close
సిలికానాంధ్ర మనబడి తరగతులు ప్రారంభం..

వాషింగ్టన్‌: అమెరికాతో పాటు 10 ఇతర దేశాల్లోని ప్రవాసాంధ్రుల పిల్లలకు తెలుగు నేర్పించేందుకు సిలికానాంధ్ర మనబడి ఎంతో కృషి చేస్తోందని మనబడి అధ్యక్షుడు రాజు చమర్తి ఓ ప్రకటనలో వెల్లడించారు. తాజాగా 2019-20 విద్యాసంవత్సరానికి సంబంధించి సెప్టెంబర్‌ 7 నుంచి తరగతులను ప్రారంభించినట్లు చెప్పారు. ఈ విద్యాసంవత్సరంలో అత్యధికంగా 10వేల మందికి పైగా విద్యార్థులు ప్రవేశానికి నమోదు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. సిలికానాంధ్ర మనబడి తెలుగు విశ్వవిద్యాలయంతో పాటు, ప్రతిష్ఠాత్మక వాస్క్‌ (ACS - WASC) అక్రిడిటేషన్‌, ఫారిన్‌ లాంగ్వేజ్‌లతో గుర్తింపు పొందిందని తెలిపారు. ఈ బడి ద్వారా గత పన్నెండేళ్లలో 45వేల మందికి పైగా చిన్నారులకు తెలుగు నేర్పించినట్లు ఆయన పేర్కొన్నారు. పిల్లల్లో తెలుగు పాఠాలపై ఆసక్తి పెంపొందించడానికి ఈ సంవత్సరం మనబడి బాలరంజని అనే మొబైల్‌ యాప్ విడుదల చేశామని ఆయన వెల్లడించారు. 

మనబడి ఉపాధ్యక్షుడు శరత్‌ వేట మాట్లాడుతూ.. మనబడి అమెరికా వ్యాప్తంగా 260కిపైగా ప్రాంతాల్లో పిల్లలకు తెలుగు భాష నేర్పించడమే కాకుండా వారికి సంప్రదాయాల పట్ల అవగాహన కలిగే విధంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాట్లు చెప్పారు. సిలికానాంధ్ర మనబడిలో 2019-20 విద్యాసంవత్సరంలో ప్రవేశం కావాలనుకునే వారు సెప్టెంబర్‌ 20లోగా manabadi.siliconandhra.orgలో నమోదు చేసుకోవాలని తెలిపారు. ఇంకా మరిన్ని వివరాలు కావాలంటే 1-844-626-2234 నంబర్‌కు సంప్రదించాలని వెల్లడించారు. మనబడి విజయవంతంగా కొనసాగేందుకు సహకరిస్తున్న నాయకత్వం, ప్రాంతీయ-మనబడి సమన్వయకర్తలు, ఉపాధ్యయులు, తల్లిదండ్రులకు, స్వచ్ఛంద కార్యకర్తలకు సంచాలకులు ఫణిమాధవ్‌ కస్తూరి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 

వార్తలు / కథనాలు

మరిన్ని