close
ధరణి దస్త్రాలకే టైటిల్‌ గ్యారంటీ చట్టం!

జమాబందీ నిర్వహిస్తే మేలంటున్న నిపుణులు
రాష్ట్రంలోని భూ చట్టాలపైనా సమీక్ష చేయాలని సూచన
ఈనాడు - హైదరాబాద్‌

భూమి హక్కును గ్యారంటీ చేయడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరించబోతున్న విధానాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. టైటిల్‌ గ్యారంటీ వ్యవస్థను అమలు చేయాలంటే భూములపై పూర్తిస్థాయిలో స్పష్టత అవసరం కానుంది. దీనికోసం ప్రభుత్వం ఇప్పటికే భూ దస్త్రాల ప్రక్షాళన నిర్వహించి దస్త్రాలను ఆన్‌లైన్‌ చేసింది. ధరణి పోర్టల్‌కు కూడా అనుసంధానం చేసింది. మరో నాలుగున్నర లక్షల ఖాతాలకు స్పష్టత తేవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో స్పష్టత వచ్చిన భూముల వరకు తొలుత టైటిల్‌ గ్యారంటీ చట్టం పరిధిలోకి తీసుకొచ్చేందుకు కసరత్తులు చేస్తున్నట్లు తెలిసింది. మరోవైపు రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌ చట్టమే గాకుండా ఇనాం, అసైన్డ్‌, సర్ఫేకాస్‌ లాంటివి దాదాపు 120 వరకు భూ చట్టాలు ఉన్నాయి. వీటిని కూడా ఒకసారి సమీక్షిస్తే మేలన్న సూచనలు వినిపిస్తున్నాయి.

కొత్త చట్టంలో ఏ వ్యవస్థలు ఉంటాయి?
టైటిల్‌ గ్యారంటీ చట్టం అమల్లోకి వస్తే పలు వ్యవస్థలు ఏర్పాటు కానున్నాయి. ఇందులో టైటిల్‌ గ్యారంటీ అథారిటీ కీలకంగా ఉంటుంది. జిల్లాకు, రాష్ట్రానికి టైటిల్‌ గ్యారంటీ అథారిటీ ఏర్పాటు చేస్తారు. వివాదాల పర్యవేక్షణకు ఒక విభాగం ఉంటుంది. జిల్లాకు ఒక రెవెన్యూ కోర్టు కూడా ఏర్పాటు చేస్తారు. ఏదైనా బీమా సంస్థకు భూములకు బీమా చేసే బాధ్యతలు అప్పగిస్తారు. సర్వే రిజిస్ట్రేషన్స్‌, టైటిల్‌ రిజిస్ట్రేషన్స్‌ లాంటివన్నీ ఆన్‌లైన్‌ ద్వారా అందించే వీలు ఉంటుంది. టైటిల్‌ అథారిటీ మినహా మిగిలినవి ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు రెవెన్యూ వర్గాలు భావిస్తున్నాయి.

జమాబందీతో పలు సమస్యలు పరిష్కారం
2017లో నిర్వహించిన భూ దస్త్రాల ప్రక్షాళన కార్యక్రమంలో(ఎల్‌ఆర్‌యూపీ) కేవలం భూ దస్త్రాలను నవీకరించారు. రైతుల వద్ద ఉన్న భూ దస్త్రాలను రెవెన్యూ శాఖ వద్ద ఉన్న మాతృ దస్త్రాలతో పోల్చి సరిచూశారు. రైతులు సూచించిన మార్పులు చేపట్టారు. క్షేత్రస్థాయిలో భూముల సర్వే నిర్వహించలేదు. ఒకసారి క్షేత్రస్థాయిలో జమాబందీ నిర్వహించి ఎవరి భూములు ఎక్కడ ఉన్నాయో తేల్చితే మరింత మెరుగైన పరిస్థితి వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ధరణి సమాచారం ప్రకారం జమాబందీ చేపడితే మరింత స్పష్టత వస్తుందంటున్నారు.

భూ చట్టాలపైనా దృష్టిసారిస్తే మేలు
రాష్ట్రంలో 120 వరకు రెవెన్యూ చట్టాలు ఉన్నాయి. ప్రభుత్వం ఆర్‌ఓఆర్‌ చట్టానికి కొత్తరూపు ఇవ్వడం మంచి పరిణామమే అయినా మిగిలి ఉన్న చట్టాలను కూడా మార్పులు చేస్తే మేలన్న అభిప్రాయం నిపుణుల నుంచి వినిపిస్తోంది. రాష్ట్రంలో 1999లో అన్ని చట్టాలు కలిపి ఒకే రెవెన్యూ కోడ్‌ పరిధిలోకి తేవాలని ప్రయత్నాలు సాగినా ముందడుగు పడలేదు. ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో మూడేళ్ల క్రితం రెవెన్యూ కోడ్‌ను అమల్లోకి తేవడం గమనార్హం.

టైటిల్‌ వ్యవస్థకు సమీపంలో రాష్ట్రాలు
దేశంలోని రాష్ట్రాలన్నింటిలో టైటిల్‌ గ్యారంటీ చట్టం అమలు చేసేలా కేంద్రం 2011లో ఒక ముసాయిదా చట్టాన్ని తీసుకొచ్చింది. దీన్ని కేంద్రం పరిధిలోని కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తింప చేశారు. భూ పరిపాలన రాష్ట్రాల పరిధిలోని అంశం కావడంతో రాష్ట్రాలు వర్తింప చేసుకునేలా మార్గదర్శకాలు జారీ చేశారు. దేశంలోనే మొదటిసారి 2016లో రాజస్థాన్‌ టైటిల్‌ గ్యారంటీ చట్టాన్ని ప్రవేశపెట్టింది. మహారాష్ట్రలో ఆర్‌ఓఆర్‌కు మార్పులు తెచ్చి ఒక జిల్లాలో పైలెట్‌గా అమలు చేస్తున్నారు. 2018లో గోవాలో ఈ చట్టం ప్రవేశపెట్టారు. హరియాణాలో కేంద్రమే అమలు చేస్తోంది.

నిధుల వ్యయమంతా కేంద్రానిదే..
2008లో నేషనల్‌ ల్యాండ్‌ రికార్డ్‌ మోడ్రనైజేషన్‌ కార్యక్రమాన్ని (ఎన్‌ఎల్‌ఆర్‌ఎంపీ) అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించగా ఎన్‌డీఏ ప్రభుత్వం వచ్చాక డిజిటలైజేషన్‌ మరియు దస్త్రాల ఆధునికీకరణ కార్యక్రమాన్ని భుజాలకెత్తుకుంది. 2022 నాటికి రూ.11 వేల కోట్ల బడ్జెట్‌తో అన్ని రాష్ట్రాల్లో భూ రికార్డుల ఆధునికీకరణ పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకుంది. దీనిలో భాగంగా గోవా, గుజరాత్‌, త్రిపుర రాష్ట్రాలు 95 శాతం భూముల పునఃసర్వే పూర్తిచేశాయి.

క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత అమలు చేస్తే మేలు
టైటిల్‌ గ్యారంటీ చట్టం భూమి హక్కులకు భరోసా ఇస్తుంది. రాష్ట్రంలో అనేక భూ చట్టాలు అమల్లో ఉన్నాయి. వాటిని కూడా ఒక్కచోటికి చేర్చే ప్రయత్నం చేయాలి. రాష్ట్రంలో భూ దస్త్రాల నవీకరణ ఇప్పటికే పూర్తి చేశారు. వాటి ఆధారంగా ఒకసారి జమాబంధీ కూడా నిర్వహించి క్షేత్రస్థాయిలో ఎవరి భూములు ఎక్కడున్నాయనేది కూడా నిర్ధారిస్తే ఇంకా మెరుగ్గా ఉంటుంది.

- ఎం.సునీల్‌కుమార్‌, భూ చట్టాల నిపుణుడు, నల్సార్‌ ఆచార్యుడు
 

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.