close

తాజా వార్తలు

Updated : 31/10/2020 02:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బాదేశారు మళ్లీ..

స్టోక్స్‌, శాంసన్‌ ధనాధన్‌
గేల్‌ 99 వృథా
పంజాబ్‌ జైత్రయాత్రకు బ్రేక్‌

వరుసగా అయిదు విజయాలతో ప్లేఆఫ్‌ రేసులోకి దూసుకొచ్చిన కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కు బ్రేక్‌ పడింది. మరో విజయంతో ప్లేఆఫ్‌కు మరింత చేరువ కావాలనుకున్న ఆ జట్టు ఆశలకు గండికొడుతూ.. గేల్‌ విధ్వంసక ఇన్నింగ్స్‌ను వృథా చేస్తూ.. రాజస్థాన్‌ రాయల్స్‌ కీలక విజయం సాధించింది. ధనాధన్‌ బ్యాటింగ్‌తో మొన్న ముంబయికి షాకిచ్చిన స్టోక్స్‌, శాంసన్‌ జోడీ.. ఈసారి పంజాబ్‌కు పరాజయాన్ని రుచి చూపింది. 13 మ్యాచ్‌ల్లో రాజస్థాన్‌కిది ఆరో విజయం కాగా.. అన్నే మ్యాచ్‌లాడిన పంజాబ్‌ ఏడో ఓటమిని ఖాతాలో వేసుకుంది.
అబుదాబి: రాజస్థాన్‌ ప్లేఆఫ్‌ ఆశలు నిలిచాయి. ఆ జట్టు శుక్రవారం 7 వికెట్ల తేడాతో పంజాబ్‌ను ఓడించింది. మొదట పంజాబ్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 185 పరుగులు చేసింది. గ్రేల్‌ (99; 63 బంతుల్లో 6×4, 8×6) త్రుటిలో సెంచరీ కోల్పోయాడు. ‘మాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ స్టోక్స్‌ (50; 26 బంతుల్లో 6×4, 3×6)కు తోడు సంజు శాంసన్‌ (48; 25 బంతుల్లో 4×4, 3×6) మెరుపులు మెరిపించడంతో రాయల్స్‌ 17.3 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
ఆరంభంతోనే..: భారీ లక్ష్యాన్ని ఛేదించాలంటే ఎలాంటి ఆరంభం కావాలో అలాంటిదే అందించాడు స్టోక్స్‌. ముంబయితో గత మ్యాచ్‌లో మెరుపు శతకంతో భారీ లక్ష్య ఛేదనలో కీలక పాత్ర పోషించిన అతను.. ఈసారి కూడా అదే దూకుడు మంత్రాన్ని పాటించాడు. విధ్వంసక బ్యాటింగ్‌తో పంజాబ్‌ బౌలర్లను ఆత్మరక్షణలోకి నెట్టేశాడు. అందరి లయనూ దెబ్బ తీశాడు. రాయల్స్‌ 5.1 ఓవర్లకే వికెట్‌ కోల్పోకుండా 60 పరుగులు చేసింది. అప్పటికే స్టోక్స్‌ అర్ధశతకం పూర్తయిపోవడం విశేషం. అయితే ఈ 50 చేరుకున్న వెంటనే అతను జోర్డాన్‌ బౌలింగ్‌లో ఔట్‌ కావడంతో రాజస్థాన్‌కు తొలి దెబ్బ తగిలింది. ఆ తర్వాత రెండు ఓవర్లు రన్‌రేట్‌ తగ్గినా.. శాంసన్‌ జోరు అందుకోవడంతో మళ్లీ ఆ జట్టు గాడిలో పడింది. ఉతప్ప (30; 23 బంతుల్లో 1×4, 2×6)తో కలిసి ధాటిగా ఆడిన అతను రన్‌రేట్‌ పడిపోకుండా చూశాడు. ఉతప్ప ఔటైనా సంజు మాత్రం తగ్గలేదు. స్మిత్‌ తోడుగా పరుగుల వేట సాగించాడు. అతడి దూకుడుతో విజయ సమీకరణం 36 బంతుల్లో 42 పరుగులుగా మారింది. ఈ దశలో సంజు రనౌట్‌ కావడంతో కాస్త ఉత్కంఠ నెలకొన్నా, ఒత్తిడిని తట్టుకుంటూ ప్రశాంతంగా ఆడిన స్మిత్‌ (31 నాటౌట్‌; 20 బంతుల్లో 5×4).. బట్లర్‌ (22 నాటౌట్‌; 11 బంతుల్లో 1×4, 2×6)తో కలిసి రాజస్థాన్‌ను గెలిపించాడు.

గేల్‌ తడాఖా: అంతకుముందు గేల్‌ తడాఖా చూపించాడు. మన్‌దీప్‌ (0) ఔట్‌ ఔటయ్యాక.. రెండో ఓవర్లోనే క్రీజులోకి వచ్చిన అతడు ఆరంభంలో తడబడ్డాడు. 10 పరుగుల వద్ద పరాగ్‌ క్యాచ్‌ వదిలేయడంతో జీవనదానం పొందిన క్రిస్‌ ఆ తర్వాత మెరుపు షాట్లు కొట్టాడు. మరోవైపు రాహుల్‌ (46; 41 బంతుల్లో 3×4, 2×6) కూడా చక్కని టైమింగ్‌తో ధాటిగా ఆడడంతో పంజాబ్‌ స్కోరు పరుగులెత్తింది. ఆ జట్టు 13 ఓవర్లకు 101/1తో పటిష్ట స్థితిలో నిలిచింది. రాహుల్‌ వెనుదిరిగాక గేల్‌కు పూరన్‌ (22; 10 బంతుల్లో 3×6) జత కలవడంతో పంజాబ్‌ స్కోరు దూసుకెళ్లింది. ఆర్చర్‌ వేసిన చివరి ఓవర్లో 99పై నిలిచిన గేల్‌ మూడో బంతికి బౌల్డవడంతో సెంచరీ చేజారింది.
కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) తెవాతియా (బి) స్టోక్స్‌ 46; మన్‌దీప్‌ సింగ్‌ (సి) స్టోక్స్‌ (బి) ఆర్చర్‌ 0; గేల్‌ (బి) ఆర్చర్‌ 99; పూరన్‌ (సి) తెవాతియా (బి) స్టోక్స్‌ 22; మాక్స్‌వెల్‌ నాటౌట్‌ 6; హుడా నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం: (20 ఓవర్లలో 4 వికెట్లకు) 185; వికెట్ల పతనం: 1-1, 2-121, 3-162, 4-184; బౌలింగ్‌: ఆర్చర్‌ 4-0-26-2; వరుణ్‌ 4-0-47-0; కార్తీక్‌ త్యాగి 4-0-47-0; గోపాల్‌ 1-0-10-0; స్టోక్స్‌ 4-0-32-2; తెవాతియా 3-0-22-0
రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌: ఉతప్ప (సి) పూరన్‌ (బి) మురుగన్‌ 30; స్టోక్స్‌ (సి) హుడా (బి) జోర్డాన్‌ 50; శాంసన్‌ రనౌట్‌ 48; స్మిత్‌ నాటౌట్‌ 31; బట్లర్‌ నాటౌట్‌ 22; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం: (17.3 ఓవర్లలో 3 వికెట్లకు) 186; వికెట్ల పతనం: 1-60, 2-111, 3-145; బౌలింగ్‌: ఆర్ష్‌దీప్‌ 3-0-34-0; షమి 3-0-36-0; మురుగన్‌ అశ్విన్‌ 4-0-43-1; జోర్డాన్‌ 3.3-0-44-1; రవి బిష్ణోయ్‌ 4-0-27-0


1000
టీ20ల్లో 1000 సిక్స్‌లు కొట్టిన ఏకైక ఆటగాడిగా గేల్‌ రికార్డు సృష్టించాడు.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.