ఆడలేక.. ఉండలేక
close

తాజా వార్తలు

Updated : 29/04/2021 13:33 IST

ఆడలేక.. ఉండలేక

ఐపీఎల్‌ నుంచి వైదొలిగిన అశ్విన్‌, టై, జంపా, రిచర్డ్‌సన్‌

అహ్మదాబాద్‌: భారత్‌లో రెండో దశలో విజృంభిస్తున్న కరోనా.. ఐపీఎల్‌నూ దెబ్బ కొడుతోంది. రోజురోజుకూ హద్దులు లేకుండా విస్తరిస్తున్న మహమ్మారి ఆటగాళ్లలో ఆందోళనకు కారణమవుతోంది. కరోనా భయంతో కొందరు, ఈ సంక్షోభ పరిస్థితుల్లో కుటుంబానికి తోడుగా ఉండాలని మరి కొందరు లీగ్‌కు దూరం అవుతున్నారు. సోమవారం ఒక్క రోజే నలుగురు క్రికెటర్లు లీగ్‌ నుంచి వైదొలిగారు. తన కుటుంబ సభ్యుల్లో కొందరు కరోనాతో పోరాడుతున్న నేపథ్యంలో వారికి అండగా నిలిచేందుకు తాను ఐపీఎల్‌ నుంచి విరామం తీసుకుంటున్నట్లు దిల్లీ క్యాపిటల్స్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ప్రకటించాడు. దీంతో ఈ సీజన్‌లో జోరు మీదున్న ఆ జట్టుకు ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఆదివారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో సూపర్‌ ఓవర్లో ఆ జట్టు విజయం తర్వాత అతను ఈ నిర్ణయాన్ని వెల్లడించాడు. ‘‘ఈ ఏడాది ఐపీఎల్‌ నుంచి విరామం తీసుకుంటున్నా. నా కుటుంబం, సన్నిహితులు కరోనాతో పోరాటం చేస్తున్నారు. ఈ కఠిన సమయంలో వాళ్లకు అండగా ఉండాలని భావిస్తున్నా. పరిస్థితులు మెరుగైతే తిరిగి లీగ్‌లో ఆడతానని అనుకుంటున్నా. దిల్లీ క్యాపిటల్స్‌కు ధన్యవాదాలు’’ అని అర్ధరాత్రి దాటిన తర్వాత ట్వీట్‌ చేశాడు. భారత్‌లో రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదవుతుండడంతో ఇక్కడి నుంచి తమ దేశాలకు వచ్చే విమానాలపై విదేశాలు ఆంక్షలు విధిస్తుండటంతో ఆస్ట్రేలియా ఆటగాళు కొందరు స్వదేశానికి బయల్దేరారు. రాజస్థాన్‌ రాయల్స్‌ పేసర్‌ ఆండ్రూ టై, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు బౌలర్లు ఆడమ్‌ జంపా, కేన్‌ రిచర్డ్‌సన్‌ లీగ్‌ నుంచి తప్పుకున్నారు. కరోనా బయో బబుల్‌ భయాలతో టోర్నీ ఆరంభానికి ముందే మిచెల్‌ మార్ష్‌ (సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌) ఐపీఎల్‌-14 నుంచి తప్పుకోగా.. లివింగ్‌స్టోన్‌ (రాజస్థాన్‌ రాయల్స్‌) లీగ్‌ ఆరంభమైన కొన్ని రోజులకు స్వదేశానికి వెళ్లిపోయాడు. అయితే ముంబయి ఇండియన్స్‌లో భాగమైన మరో ఆసీస్‌ పేసర్‌ కౌల్టర్‌నైల్‌ మాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో స్వదేశానికి ప్రయాణించడం కంటే ఐపీఎల్‌ బుడగలో ఉండడమే సురక్షితమని అభిప్రాయపడ్డాడు. వార్నర్‌, మ్యాక్స్‌వెల్‌, కమిన్స్‌, స్మిత్‌ లాంటి ఆస్ట్రేలియా స్టార్లు ఈ లీగ్‌లో ఆడుతున్న సంగతి తెలిసిందే.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని