close
ఆడలేక..ఐపీఎల్‌!

‘‘ఐపీఎల్‌లో ఆడొద్దని చెప్పినా రబాడ వినలేదు. ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని ఐపీఎల్‌ సగం ముగిసిన తర్వాతైనా వెనుదిరగాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రబాడతో పాటు మరికొందరికి ఇలాగే చెప్పాం’’ ప్రపంచకప్‌లో రబాడ వైఫల్యంపై అడిగిన ప్రశ్నకు దక్షిణాఫ్రికా సారథి డుప్లెసిస్‌ సమాధానమిది! ఇంతకుముందు స్టెయిన్‌ గాయానికి కూడా ఐపీఎలే కారణమన్నది అతడి వాదన. ప్రతిష్టాత్మక టోర్నీలో దక్షిణాఫ్రికా వైఫల్యానికి పరోక్షంగా ఐపీఎల్‌ కారణమంటూ డుప్లెసిస్‌చెప్పకనే చెప్పేశాడు! డుప్లెసిస్‌ వాదన సరైందేనా? దక్షిణాఫ్రికా వైఫల్యానికి ఐపీఎల్‌ కారణమని అనుకోవచ్చా?

ఈనాడు క్రీడావిభాగం

పీఎల్‌లో ఆడిన వాళ్లలో భారత్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌, అఫ్గానిస్థాన్‌ ఆటగాళ్లే ఎక్కువ. డుప్లెసిస్‌ విశ్లేషణ ప్రకారం ఐపీఎల్‌లో ఆడిన దేశాలన్నీ ప్రపంచకప్‌లో వెనుకంజలో ఉండాలి! అందులో టీమ్‌ఇండియా ముందువరుసలో ఉండాలి. ప్రస్తుత జట్టులోని ప్రతి ఆటగాడు ఐపీఎల్‌లో ఆడటమే ఇందుకు కారణం. ప్రపంచకప్‌లో బరిలో ఉన్న అన్ని జట్లతో పోల్చుకుంటే ఐపీఎల్‌లో మొదటి మ్యాచ్‌ నుంచి చివరి పోరు వరకు ఆడిన ఆటగాళ్లలో అత్యధికులు టీమ్‌ఇండియా క్రికెటర్లే. దాదాపు రెండు నెలలు ఐపీఎల్‌లో ఆడి నేరుగా ఇంగ్లాండ్‌ విమానమెక్కారు. మధ్యలో ఎలాంటి టోర్నీలు ఆడలేదు. వన్డే మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లేనేలేదు. దాదాపు మూడు నెలల విరామం తర్వాత భారత ఆటగాళ్లు నేరుగా ప్రపంచకప్‌లో వన్డే మ్యాచ్‌ ఆడారు! అయినా టీమ్‌ఇండియా సత్తాచాటుతోంది. వరుసగా 4 విజయాలతో అజేయ జట్టుగా కొనసాగుతుంది. అన్ని రంగాల్లోనూ ఆధిపత్యం కనబరుస్తూ ఫేవరెట్‌గా మారింది. ఇంగ్లాండ్‌ (స్టోక్స్‌, బెయిర్‌స్టో, ఆర్చర్‌, బట్లర్‌, మొయీన్‌ అలీ).. కివీస్‌ (విలియమ్సన్‌, గప్తిల్‌, మన్రో, సౌథి, బౌల్ట్‌, గ్రాండ్‌హోమ్‌, ఫెర్గూసన్‌, శాంట్నర్‌).. ఆసీస్‌ (స్మిత్‌, వార్నర్‌, స్టాయినిస్‌, బెరెండార్ఫ్‌)లు సైతం సత్తాచాటుతున్నాయి. భారత్‌ తర్వాత ఐపీఎల్‌లో అత్యధికంగా కివీస్‌ ఆటగాళ్లే ఆడారు. కెప్టెన్‌, ప్రధాన బ్యాట్స్‌మెన్‌, బౌలర్లతో సహా 8 మంది ఐపీఎల్‌ ముగిసే వరకు అందుబాటులో ఉన్నారు. అయినా ప్రపంచకప్‌లో కివీస్‌ అన్ని మ్యాచ్‌ల్లో గెలిచి అగ్రస్థానంలో ఉంది. ఇక బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంలో ఏడాది పాటు నిషేధానికి గురైన స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌లు క్రికెట్లో పునరాగమనం చేసింది ఐపీఎల్‌తోనే. అక్కడ మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లభిస్తుందని క్రికెట్‌ ఆస్ట్రేలియా సైతం వార్నర్‌, స్మిత్‌లను ప్రోత్సహించింది. అందుకు తగ్గట్లే వార్నర్‌, స్మిత్‌లు రాణించి ప్రపంచకప్‌కు ముందు ఫామ్‌ దొరకబుచ్చుకున్నారు. ఇప్పుడు ప్రపంచకప్‌లో ఆసీస్‌కు వార్నర్‌, స్మిత్‌లే కీలకమయ్యారు. మెగా టోర్నీకి ముందు ఫామ్‌ను అందుకోవడానికి మ్యాచ్‌ ప్రాక్టీస్‌ కోసం ఐపీఎల్‌ను ఇంగ్లాండ్‌, కివీస్‌, ఆసీస్‌లు వేదికగా ఎంచుకోగా.. ఆ టోర్నీ దక్షిణాఫ్రికాకు నష్టం చేసిందని తేల్చడం డుప్లెసిస్‌కే చెల్లు! అదీ చెన్నై తరఫున ఫైనల్‌ వరకు ఆడిన ఆటగాడు  అనడం మరీ విడ్డూరం!

‘‘2015 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ నిరాశాజనక ప్రదర్శన చేసింది. కానీ ఆ నిరాశను జట్టును పునర్‌నిర్మాణానికి ఉపయోగించుకుంది. ఇంగ్లాండ్‌ ఇప్పుడు నిర్భయంగా ఆడుతోంది. ఇంగ్లాండ్‌ను ఆదర్శంగా తీసుకుని  దక్షిణాఫ్రికా మెరుగైన జట్టును నిర్మించుకోవాలి’’
- జాక్‌ కలిస్‌, దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు

ప్రపంచ క్రికెట్లో ఎంతో గౌరవం, అభిమానం కలిగిన దక్షిణాఫ్రికా.. ప్రపంచకప్‌లో వైఫల్యానికి సాకులు వెతుక్కోవడం సఫారీ అభిమానులకే రుచించకపోవచ్చు! అసలు దక్షిణాఫ్రికా ప్రపంచకప్‌ ప్రణాళికే సరిగ్గా లేదన్న విమర్శలు లేకపోలేదు. ఆటగాళ్లతో క్రికెట్‌ బోర్డు వ్యవహారాలు సరిగా లేవు. ప్రపంచకప్‌కు ముందు స్టార్‌ బ్యాట్స్‌మన్‌ డివిలియర్స్‌తో ఆ దేశ బోర్డుకు పొసగలేదు. ఇప్పటికీ ఏ జట్టైనా కళ్లకద్దుకుని తీసుకునే డివిలియర్స్‌.. బోర్డుతో మనస్పర్థలతో నిరుడు మే నెలలో రిటైర్మెంట్‌ ప్రకటించాడు. డివిలియర్స్‌ లాంటి ఆటగాడిని ప్రపంచకప్‌కు ఏడాది ముందు ఏ జట్టు వదులుకోదు. కానీ దక్షిణాఫ్రికా బోర్డు మాత్రం అతడిని ఆపే ప్రయత్నం చేయలేదు. ఆఖర్లో మనసు మార్చుకుని డివిలియర్స్‌ తిరిగొస్తానన్నప్పుడు బెట్టు వీడి.. అతడిని తీసుకునివుంటే దక్షిణాఫ్రికాకు మేలు జరిగేదేమో..! అతడికి మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లేదనే పరిస్థితీ లేదు. ఐపీఎల్‌లో అతడు సత్తా చాటాడు. ఒక కీలక ఆటగాడు దూరమైతే జట్టు పరిస్థితి ఏమవుతుందనడానికి దక్షిణాఫ్రికానే నిదర్శనం. ఆ జట్టు బ్యాటింగ్‌లో సమతూకం దెబ్బతింది. కష్టకాలంలో ఆదుకునే ఆపద్భాంధవుడు లేడు. జట్టులో స్ఫూర్తి నింపాల్సిన నాయకుడు డుప్లెసిస్‌ మూడు మ్యాచ్‌లకే కాడి ఎత్తేశాడు. వర్షార్పణమైన వెస్టిండీస్‌తో మ్యాచ్‌ను కుదించి కొనసాగించడం కంటే.. రద్దుచేసి చెరో పాయింటు ఇవ్వడమే మంచిదనడం డుప్లెసిస్‌ అసమర్థతకు నిదర్శనం. ఇప్పుడు ఐపీఎల్‌పైనా నిందలు వేస్తుండటం అతడిలో నిజాయితీ లేమిని సూచిస్తోంది.

ఇక జట్టు వైఫల్యానికి బౌలర్లే బాధ్యులంటున్న డుప్లెసిస్‌.. బ్యాట్స్‌మెన్‌ ప్రదర్శనపైనా దృష్టిసారిస్తే మంచిదేమో. ఇప్పటిదాకా దక్షిణాఫ్రికా ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఒక్క సెంచరీ కూడా నమోదవలేదు. డికాక్‌ (238), డుసెన్‌ (216), డుప్లెసిస్‌ (191), మిల్లర్‌ (136), ఆమ్లా (123), మర్క్‌రామ్‌ (106) ఘోరంగా విఫలమయ్యారు. ఓపెనర్‌ నుంచి మిడిల్డార్‌ వరకు జట్టు బాధ్యతను భుజాన వేసుకునే ఆటగాడు ఒక్కడు లేడు. 7 మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా 300 పైచిలుకు స్కోరు చేసింది ఒక్కసారే. ఆ మ్యాచ్‌లోనూ బంగ్లాదేశ్‌ (330/6) చేతిలో దక్షిణాఫ్రికా (309/8)ది ఓటమే. ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌లపై దక్షిణాఫ్రికా వరుసగా 207, 241, 259 పరుగులే చేయగలిగింది. ప్రపంచకప్‌ వంటి ప్రతిష్టాత్మక టోర్నీలో ఇంత తక్కువ స్కోర్లతో విజయాలు సాధిస్తామని.. బౌలర్లు కాపాడతారని అనుకోవడం డుప్లెసిస్‌ తెలివితక్కువ తనమే! కెరీర్‌ చరమాంకంలో ఉన్న డుప్లెసిస్‌ (34 ఏళ్లు), ఆమ్లా (36), డుమిని (35)లపై బ్యాటింగ్‌ భారాన్ని మోపిన దక్షిణాఫ్రికా బోర్డుది సరిదిద్దుకోలేని పొరపాటే!

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.