close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆశలు పణం.. క్షణమో యుగం

అమెరికాలో తెలుగు విద్యార్థులపై కరోనా పిడుగు
వసతిగృహాలు ఖాళీ చేయించిన కళాశాలలు
ఉపాధి కోల్పోయిన వేల మంది

ఈనాడు - అమరావతి: కరోనా ప్రభావంతో అమెరికాలోని తెలుగు విద్యార్థుల ఆశలు తల్లకిందులయ్యాయి. అధిక శాతం మంది ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొందరు ఆహారానికీ అష్టకష్టాలు పడుతున్నారు. గతేడాది డిసెంబరు, ఈ ఏడాది జనవరిలో అక్కడికి వెళ్లిన వారు కుదురుకోక ముందే సమస్యలు చుట్టుముట్టాయి. చేరిన కొద్ది రోజులకే కళాశాలలను మూసేశారు. వారు గదులకే పరిమితమయ్యారు. ఆన్‌లైన్‌ క్లాసులతో చదువుకుంటున్నారు. కాస్త కుదురుకుని రెండు మూడేళ్లుగా ఉంటున్న వేల మంది విద్యార్థులకు పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు పోయాయి. అమెరికాలోని తెలుగు విద్యార్థుల ఇబ్బందులపై ‘ఈనాడు’ ప్రత్యేక కథనం..

అన్నీ ఊహించనివే..
వసతి గృహాలను (డౌన్స్‌) ఖాళీ చేయాలని హార్వర్డ్‌ తదితర ప్రతిష్ఠాత్మక సంస్థలతో సహా పలు విద్యాలయాలు సూచించాయి. దీంతో విద్యార్థులంతా బంధువుల ఇళ్లకో, స్నేహితుల వద్దకో, గది తీసుకుని ఉండటమో చేయాల్సి వచ్చింది. ఇవన్నీ విద్యార్థులు ఊహించనివే.  విద్యార్థులకు నెలకు 800 డాలర్లు (సుమారు రూ.60వేలు) ఖర్చవుతాయి. మన దేశం నుంచి వెళ్లే విద్యార్థుల్లో ఎక్కువ మంది చదువుకుంటూనే ఆచార్యుల సహాయకులుగా, లైబ్రరీ, ఫుడ్‌కోర్టులు ఇతర ఆన్‌క్యాంపస్‌ ఉద్యోగాలు చేస్తుంటారు. వీరికి గంటకు 8.5 డాలర్ల చొప్పున నెలకు 700 డాలర్లు వస్తాయి. ఇంటి నుంచి డబ్బు తెప్పించుకునే అవసరం ఉండదు. 20 రోజుల నుంచి వారికి సంపాదనే లేకుండాపోయింది. అమెరికా ప్రకటించిన భారీ ప్యాకేజీ ఆ దేశీయులకే పరిమితమైంది. దీంతో డబ్బు కోసం విద్యార్థులు తల్లిదండ్రుల వైపు చూస్తున్నారు. మన దేశంలోనూ లాక్‌డౌన్‌ ఉండటంతో సమయానికి సర్దుబాటు అవడం లేదు. దీంతో విద్యార్థులు అక్కడే అప్పు చేయాల్సి వస్తోంది.

పరీక్షించుకోవడానికి వెయ్యి డాలర్లు
కరోనా పరీక్షకు వెయ్యి డాలర్ల వరకు ఖర్చవుతోంది. భారతీయ విద్యార్థులకు ఇది ఖర్చుతో కూడుకున్నదే. బీమాకు అదనంగా ఇంత మొత్తం వెచ్చించడం సాధ్యం కాక పరీక్షలకు వెనకంజ వేస్తున్నారు. మరోవైపు భారతీయులు ఎక్కువగా వెళ్లే దుకాణాల్లో సరకులు నిండుకుంటున్నాయి. శానిటైజర్లు, మాస్కులు, హ్యాండ్‌వాష్‌ల కొరత ఉంది.


విద్యార్థులకు సాయమందిస్తున్నాం

-ఓక్లహోమాలో గ్రాడ్యుయేషన్‌ విద్యార్థి అక్షయ్‌రెడ్డి

డబ్బుల కోసం అవస్థలు పడుతున్న విద్యార్థులను ఆదుకునేందుకు తానా, నాటా సంస్థల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నాం. కళాశాలల వారితోనూ మాట్లాడటానికి చొరవ చూపుతున్నాం. ఎలాగోలా వారికి నెల ఖర్చులకు సరిపడా వచ్చినా ప్రయోజనకరమే.


ఖర్చులు పెరిగాయి

- ఆరిజోనాలో నివసిస్తున్న ఒంగోలు వాసి హర్ష

‘గతేడాది చివరలో అమెరికాకు వచ్చా. భోజనానికి నెలకు 250 నుంచి 300 డాలర్లు ఖర్చయ్యేవి. ఇప్పుడు దాదాపు రెట్టింపు అవుతోంది. మా కళాశాలలోనే 15 మందికి కరోనా సోకింది. వారికి దూరంగా ఉన్నందున మన విద్యార్థులకు ఇప్పటికిప్పుడు వచ్చిన ఇబ్బంది లేదు. కానీ ఈ పరిస్థితుల్లోనూ ఇక్కడ స్వేచ్ఛగా తిరుగుతున్నారు. అదే భయపెడుతోంది.


రిఫండ్‌ కోసం లేఖలు రాస్తున్నాం

- వాషింగ్టన్‌ డీసీలో  న్యాయవిద్య చదువుతున్న విజయవాడ తాడిగడప విద్యార్థి కుల్‌దీప్‌

విద్యార్థుల ఫీజు రిఫండ్‌ చేయాలని కళాశాలలకు లేఖలు రాస్తున్నాం. మార్చి, ఏప్రిల్‌లోనే ఎక్కువగా ఇంటర్వ్యూలు, నెట్‌వర్కింగ్‌ అవకాశాలు లభిస్తాయి. అకస్మాత్తుగా ఇలాంటి పరిస్థితి రావడంతో అంతా తల్లకిందులైంది.

Tags :

మరిన్ని