స్టేడియంలోకి 80% మందికి అనుమతి

తాజా వార్తలు

Published : 30/06/2021 01:06 IST

స్టేడియంలోకి 80% మందికి అనుమతి

బర్మింగ్‌హామ్‌: క్రికెట్‌ అభిమానులకు శుభవార్త! స్టేడియం సామర్థ్యంలో 80% మంది అభిమానులను అనుమతించనున్నారు. ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జులై 13న జరిగే ఇంగ్లాండ్‌, పాక్‌ మ్యాచ్‌ కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. బ్రిటన్‌ ప్రభుత్వ కార్యక్రమాల పరిశోధన (ఈఆర్పీ)లో భాగంగా అభిమానులను అనుమతిస్తున్నారు.

పరిశోధనలో భాగంగా దాదాపు 19వేల మంది అభిమానులను భౌతిక దూరంతో సంబంధం లేకుండా ఎడ్జ్‌బాస్టన్‌ స్టేడియంలోకి అనుమతిస్తారు. వారు ఎక్కడైనా కూర్చోవచ్చు. 16 ఏళ్ల లోపు పిల్లలకూ అనుమతి ఇచ్చారు.

‘వెస్ట్‌ మిడ్‌ల్యాండ్స్‌ క్రీడల్లో ఇదో గొప్ప ముందడుగు. ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లాండ్‌, పాక్‌ మధ్య మరో బ్లాక్‌బస్టర్‌ను ఎంతో మంది అభిమానులు ఆస్వాదించొచ్చు’ అని వార్విక్‌షైర్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ స్టువర్ట్‌ కెయిన్‌ అన్నారు. కాగా రెండు వారాల క్రితమే ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ రెండో టెస్టుకు 70% మంది అభిమానులను (దాదాపు 60వేలు) అనుమతించడం గమనార్హం.

‘భారీ స్థాయి క్రీడల నిర్వహణకు కొత్త మోడల్‌ను అభివృద్ధి చేసేందుకు ఈ మధ్యే జరిగిన టెస్టు మ్యాచ్‌ మాకో గొప్ప అవకాశం కల్పించింది. ఇదే విధానాన్ని ఇప్పుడు పాకిస్థాన్‌ మ్యాచ్‌లో కొనసాగిస్తుండటం సంతోషకరం. ఎడ్జ్‌బాస్టన్‌ క్రీడా ప్రతిష్ఠకు భంగం కలగకుండా సురక్షిత వాతావరణం కల్పించేందుకు మేం సాంకేతికతను వినియోగించుకుంటాం’ అని కెయిన్‌ తెలిపారు.

ఈ మ్యాచ్‌కు హాజరయ్యే వారికి కొన్ని నిబంధనలు విధించారు. 11 ఏళ్లు పైబడిన వారు కొవిడ్‌ నెగెటివ్‌ నివేదిక చూపించాల్సి ఉంటుంది. లేదా రెండు వ్యాక్సిన్లు తీసుకొని 14 రోజులైనట్టు రిపోర్టు చూపించాలి. బహుశా త్వరలో జరిగే ఇంగ్లాండ్‌, భారత్‌ సిరీసుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంటారేమో చూడాలి!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని