మధుకాన్‌పై అభియోగాలు అవాస్తవం
close

ప్రధానాంశాలు

మధుకాన్‌పై అభియోగాలు అవాస్తవం

ఈడీ దాడులు విస్మయకరం

తెరాస లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు

ఈనాడు, హైదరాబాద్‌: గత 40 ఏళ్లుగా దేశవ్యాప్తంగా ఎన్నో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను నిర్వహిస్తున్న మధుకాన్‌ సంస్థపై అభియోగాలు అవాస్తవమని తెరాస లోక్‌సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. రాంచీ ఎక్స్‌ప్రెస్‌వే ఎస్పీవీ కంపెనీ ద్వారా బిల్డ్‌ ఆపరేట్‌ ట్రాన్స్‌ఫర్‌ (బీవోటీ) పద్ధతిలో జాతీయ రహదారి ప్రాజెక్టును నిర్వహిస్తున్న మధుకాన్‌పై ఎవరూ ఫిర్యాదు చేయకుండానే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు దాడులు చేశారని ఆరోపించారు. ప్రాజెక్టులో నిధులు మళ్లించే అవకాశమే లేదని, ఎస్క్రో ఖాతాపై బ్యాంకుకే పూర్తి అధికారం ఉందన్నారు. జాతీయ రహదారుల నిర్మాణ సంస్థ జాప్యం వల్లే రాంచీ హైవే నిర్మాణ పనులు ఆగిపోయాయని, దీనికి బాధ్యత వహించకుండా మొత్తం ప్రాజెక్టు రద్దుచేశారన్నారు. కంపెనీకి జరిగిన అన్యాయంపై ఆర్బిట్రేషన్‌ ట్రైబ్యునల్‌కు వెళ్లామన్నారు. మధుకాన్‌లో తాను డైరెక్టర్‌గాగానీ, ఇతర ఏ బాధ్యతల్లో లేనని, తన ఇద్దరు సోదరులు చూసుకుంటున్నారన్నారు. తన నివాసంపై ఈడీ దాడులు విస్మయం కలిగించాయన్నారు. అయినా విచారణకు సహకరిస్తానన్నారు. కేసీఆర్‌, ఖమ్మం జిల్లా ప్రజలే తన బలమని, ఎన్ని ఇబ్బందులొచ్చినా సీఎం వెంటే ఉంటానన్నారు. తన ఇంటిపై ఈడీ దాడులు తన హక్కులకు భంగకరమని అన్నారు. శనివారం ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు.

ఎన్‌హెచ్‌ఏఐ 21 శాతం భూమే ఇచ్చింది

‘రాంచీ-జంషెడ్‌పూర్‌ మధ్య 163 కి.మీ. మేర నాలుగు వరసల రహదారి నిర్మాణానికి జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)తో మధుకాన్‌ 2011లో ఒప్పందం కుదుర్చుకుంది. రాంచీ ఎక్స్‌ప్రెస్‌వే ఎస్పీవీ కంపెనీ ద్వారా బీవోటీ పద్ధతిలో మధుకాన్‌ ఈ ప్రాజెక్టును నిర్వహిస్తుంది. అగ్రిమెంట్‌ తర్వాత 80 శాతం.. 90 రోజుల్లో 100 శాతం నిర్మాణ స్థలాన్ని ఎన్‌హెచ్‌ఏఐ అప్పగించాలి. ఏడేళ్లయినా ఎన్‌హెచ్‌ఏఐ పూర్తిస్థాయిలో భూములివ్వలేదు. 21 శాతం మేర భూమి ఇవ్వగా అందులో 60 శాతం పని పూర్తయింది. 10 శాతం మేర పెండింగ్‌లో ఉంది. రూ.1,655 కోట్ల ప్రాజెక్టులో రూ.463 కోట్లు కంపెనీ.. మిగతాది బ్యాంకు ఇవ్వాలి. ఆ డబ్బులు మొత్తం ఎస్క్రో ఖాతాలో వేయాలి. దానిపై పూర్తి అధికారం బ్యాంకుదే. రూ.485 కోట్లు కంపెనీ పెట్టింది. 652 కోట్లు బ్యాంకు పెట్టింది. వడ్డీగా మరో రూ.378 కోట్లు తీసుకుంది. 50 శాతం పని పూర్తయినందున మిగతా నిధులు తామే ఇస్తామని ఎన్‌హెచ్‌ఏఐ చెప్పి వెనక్కు వెళ్లింది. బిహార్లో చెట్లు కొట్టిన కేసుకు సంబంధించి ఒక వ్యాజ్యం దాఖలు కాగా...అందులో ఈ ప్రాజెక్టుని ఇంప్లీడ్‌ చేశారు. తర్వాత ఏ కారణం వల్లో ప్రాజెక్టును రద్దుచేశారు’’ అని నామా తెలిపారు. ఈడీ దాడులు రాజకీయ ప్రేరేపితమని భావిస్తున్నారా? అని విలేకరులు నామాను ప్రశ్నించగా... ఆయన మౌనం దాల్చారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని