎప్పుడెప్పుడు  అమ్మనాన్నలకు చెప్పేద్దామా అన్న ఆసక్తితో ఉంటారు. ఇంటికి రాగానే తాను చెప్పదలచుకున్న దాన్ని ఏకబిగిన చెప్పేస్తారు. అలాంటప్పుడు తల్లిదండ్రులు విసుక్కోకుండా, వారేం చెబుతున్నారో వినాలి. అవసరమైన సూచనలు, సలహాలు అందించాలి. మాటల సందర్భంలో ఆ రోజు క్లాస్‌లో ఏయే పాఠాలు  చెప్పారో అడగాలి. దీనివల్ల తరగతి గదిలో టీచర్‌ చెప్పే విషయాలను ఆసక్తిగా వినడం వారికి అలవాటవుతుంది. 

పగలు పెంచుకోవద్దు..

పిల్లలు కొంచెం పెద్దవాళ్లయిన తర్వాత  చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. ఆ మాత్రం దానికే వారి భయపెట్టి, నెలలకొద్దీ వారితో మాట్లాడక పోవడం, వారిని ఇబ్బంది పెట్టడం లాంటివి చేయకూడదు. దీని వల్ల మీపై వారికి వ్యతిరేక భావన ఏర్పడుతుంది. వాళ్లు చేసింది తప్పయినప్పటికీ  వెంటనే తిట్టేయకుండా.. ఏకాంతంగా వారితో మాట్లాడటానికి ప్రయత్నించండి. వారు చేసిన పని వల్ల ఎలాంటి నష్టం జరుగుతుందో వివరించండి. ఇలా చేయడం వల్ల వారిలో సొంతంగా ఆలోచించే తత్వం పెరుగుతుంది. ఇంకోసారి అలాంటి పనులు చేసే ముందు కచ్చితంగా ఆలోచిస్తారు.

-ఇంటర్నెట్‌ డెస్క్‌


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.