జడ్డూ బదులు చాహల్‌: ఆసీస్‌ కోచ్‌ చిందులు
close

ప్రధానాంశాలు

Published : 05/12/2020 01:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జడ్డూ బదులు చాహల్‌: ఆసీస్‌ కోచ్‌ చిందులు

రిఫరీ డేవిడ్‌ బూన్‌పై జస్టిన్‌ లాంగర్‌ అసంతృప్తి

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆస్ట్రేలియా కోచ్‌ జస్టిన్‌ లాంగర్ తొలి టీ20 మ్యాచుకు రిఫరీగా వ్యవహరించిన డేవిడ్‌ బూన్‌పై ‌ఆగ్రహం వ్యక్తం చేశాడు. రవీంద్ర జడేజా స్థానంలో కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా యుజ్వేంద్ర చాహల్‌ను తీసుకోవడంపై అతడు అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆల్‌రౌండర్‌ జడ్డూ స్థానంలో స్పెషలిస్టు స్పిన్నర్‌ చాహల్‌ను ఎలా తీసుకుంటారని ప్రశ్నించాడు. లాంగర్‌ ఆవేశపడటం టీవీ తెరల్లో స్పష్టంగా కనిపించింది.

మనుక ఓవల్‌లో జరిగిన ఈ పోరులో టీమ్‌ఇండియా తొలుత 161/7 పరుగులు చేసింది. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (51) అర్ధశతకం సాధించాడు. సంజు శాంసన్‌ (23; 15 బంతుల్లో 1×4, 1×6) రాణించినా ధావన్‌, కోహ్లీ, మనీశ్‌ పాండే విఫలమవ్వడంతో 92/5తో కష్టాల్లో పడింది. ఈ స్థితిలో టెయిలెండర్ల అండతో రవీంద్ర జడేజా (44; 23 బంతుల్లో 5×4, 1×6) రెచ్చిపోయాడు. వరుస బౌండరీలు బాదేశాడు. అజేయంగా నిలిచి జట్టుకు కాపాడుకోగల స్కోరు అందించాడు.

మెరుపు బ్యాటింగ్‌ చేస్తున్న జడ్డూ తొడ కండరాలు పట్టేయడంతో ఇబ్బంది పడ్డా చక్కని షాట్లు ఆడాడు. అయితే మిచెల్‌ స్టార్క్‌ వేసిన ఆఖరి ఓవర్లో అతడి తలకి బంతి తాకింది. విరామం ముగిశాక హఠాత్తుగా  జడ్డూ బదులు కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా చాహల్‌ వచ్చాడు. ఆరోన్‌ ఫించ్‌, స్టీవ్‌స్మిత్‌, మాథ్యూవేడ్‌ వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. అయితే లాంగర్‌ రిఫరీపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కంకషన్‌ నిబంధనల ప్రకారం గాయపడ్డ వ్యక్తి తరహా ఆటగాడినే సబ్‌స్టిట్యూట్‌గా ఎంచుకోవాలన్న సంగతి తెలిసిందే. చాహల్‌ స్పెషలిస్టు స్పిన్నర్‌ కావడంతో ఆసీస్‌ కోచ్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

జడ్డూ కంకషన్‌పై విశ్లేషకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ‘కంకషన్‌ గాయం తనిఖీ చేసేందుకు ఫిజియో గానీ వైద్యుడు గానీ రాలేదు. ఆ తర్వాత జడ్డూ తన కాలికి ఏదో అయినట్టు ప్రవర్తించాడు. దాంతో కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ వచ్చాడు’ అని మైకేల్‌ వాన్‌ అన్నాడు. ‘జడ్డూ కంకషన్ ఎపిసోడ్‌‌ గురించి జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే లక్షణాలు ఆలస్యంగా (డిలేయ్‌డ్‌ కంకషన్‌) బయటపడొచ్చు. డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లాక ఇబ్బంది పడ్డాడేమో. ఈ రెండింట్లో ఏది జరిగిందో ఇంకా తెలియదు. బంతి తగిలినప్పుడు మాత్రం జడ్డూ బాగానే కనిపించాడు’ అని వ్యాఖ్యాత హర్షబోగ్లే ట్వీట్‌ చేయడం గమనార్హం.

ఇవీ చదవండి
టీమ్ఇండియా బోణీ కొట్టింది..
సరికొత్త ఫార్మాట్లో..ఐపీఎల్‌ 2021!

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన