
తాజా వార్తలు
అంపైర్ విజిటింగ్ కార్డుపై.. కుంబ్లే పది వికెట్లు
2008లో అలా చేసి ఉంటే మాదే తప్పు అనుకునేవాళ్లు
ఇంటర్నెట్‌డెస్క్: ప్రస్తుతం క్రికెట్ లేకపోవడంతో ఇంటికే పరిమితమైన టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆన్లైన్లో వరుస ఇంటర్వ్యూలు చేస్తున్నాడు. తన యూట్యూబ్ ఛానల్‌తో పాటు ఇతర మాధ్యమాల్లోనూ మాజీ క్రికెటర్లను, తన సహచరులను ఒప్పించి ముచ్చటిస్తున్నాడు. ఆ వీడియోలను అభిమానులతో పంచుకోవడంతో అనేక ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. ఇటీవల మాజీ పేసర్లు వెంకటేశ్ ప్రసాద్, లక్ష్మీపతి బాలాజీల ఇంటర్వ్యూలు తీసుకున్న అతడు తాజాగా తన ‘డీఆర్ఎస్ విత్ ఆశ్’ కార్యక్రమానికి స్పిన్ దిగ్గజం అనిల్‌కుంబ్లేను ఆహ్వానించాడు. ఈ సందర్భంగా కుంబ్లే మాట్లాడుతూ తనకు సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నాడు. తొలుత కరోనా గురించి స్పందించిన అతడు తర్వాత తన పది వికెట్ల ప్రదర్శనపై మాట్లాడాడు. 1998లో పాకిస్థాన్‌పై దిల్లీలోని కోట్లా మైదానంలో మాజీ సారథి పది వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. అయితే, ఆ మ్యాచ్‌లో అంపైర్‌గా వ్యవహరించిన జయప్రకాశ్.. తర్వాత తన విజిటింగ్ కార్డుపై కుంబ్లే తీసిన పది వికెట్ల బ్యాట్స్‌మెన్ ఫొటోలను ముద్రించాడని, వాటిని అందరికీ పంచిపెట్టాడని అశ్విన్ గుర్తుచేశాడు. దీనిపై స్పందించిన మాజీ స్పిన్నర్ తనకు ఆ విషయం తెలుసని చెప్పాడు. అది చాలా ఆశ్చర్చకరమైన విశేషమని, ఎవరైనా బౌలర్ వికెట్లు తీస్తే అంపైర్ సెలబ్రేట్ చేసుకోవాలని ఎవరూ అనుకోరని చెప్పాడు. ఆ చారిత్రక ఘట్టంలో అందరూ పాలుపంచుకోవాలని అనుకుంటారని, జయప్రకాశ్ కూడా అలాగే భావించి ఉంటాడని కుంబ్లే అభిప్రాయపడ్డాడు.
అనంతరం 2008లో వివాదాస్పద ఆస్ట్రేలియా పర్యటన గురించి, అప్పుడు కెప్టెన్‌గా వ్యవహరించిన కుంబ్లే నాయకత్వ నిర్ణయాల గురించి అశ్విన్ ప్రశ్నించాడు. దీనికి స్పందిస్తూ కుంబ్లే ఇలా చెప్పుకొచ్చాడు. తొలుత తాను టీమ్ఇండియాకు కెప్టెన్‌గా నియమితుడవ్వడం గర్వంగా భావించానని చెప్పాడు. రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక తనకు ఆ అవకాశం వచ్చిందని తెలిపాడు. ఇక ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా మెల్బోర్న్లో తొలి టెస్టులో ఘోరంగా విఫలమయ్యామని చెప్పాడు. అప్పుడే పలువురు సీనియర్లు గాయాల బారిన పడ్డారని గుర్తుచేసుకున్నాడు. ఇక సిడ్నీ టెస్టులో టీమ్ఇండియా బాగానే పుంజుకుందని, తాము గెలవాల్సిన మ్యాచ్‌లో కొన్ని తప్పుడు అంపైరింగ్ నిర్ణయాల వల్ల ఓడిపోయామని వివరించాడు. అనంతరం మంకీగేట్ వివాదంపై స్పందిస్తూ.. ఆ విషయంలో టీమ్ఇండియా కలిసికట్టుగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. అప్పుడు సిరీస్‌ను రద్దు చేసుకొని భారత్ మధ్యలోనే తిరిగి రావాలనే డిమాండ్ పెరిగిందని, నిజంగా అలా చేసి ఉంటే టీమ్ఇండియా తప్పు చేసింది కాబట్టే మధ్యలో వచ్చేసిందని ప్రజలు తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉందని, దాంతో అక్కడే ఉండి తర్వాతి మ్యాచ్‌ల్లో గెలిచి ఆస్ట్రేలియాకు గట్టి జవాబు ఇవ్వాలనుకున్నట్లు కుంబ్లే పేర్కొన్నాడు. ఆ పరిస్థితులు తనకు సవాలుతో కూడుకున్నవని స్పష్టంచేశాడు. దురదృష్టవశాత్తు ఆ సిరీస్ డ్రాగా ముగిసిందని కుంబ్లే చెప్పుకొచ్చాడు.