close
పుణేలోనే తేల్చేస్తారా..!

సిరీస్‌పై భారత్‌ కన్ను
దక్షిణాఫ్రికాతో రెండో టెస్ట్‌ నేటి నుంచే
ఉ।।9.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో

సూపర్‌ ఫామ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్‌. తిప్పేస్తున స్పిన్నర్లు.. చెలరేగుతున్న పేసర్లు. ఇలా టీమ్‌ఇండియాకు అన్నీ సానుకూలతలే. విశాఖలో విజయంతో ఉత్సాహం ఉరకలేస్తుంటే.. కోహ్లీసేన రెట్టించిన విశ్వాసంతో సఫారీలతో మరో సమరానికి సిద్ధమైపోయింది. నేటి నుంచే రెండో టెస్ట్‌. తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ సిరీస్‌ చేజిక్కించుకోవాలని భారత్‌ తహతహలాడుతుంటే.. ఆశలను సజీవంగా ఉంచుకోవాలనే పట్టుదలతో దక్షిణాఫ్రికా ఉంది. చూద్దాం.. ఎవరిది పైచేయి అవుతుందో!

పుణె

భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య మరో సమరానికి రంగం సిద్ధమైంది. గురువారం నుంచే రెండో టెస్ట్‌. మరింత సాధికారితను ప్రదర్శించాలని కోహ్లీసేన అనుకుంటోంది. తొలి టెస్టులో 203 పరుగుల తేడాతో గెలిచిన భారత్‌కు పెద్దగా ఇబ్బందులేమీ లేవు. పుణెలోనూ అదే జోరును కొనసాగించాలనుకుంటోంది. రోహిత్‌ను ఓపెనర్‌గా పంపించాలన్న ఎత్తుగడ విజయవంతం కావడం టీమ్‌ఇండియాకు పెద్ద సానుకూలాంశం. విశాఖలో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ రోహిత్‌ శతకాలు బాదిన సంగతి తెలిసిందే. మరో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ కూడా అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. అతడు డబుల్‌ సెంచరీతో మంచి ఫామ్‌లో ఉన్న నేపథ్యంలో భారత్‌ ఓపెనింగ్‌ సమస్యలకు తాత్కాలికంగానైనా తెరపడినట్లే. పుజారా, కోహ్లి, రహానె, హనుమ విహారితో భారత జట్టు బ్యాటింగ్‌ బలంగా కనిపిస్తోంది. పుణె స్టేడియంలో వీళ్లూ సత్తా చాటితే భారత్‌కు తిరుగుండదు. ఇక బంతితో సఫారీలను మరోసారి తిప్పేయడానికి స్పిన్‌ ద్వయం, జడేజా  సిద్ధమవుతున్నారు. షమి, ఇషాంత్‌లతో పేస్‌ విభాగం పదునుగా కనిపిస్తోంది. కొత్త బంతితో, పాత బంతితో పొడి పిచ్‌లపై బౌలింగ్‌ చేయడంలో ఆరితేరుతున్న షమి తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించిన సంగతి తెలిసిందే. బుమ్రా లేని లోటును అతడు తెలియనివ్వలేదు. పిచ్‌పై పచ్చిక ఉన్న నేపథ్యంలో షమి మరింత కీలకం కానున్నాడు. ఈ మ్యాచ్‌కు భారత తుది జట్టులో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం లేదు. అదే జట్టును కొనసాగించనుంది.

పిచ్‌ ఎలా ఉందంటే..

పిచ్‌పై పచ్చిక బాగానే ఉంది. తొలి రెండు మూడు రోజుల్లో పేస్‌ బౌలర్లకు మంచి సహకారం లభించవచ్చు. జల్లులు పడే అవకాశముంది.

ఆ ఓటమి తర్వాత..: 2013 ఆరంభం నుంచి సొంతగడ్డపై టెస్టుల్లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన భారత్‌.. ఆడిన 30 టెస్టుల్లో చవిచూసిన ఏకైక ఓటమి ఇదే వేదికలో కావడం గమనార్హం. 2017లో ఇక్కడ భారత్‌ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. స్పిన్‌కు విపరీతంగా సహకరించిన పిచ్‌పై ఒకీఫె మన బ్యాట్స్‌మెన్‌ను ముప్పు తిప్పలు పెట్టాడు. ఆ తర్వాత ఇక్కడ టెస్టు మ్యాచ్‌ జరగడం ఇదే తొలిసారి. ఆస్ట్రేలియా లాంటి ప్రదర్శన చేయడం దక్షిణాఫ్రికాకు కష్టమైన పనే. అలా చేయాలంటే ముందు 20 వికెట్లు పడగొట్టగలిగే బౌలింగ్‌ దళాన్ని ఆ జట్టు ఎంచుకోవాలి. తొలి టెస్టులో భారీగా పరుగులు సమర్పించుకున్న స్పిన్నర్లు డేన్‌ పీట్‌, సెనురాన్‌ ముత్తుస్వామిలలో ఒకరిని తుది జట్టు నుంచి తప్పించే అవకాశముంది. పీట్‌ స్థానంలో పేస్‌ బౌలర్‌ లుంగి ఎంగిడి జట్టులోకి రావొచ్చు. ఇక బ్యాటింగ్‌లో డికాక్‌, ఎల్గర్‌ల ఫామ్‌ దక్షిణాఫ్రికాకు గొప్ప సానుకూలాంశం. వీళ్లిద్దరు చక్కని పోరాటంతో తొలి టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు కుప్పకూలకుండా అడ్డుకున్న సంగతి తెలిసిందే. మార్‌క్రమ్‌, బవుమా, బ్రుయిన్‌ కూడా ఫామ్‌ను అందుకోవాలని దక్షిణాఫ్రికా ఆశిస్తోంది.

తుది జట్లు (అంచనా)

భారత్‌:  రోహిత్‌, మయాంక్‌ అగర్వాల్‌, పుజారా, కోహ్లి, రహానె, హనుమ విహారి, సాహా, అశ్విన్‌, జడేజా, ఇషాంత్‌, మహ్మద్‌ షమి.
దక్షిణాఫ్రికా: మార్‌క్రమ్‌, ఎల్గర్‌, డిబ్రుయిన్‌, బవుమా, డుప్లెసిస్‌, డికాక్‌, ముత్తుసామి, ఫిలాండర్‌, కేశవ్‌ మహారాజ్‌, రబాడ, ఎంగిడి.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.