close
తొలి అడుగులో తడబడి

ఆరంభ మ్యాచ్‌లో టైటాన్స్‌ ఓటమి
బోణీ కొట్టిన యు ముంబా, బెంగళూరు

ఆటగాళ్లు మారినా.. కొత్త కెప్టెన్‌, కోచ్‌ వచ్చినా..  తెలుగు టైటాన్స్‌ ఆటతీరు మారలేదు. ఎన్నో అంచనాలతో బరిలో దిగిన ఆ జట్టు ప్రొ కబడ్డీ లీగ్‌ తొలి మ్యాచ్‌లో పరాజయం పాలైంది.. సొంత అభిమానుల నడుమ అన్ని విభాగాల్లోనూ విఫలమై యు ముంబా చేతిలో ఓటమి మూటగట్టుకుంది. మరోవైపు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ బెంగళూరు బుల్స్‌ బోణీ కొట్టింది. గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ ముఖ్య అతిథిగా హాజరై లీగ్‌ను ఆరంభించారు.

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌

సొంత అభిమానుల నడుమ.. పీకేఎల్‌ ఏడో సీజన్‌ను తెలుగు టైటాన్స్‌ ఓటమితో మొదలెట్టింది. శనివారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ 25-31 తేడాతో యు ముంబా చేతిలో ఓడింది. గత సీజన్‌లో అద్భుత ప్రదర్శనతో సత్తాచాటి ఈ సారి టైటాన్స్‌ తరపున బరిలో దిగి ఆశలు రేపిన సిద్ధార్థ్‌ దేశాయ్‌ పూర్తిగా నిరాశపరిచాడు. 14 సార్లు రైడింగ్‌కు వెళ్లిన అతను కేవలం ఐదు పాయింట్లు మాత్రమే సాధించాడు. సిద్ధార్థ్‌ను కట్టడి చేయడమే లక్ష్యంగా కోర్టులో అడుగుపెట్టిన ముంబా విజయవంతమైంది. అతను 33వ నిమిషంలో తన తొలి పాయింటు సాధించాడంటే అతణ్ని ముంబా ఏ స్థాయిలో కట్టడి చేసిందో అర్థమౌతుంది. మ్యాచ్‌ ఆరంభంలో రెండు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. టైటాన్స్‌ తరపున రజ్నీశ్‌ (8), ముంబా జట్టులో అతుల్‌ పాయింట్లు తెచ్చి తమ జట్ల ఖాతా తెరిచారు. తొలి ఐదు నిమిషాలు ముగిసే సరికి స్కోరు 3-3తో సమంగా ఉండడంతో పోరు ఉత్కంఠగా సాగుతుందనిపించింది. టైటాన్స్‌ కంటే మెరుగైన ఆటతీరు ప్రదర్శించిన ముంబా పదో నిమిషంలో 8-5తో ఆధిక్యం సంపాదించింది. మరో మూడు నిమిషాలకే టైటాన్స్‌ను ఆలౌట్‌ను చేసి 12-6తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కెప్టెన్‌ ఫజల్‌ (4) నేతృత్వంలోని డిఫెన్స్‌ బృందం బలంగా ఉండడంతో టైటాన్స్‌ ఆటగాళ్లు ఒత్తిడికి లోనయ్యారు. వరుసగా పాయింట్లు కోల్పోయారు. తొలి అర్ధభాగం ముగిసే సరికి 10-17తో టైటాన్స్‌ వెనకబడింది. విరామం తర్వాత కూడా అదే ఆటతీరు ప్రదర్శించిన టైటాన్స్‌ 26వ నిమిషంలో మరోసారి ఆలౌటై 13-24తో ఓటమి దిశగా సాగింది. అభిషేక్‌ సింగ్‌ (10) రెండు పాయింట్లు తేవడంతో మరో మూడు నిమిషాల ఆట మిగిలి ఉందనగా 30-19తో ముంబా ఆధిక్యంలోకి దూసుకెళ్లడంతో టైటాన్స్‌ పరాజయం ఖాయమైంది. ఐతే చివర్లో టైటాన్స్‌ పుంజుకొని వరుసగా పాయింట్లు రాబట్టినా అప్పటికే ఆలస్యమైంది. టైటాన్స్‌ చివరి నిమిషంలో ముంబాను ఆలౌట్‌ చేసేలా కనిపించింది.  తెలివిగా ఆడిన ముంబా ఎలాంటి అవకాశం ఇవ్వలేదు.

బుల్స్‌ జోరు: పట్నా పైరేట్స్‌, బెంగళూరు బుల్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ మజాను అందించింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో బెంగళూరు 34-32తో పట్నా పైరేట్స్‌ను ఓడించింది. బెంగళూరు తరపున రైడింగ్‌లో పవన్‌ షెరావత్‌ (9), ట్యాకింగ్‌లో అమిత్‌ షెరోన్‌ (5) సత్తాచాటారు. పట్నా జట్టులో పర్దీప్‌ నర్వాల్‌ (10), మహమ్మద్‌ ఇస్మాయిల్‌ (9) మెరిశారు. మ్యాచ్‌ ఆరంభంలో 5-1తో ఆధిక్యం సాధించిన బెంగళూరు ఆధిపత్యం చలాయించింది. త్వరగానే పుంజుకొన్న పైరేట్స్‌ 17-13తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఓ దశలో 22-16తో ఆ జట్టు గెలిచేలా కనిపించింది. కానీ పవన్‌ మాయ చేసి తన జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. చివరి రెండు నిమిషాల ఆట ఉందనగా బెంగళూరు 34-31తో నిలిచింది. అదే ఊపులో మ్యాచ్‌ సొంతం చేసుకుంది.

ప్రొ కబడ్డీలో ఈనాడు
బెంగళూరు × గుజరాత్‌
(రా.7:30 నుంచి)
టైటాన్స్‌ × తలైవాస్‌
(రా.8:30 నుంచి)

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.