నిజాం పాలనను గుర్తుచేస్తున్న కేసీఆర్‌: రేవంత్‌

ప్రధానాంశాలు

నిజాం పాలనను గుర్తుచేస్తున్న కేసీఆర్‌: రేవంత్‌

ఈనాడు డిజిటల్‌- కరీంనగర్‌, కమలాపూర్‌- న్యూస్‌టుడే: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిజాం పాలనను గుర్తు చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ సంస్కృతిని ఛిన్నాభిన్నం చేసేలా హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో తెరాస ఆగడాలకు పాల్పడుతోందన్నారు. సొంత పార్టీ నాయకులకే కట్నాలు చెల్లించే సంస్కృతిని అక్కడ ప్రవేశపెట్టారని.., వ్యాపారులను, నిరుద్యోగులను, క్షేత్రసహాయకులను హరీశ్‌ బెదిరిస్తున్నారని ఆరోపించారు. భాజపా, తెరాసలు ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు. ఆదివారం కరీంనగర్‌లో విలేకరులతోనూ, సాయంత్రం హనుమకొండ జిల్లా కమలాపూర్‌ బస్టాండ్‌ కూడలిలో జరిగిన ఎన్నికల ప్రచారసభలోనూ రేవంత్‌ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ భాజపా సీసాలో ఈటల పాత సారా అని ఎద్దేవా చేశారు. ఆస్తుల రక్షణ కోసం భాజపాను శరణుజొచ్చిన రాజేందర్‌కు హుజూరాబాద్‌ ప్రజలు ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. ఇక్కడ ప్రచారానికి రేవంత్‌ రాలేదని తెరాస అంటోందని.., తాను ప్రచారంలో ఇక్కడ ఉంటే.., కేసీఆర్‌, కేటీఆర్‌లు ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఈ ఉప పోరులో తెరాస ఓడిపోతే ఏం శిక్ష వేసుకుంటారో హరీశ్‌ చెప్పాలని అన్నారు. రాష్ట్ర పోలీసు విభాగం నిలువునా విడిపోయిందని, ఆ శాఖలో ఓ సామాజిక వర్గాన్ని అనుమానంగా చూస్తున్నారని రేవంత్‌ అన్నారు. తనపై నిఘా ఉందని చెప్పారు. ప్రస్తుత రాష్ట్ర పరిస్థితిని చూస్తే బాధ, ఆవేశం వస్తోందని.. ఈ సమయంలో ఎందుకు నక్సలైట్లు లేరా.? అనిపిస్తోందని.. కనీసం వాళ్లను చూసైనా వీరు అదుపులో ఉంటారనిపిస్తోందని అన్నారు. రాజకీయ నాయకుడిగా తాను అలా మాట్లాడకూడదని.. కానీ ప్రస్తుత పరిస్థితిని చూస్తే అనక తప్పడంలేదన్నారు. భాజపా రెండుగా చీలిపోయిందని అందులో కేసీఆర్‌ అనుకూల వర్గం ఒకటని, వ్యతిరేకవర్గం ఇంకొకటని.. అనుకూలవర్గంతో దళితబంధు ఆపించుకున్నారని రేవంత్‌ విమర్శించారు. హుజూరాబాద్‌ ప్రచారానికి భాజపా సీనియర్‌ నాయకులు విద్యాసాగర్‌రావు ఎందుకు రావడంలేదని ప్రశ్నించారు. దిల్లీలో గాడ్సే వారసులు అమిత్‌షా.. మోదీలని.. కేసీఆర్‌కు వారు గాడ్‌ఫాదర్‌లని విమర్శించారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల తరువాత తెరాసలో ముసలం పుడుతుందని.. వచ్చే ఏడాది డిసెంబరులోనే ముందస్తు ఎన్నికలు వస్తాయని రేవంత్‌ జోస్యం చెప్పారు. కేటీఆర్‌ సిరిసిల్లలో చంద్రబాబు బొమ్మ పెట్టుకొని గెలిచిన విషయం మరువొద్దన్నారు.

కాళేశ్వరం పేరిట కమీషన్లు

రూ.లక్షల కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టులు కట్టి కేసీఆర్‌ కమీషన్లు తీసుకున్నారని రేవంత్‌ ఆరోపించారు. పేదలు పండించిన క్వింటా ధాన్యానికి రూ.2 వేలు ఇస్తే ఏమవుతుందని ప్రశ్నించారు. పిల్లల ఉజ్వల భవిత, నిరుద్యోగుల కోసం పోరాడే వ్యక్తి బల్మూరి వెంకట్కు మద్దతుగా నిలవాలని కోరారు. కమలాపూర్‌ సభలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు దామోదర రాజనరసింహా, గీతారెడ్డి, షబ్బీర్‌ అలీ, మల్లు రవి, పొన్నం ప్రభాకర్‌, ఎమ్మెల్యే సీతక్క, వరంగల్‌ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు.  

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని