close
కాల నాగుకు పాలు పోసిన దాదా!

విషం చిమ్ముతుందన్నా వినిపించుకోని వైనం!

‘గంగూలీ-ఛాపెల్‌’ వివాదం భవిష్యత్తు తరాలకు ఓ గుణపాఠం

దిగ్గజాలతో ముందుకు సాగుతున్న టీమిండియాను మ్యాచ్‌ ఫిక్సింగ్‌ అనే ఓ రాకాసి ఉప్పెన ఒక్కసారిగా కబళించింది. అప్పటి వరకు సంపాదించిన కీర్తి ప్రతిష్ఠలకు కళంకం కలిగించింది.

చెల్లాచెదురైన ఆటగాళ్లు. నిద్రపట్టని రాత్రులు. తలెత్తుకొని బయట తిరగలేని స్థితి. ఎలా..?ఎలా..?మళ్లీ జట్టును గాడిన పెట్టడం ఎలా? లోపించిన ఆత్మవిశ్వాసాన్ని పునరుద్ధరించేదెలా?భారత క్రికెట్‌కు ఒక దశ దిశ చూపేదెలా? అప్పుడే వచ్చాడు దాదా. తడబడి బుడిబుడి నడకలు ఆరంభించిన జట్టును బెంగాల్‌ టైగర్‌లా పరుగులు పెట్టించాడు. చరిత్రలో అత్యంత విజయవంతమైన నాయకుడిగా ఎదిగాడు.

 కాలచక్రం గిర్రున తిరిగింది. ఎందరు చెప్పినా వినిపించుకోలేదు. తన స్థానం సుస్థిరం చేస్తుందని ఓ కాలనాగును తెచ్చిపెట్టుకున్నాడు. ముందుకు నడిపించే బదులు తనపైనే విషం చిమ్ముతుందని గ్రహించలేకపోయాడు. మర్చిపోలేని వివాదంలో చివరికి ఓ పాత్రధారిగా మిగిలాడు. భవిష్యత్‌ తరాలకు పాఠంగా మారాడు. 2005లో దక్షిణాఫ్రికా పర్యటనలో దాదా-ఛాపెల్‌ మధ్య అసలేం జరిగింది!!


వద్దన్నా విన్లేదు

భారత జట్టు పునరుజ్జీవ దశలో దొరికిన అద్భుతమైన కోచ్‌ జాన్‌రైట్‌. 2005లో వ్యక్తిగత కారణాలతో ఒప్పందాన్ని పునరుద్ధరించుకొనేందుకు ఆయన ఆసక్తి చూపించలేదు. ఓ మంచి కోచ్‌ కోసం వేట మొదలైంది. జిమ్మీ అమర్‌నాథ్‌, టామ్‌ మూడీ, డేవ్‌ వాట్‌మోర్‌ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. హఠాత్తుగా సారథి గంగూలీ ఆసీస్‌ మాజీ సారథి గ్రెగ్‌ ఛాపెల్‌ పేరు ప్రతిపాదించాడు. 2003-04 ఆసీస్‌ పర్యటనలో దాదా అతడి సలహాలు స్వీకరించాడు. అతడి క్రికెట్‌ అవగాహన, పరిజ్ఞానానికి ముగ్ధుడయ్యాడు. భారత క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్తాడని భావించాడు. సునిల్‌ గావస్కర్‌, జగ్‌మోహన్‌ దాల్మియా వంటి ప్రముఖులు అతడొద్దని దాదాకు సలహాలిచ్చారు. స్వయంగా గ్రెగ్‌ ఛాపెల్‌ సోదరుడు ఇయాన్‌ సైతం అతడి ఎంపికపై పెదవి విరిచాడు. అన్నీ తన నియంత్రణలోనే ఉండాలన్న తత్వం, వ్యవహార శైలి భారత డ్రస్సింగ్‌ రూమ్‌కు సరిపోవని చెప్పారు. మానవ వనరుల నిర్వహణలో గ్రెగ్‌కు అనుభవం అంత బాగాలేదని సన్నీ గట్టిగా చెప్పాడు. కానీ గంగూలీ అవేవీ వినిపించుకోలేదు. చివరికి 2005, మేలో గ్రెగ్‌ టీమిండియా కోచ్‌గా ఎంపికయ్యాడు.


ఆసీస్‌ పద్ధతి

ఛాపెల్‌ నేతృత్వంలో టీమిండియా తొలిసారి శ్రీలంకలో పర్యటించింది. అంతకుముందు సిరీస్‌లో స్లో ఓవర్‌రేట్‌ కారణంగా గంగూలీపై ఐసీసీ 6 మ్యాచుల నిషేధం విధించింది. దాంతో ద్రవిడ్‌ సారథ్యం వహించాడు. ఆ తర్వాత జింబాబ్వే పర్యటనకు వెళ్లారు. అప్పటికే దాదా రెండేళ్లుగా టెస్టుల్లో శతకం చేయలేదు. ఫామ్‌లో లేడు. సన్నాహక మ్యాచ్‌కు ముందు సారథ్యాన్ని వదిలేసి ఆటపై దృష్టి సారిస్తే ఫామ్‌లోకి వస్తావని ఛాపెల్‌ అతడిని చెప్పాడు. తొలి టెస్టులో ఆసీస్‌ పద్ధతిలో అత్యుత్తమ 11 మందినే ఆడించాలని భావించిన ఛాపెల్‌, దాదాను పక్కనపెట్టాడు. తన సారథ్యానికి ముప్పు తెస్తున్నాడని భావించిన అతడు అర్ధాంతరంగా సిరీస్‌ నుంచి తప్పుకొని భారత్‌కు వచ్చేశాడు. ఆ టెస్టుకు నాయకత్వం వహించిన ద్రవిడ్‌ శతకం చేయడం గమనార్హం.


దాదాకు అవమానం

ఆ టెస్టు తర్వాత తనను కెప్టెన్సీ వదిలేయాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారని గంగూలీ మీడియా సమావేశంలో వెల్లడించాడు. అప్పుడు అందరి వేళ్లూ ఛాపెల్‌ మీదికి మళ్లడంతో తాను ఎవరిపైనా ఒత్తిడి చేయలేదని చెప్పాడు. గంగూలీలో ప్రేరణ నింపాలనే వ్యక్తిగతంగా మాట్లాడానని వెల్లడించాడు. ‘గంగూలీ సారథ్యం కోసం అర్రులు చాస్తున్నాడు. మానసికంగా, శారీరకంగా జట్టును నడిపించేందుకు అతడు అనర్హుడు. అతడిది ప్రతికూల స్వభావం. కఠిన పరిస్థితుల నుంచి తప్పించుకొనేందుకు గాయాలని సాకుగా చెబుతాడు. ఇది 2007 ప్రపంచకప్‌ అవకాశాలపై వ్యతిరేక ప్రభావం చూపిస్తుంది. అతడిపై ఆటగాళ్లు విశ్వాసం కోల్పోయారు’ అని ఛాపెల్‌ బీసీసీఐకి పంపించిన ఈమెయిల్‌ అదే సమయంలో లీక్‌ అవ్వడంతో అతిపెద్ద వివాదం చెలరేగింది. దక్షిణాఫ్రికాతో కోల్‌కతా మ్యాచ్‌కు ముందు ప్రకంపనలు రేపింది.


చేదు అనుభవం

2005 అక్టోబర్‌లో 7 వన్డేల శ్రీలంక సిరీస్‌కు గాయం కారణంగా దాదాను ఎంపిక చేయలేదు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా సిరీస్‌కూ పక్కనపెట్టారు. ఇది అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. ఈడెన్‌లో సఫారీలతో మ్యాచ్‌కు ముందు రోజు సాధన ముగించుకొని టీమిండియా సభ్యులు హోటల్‌కు బయల్దేరారు. జట్టు బస్సు వద్ద దాదా అభిమానులు వందల సంఖ్యలో గుమిగూడి ‘ఛాపెల్‌ దిగిపోవాలి’ అంటూ నినాదాలు చేశారు. అదే సమయంలో బస్సెక్కిన ఛాపెల్‌ ఆవేశంతో అభిమానులకు మధ్యవేలిని చూపించాడు. అతడి చేష్టలు దేశవ్యాప్తంగా ఆందోళనకు దారితీశాయి. దాదాకు అండగా నిలిచిన అభిమానులు ఛాపెల్‌ దిష్టిబొమ్మల్ని దగ్ధం చేశారు. ఈ వివాదం పార్లమెంటుకూ పాకింది.


అందరికీ గుణపాఠం

తర్వాత రోజు ఈడెన్‌లో 90వేల మంది అభిమానులు ద్రవిడ్‌, అతడి జట్టును కవ్వించారు. ఛాపెల్‌కు సహకరించొద్దని నినదించారు. చాఫెల్‌ వ్యవహారంపై బీసీసీఐ అధికారికంగా వివరణ ఇచ్చింది. అతడి వేలుకు గాయమైందని కావాలని మధ్యవేలు చూపించలేదని తెలిపింది. అయినప్పటికీ ఈ వివాదం అప్పటితో సద్దుమణగలేదు. ఆ తర్వాత జరిగిన శ్రీలంక సిరీస్‌కు దాదా ఎంపికయ్యాడు. రాణించాడు. కొన్నిసార్లు సిరీస్‌కు ఎంపిక చేసి తుది జట్టులో చోటివ్వలేదు. ఇలాంటి అవమానాల మధ్యే 2007 ప్రపంచకప్‌ వచ్చేసింది. అందులో టీమిండియా ఘోర ప్రదర్శన తెలిసిందే. ఛాపెల్‌ నిష్ర్కమించాడు. దాదా టెస్టుల్లో నిలకడగా రాణించి చక్కని ఫామ్‌లో ఉండగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటించాడు. భారత క్రికెట్‌ చరిత్రలో ఎన్నో వివాదాలు ఉన్నాయి. ‘ఛాపెల్‌-గంగూలీ’ వివాదం మాత్రం భవిష్యత్‌ తరాలకు ఓ గుణపాఠంగా నిలిచింది.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.