close

ప్రధానాంశాలు

Published : 04/12/2020 01:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఇక మెరుపులే

ఆసీస్‌తో భారత్‌ తొలి టీ20 నేడు
మధ్యాహ్నం 1.40 నుంచి
కాన్‌బెరా

వన్డే పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలన్న కసి. రెట్టించిన విశ్వాసంతో టెస్టు సిరీస్‌లో అడుగుపెట్టాలన్న తపన. సొంతగడ్డపై జరిగే ప్రపంచకప్‌ (2021) కోసం జట్టును గాడిన పెట్టుకోవాల్సిన అవసరం. ఈ నేపథ్యంలో టీమ్‌ ఇండియా కీలక సమరానికి సిద్ధమైపోయింది. ఇక ధనాధన్‌ దంచుడే. వన్డే సిరీస్‌లో పైచేయి సాధించిన కంగారూలతో నేటి నుంచే టీ20 పోరు. రెండూ బలమైన జట్లే. మరి భారత్‌ పుంజుకుంటుందా? లేదా ఆసీస్‌ ఆధిపత్యం కొనసాగుతుందా? రసవత్తర పోరాటం ఖాయం.

భిమానులకు మరింత వినోదం. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగే తొలి మ్యాచ్‌లో భారత జట్టు శుక్రవారం ఆస్ట్రేలియాను ఢీకొంటుంది. 1-2తో సిరీస్‌ ఓటమి వన్డే ఫార్మాట్లో కోహ్లీసేన మెరుగుపడాల్సింది చాలా ఉందని చెబుతోంది. కానీ పొట్టి ఫార్మాట్లో మాత్రం ఆ జట్టు చాలా సమతూకంతో కనిపిస్తోంది. ఆత్మవిశ్వాసంతో టెస్టు సిరీస్‌లో అడుగుపెట్టాలనుకుంటున్న భారత్‌.. ఈ సిరీస్‌లో గెలవాలనే పట్టుదలతో ఉంది.

‘‘దేశానికి ఆడానంటే నమ్మలేకపోతున్నా. నాకు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ కృతజ్ఞతలు. మరిన్ని సవాళ్ల కోసం ఎదురుచూస్తున్నా’’

- నటరాజన్‌

నటరాజన్‌ అరంగేట్రం: కరోనా మహమ్మారి కారణంగా క్రీడా కార్యకలాపాలన్నీ నిలిచిపోవడానికి ముందు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్‌ను మట్టికరిపించడం భారత్‌ ఆత్మవిశ్వాసాన్నిచ్చేదే. వాషింగ్టన్‌ సుందర్‌, దీపక్‌ చాహర్‌, నటరాజన్‌లు ఉండడం పొట్టి క్రికెట్లో బౌలింగ్‌ విభాగానికి సమతూకాన్నిస్తోంది. ఐపీఎల్‌లో బెంగళూరు తరఫున రాణించిన సుందర్‌ ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. హార్దిక్‌ పాండ్య బౌలింగ్‌కు దూరంగా ఉంటున్న నేపథ్యంలో వన్డేల్లో జడేజా రూపంలో జట్టులో ఒక్క ఆల్‌రౌండర్‌ మాత్రమే ఉన్నాడు. అయితే టీ20ల్లో సుందర్‌ రెండు విభాగాల్లోనూ ఉపయోగపడతాడు. కానీ తొలి మ్యాచ్‌లో అతణ్ని తీసుకుంటారా లేదా స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మన్‌ మనీష్‌ పాండేను తీసుకుంటారా అన్నది ఆసక్తికరం. హార్దిక్‌ కూడా కొన్ని ఓవర్లు బౌలింగ్‌ చేసే అవకాశముంది. మూడో వన్డేలో ఆకట్టుకున్న యార్కర్‌ స్పెషలిస్ట్‌ నటరాజన్‌ శుక్రవారమే పొట్టి క్రికెట్లో అరంగేట్రం చేయనున్నాడు. అతడు బుమ్రా, దీపక్‌ చాహర్‌తో కలిసి పేస్‌ బౌలింగ్‌ భారాన్ని మోసే అవకాశముంది. ఇక వన్డేల్లో ఐదో స్థానంలో దిగిన కేఎల్‌ రాహుల్‌.. ఇప్పుడు శిఖర్‌  ధావన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభిస్తాడని భావిస్తున్నారు. ఈ వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌ న్యూజిలాండ్‌తో సిరీస్‌లో కూడా  ఓపెనింగ్‌ చేసిన సంగతి తెలిసిందే. కెప్టెన్‌ కోహ్లి ఫామ్‌ భారత్‌కు సానుకూలాంశమే. నంబర్‌-4 శ్రేయస్‌ పెద్ద ఇన్నింగ్స్‌ ఆడాలని జట్టు ఆశిస్తోంది.
ఆస్ట్రేలియాకు గాయాలు..: ఫామ్‌లో ఉన్న ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ గాయం కారణంగా దూరం కావడం ఎదురుదెబ్బే అయినా.. ఆస్ట్రేలియా ధీమాతో పోరుకు సిద్ధమైంది. కెప్టెన్‌ ఫించ్‌తో కలిసి మాథ్యూ వేడ్‌ ఇన్నింగ్స్‌ ఆరంభించే అవకాశముంది. స్టాయినిస్‌ కూడా ఓపెనింగ్‌కు మంచి ప్రత్యామ్నాయమే కానీ.. గాయంతో అతడు ఆడడం అనుమానంగా ఉంది. ప్యాట్‌ కమిన్స్‌ లేకున్నా.. ఆసీస్‌ బౌలింగ్‌ విభాగం బలంగానే ఉంది. చివరి వన్డేకు విశ్రాంతి తీసుకున్న పేస్‌ బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌ పునరాగమనం చేయనున్నాడు.

పిచ్‌.. వాతావరణం

మ్యాచ్‌ వేదిక మను ఓవల్‌ పిచ్‌పై పరుగుల వరద పారే అవకాశముంది. బీబీఎల్‌లో ఇక్కడ జట్టు భారీగా పరుగులు చేశాయి. ఆటకు ఎలాంటి వర్షం ముప్పు లేదు.

14

ఆస్ట్రేలియాపై 10 టీ20ల్లో బుమ్రా సాధించిన వికెట్లు. ఈ ఫార్మాట్లో కంగారూలపై అత్యంత విజయవంతమైన భారత బౌలర్‌ అతడే.


11-8

టీ20 క్రికెట్లో ఆస్ట్రేలియాపై భారత్‌ గెలుపోటముల రికార్డు ఇది. సొంతగడ్డపై ఆసీస్‌తో గత సిరీస్‌లో 0-2తో ఓడినా.. మొత్తంగా పొట్టి క్రికెట్లో టీమ్‌ ఇండియాదే పైచేయి.

584

ఆస్ట్రేలియాపై 16 టీ20ల్లో కోహ్లి సాధించిన పరుగులు. ఇందులో ఆరు అర్ధశతకాలు ఉన్నాయి. సగటు 64.88. ఆసీస్‌పై అత్యధిక టీ20 పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మన్‌ కోహ్లీనే. ఆస్ట్రేలియాలో 8 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 79.25 సగటుతో 317 పరుగులు సాధించాడు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన