close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మటన్‌... మస్త్‌ రుచుల్లో!

ఏ రకంగా వండినా సరే చికెన్‌కు మటన్‌ రుచి రానేరాదు అంటారు కొందరు. అలాంటి మటన్‌ని ఏదో ఒక రుచికే పరిమితం చేయకుండా ఇంకొన్ని వెరైటీల్లోనూ వండేద్దామా...


కొల్వాపూరీ మటన్‌

కావలసినవి: మటన్‌ ముక్కలు: అరకేజీ, అల్లం వెల్లుల్లి ముద్ద: రెండు చెంచాలు, నూనె: పావుకప్పు, పసుపు: కొద్దిగా, ఉప్పు: తగినంత, ఉల్లిపాయలు: నాలుగు, కొబ్బరి తురుము: అరకప్పు, దనియాలు: చెంచా, జీలకర్ర: చెంచా, నువ్వులు: రెండు చెంచాలు, గసగసాలు: మూడు చెంచాలు, ఎండుమిర్చి: పది, లవంగాలు: రెండు.
తయారీవిధానం: మటన్‌ ముక్కలపైన అల్లంవెల్లుల్లి ముద్ద, పసుపు, చెంచా నూనె, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి గంటసేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. స్టౌమీద బాణలి పెట్టి చెంచా నూనె వేసి దనియాలు, జీలకర్ర, నువ్వులు, గసగసాలు, ఎండుమిర్చి, లవంగాలు వేయించి రెండు ఉల్లిపాయల ముక్కలు కూడా వేయాలి. అవి వేగాక కొబ్బరి తురుము వేసి ఓసారి కలిపి స్టౌ కట్టేయాలి. తరువాత అన్నింటినీ మిక్సీలో వేసి కాసిని నీళ్లు పోసి మెత్తగా చేసుకోవాలి. స్టౌమీద బాణలి పెట్టి నూనె వేసి, మిగిలిన ఉల్లిపాయల ముక్కలు ఎర్రగా వేయించి మటన్‌ ముక్కలు, తగినంత ఉప్పు, చేసిపెట్టుకున్న మసాలా వేసి, రెండు కప్పుల నీళ్లు పోసి స్టౌని సిమ్‌లో పెట్టాలి. మటన్‌ పూర్తిగా ఉడికాక దింపేయాలి. 


పాలకూర మటన్‌

కావలసినవి: పాలకూర: అయిదు కట్టలు, మటన్‌: 750 గ్రా, నూనె: పావుకప్పు, యాలకులు: ఆరు, దాల్చినచెక్క: చిన్న ముక్క, ఉల్లిపాయలు: రెండు, వెల్లుల్లి రెబ్బలు: ఆరు, పచ్చిమిర్చి: మూడు, అల్లం: చిన్న ముక్క, దనియాలపొడి: టేబుల్‌స్పూను, జీలకర్రపొడి: చెంచా, టొమాటోలు: రెండు, ఉప్పు: తగినంత, టొమాటో గుజ్జు: అరకప్పు, వెన్న: టేబుల్‌స్పూను, పెరుగు: పావుకప్పు.
తయారీవిధానం: పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి కలిపి ముద్దలా చేసి పెట్టుకోవాలి. స్టౌమీద కుక్కర్‌ని పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక యాలకులు, దాల్చినచెక్క వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా వేయించి పచ్చిమిర్చి మిశ్రమం, దనియాలపొడి, జీలకర్రపొడి, టొమాటో ముక్కలు, మటన్‌ ముక్కలు వేసి బాగా కలపాలి. టొమాటో ముక్కలు వేగాక పాలకూర తరుగు, టొమాటో గుజ్జు, పెరుగు, వెన్న, ఉప్పు వేసి మూత పెట్టి, మూడు కూతలు వచ్చాక దింపేయాలి. 


నవాబ్‌ కోఫ్తా కర్రీ

కావలసినవి: మటన్‌కీమా: పావుకేజీ, అల్లం, వెల్లుల్లి ముద్ద: ఆరు చెంచాలు,  పచ్చిమిర్చి: రెండు, ఉప్పు: తగినంత, గరంమసాలా: ముప్పావుచెంచా, కారం: రెండు చెంచాలు వెన్న: టేబుల్‌స్పూను, నూనె: సరిపడా, జీలకర్ర: పావుచెంచా, యాలకులు: రెండు, దాల్చినచెక్క: చిన్న ముక్క, లవంగాలు: అయిదు, క్రీమ్‌: పావుకప్పు, టొమాటో ప్యూరీ: అరకప్పు.
తయారీ విధానం: ఓ గిన్నెలో మటన్‌కీమా, మూడు చెంచాల  అల్లంవెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి తరుగు, తగినంత ఉప్పు, సగం చొప్పున గరంమసాలా, కారం, వెన్న తీసుకుని బాగా కలపాలి. ఈ ముద్దను కోఫ్తాల్లా చేసుకుని కాగుతోన్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. స్టౌ మీద బాణలి పెట్టి మూడు చెంచాల నూనె వేసి జీలకర్ర, యాలకులు, దాల్చినచెక్క, లవంగాలు వేయాలి. అన్నీ వేగాక మిగిలిన అల్లంవెల్లుల్లి ముద్ద, కారం, గరంమసాలా, టొమాటోప్యూరీ, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి స్టౌని సిమ్‌లో పెట్టాలి. మసాలా వేగాక పావుకప్పు నీళ్లు పోయాలి. ఇది దగ్గరకు అయ్యాక కోఫ్తా ఉండలు, క్రీమ్‌ వేసి... అయిదు నిమిషాలయ్యాక దింపేయాలి. 


కీమ బిర్యాని

కావలసినవి: కీమా: అరకేజీ, ఉల్లిపాయ: ఒకటి, పెరుగు: ముప్పావుకప్పు, నూనె: పావుకప్పు, నెయ్యి: పావుకప్పు, కొత్తిమీర తరుగు: పావుకప్పు, పుదీనా తరుగు: అరకప్పు, అల్లం: చిన్న ముక్క, వెల్లుల్లిరెబ్బలు: ఆరు, లవంగాలు: ఆరు, నిమ్మరసం: టేబుల్‌స్పూను, పచ్చిమిర్చి: ఆరు, బాస్మతీ బియ్యం: ఒకటిన్నర కప్పు (అరగంట ముందు నానబెట్టుకోవాలి), బిర్యానీ ఆకులు: రెండు, జీలకర్ర: చెంచా, యాలకులు: నాలుగు, కారం: ఒకటిన్నర చెంచా, గరంమసాలా: చెంచా, ఉప్పు: తగినంత, పసుపు: పావుచెంచా., దాల్చినచెక్క: చిన్నముక్క.
తయారీ విధానం: ముందుగా పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా, నిమ్మరసం మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. ఓ గిన్నెలో కీమా, పెరుగు, కారం, గరంమసాలా, పసుపు, కొత్తిమీర మసాలా, తగినంత ఉప్పు వేసి అన్నింటినీ కలిపి పెట్టుకోవాలి. మరో గిన్నెలో అయిదు కప్పుల నీళ్లు పోసి స్టౌమీద పెట్టాలి. అవి వేడయ్యాక బిర్యానీ ఆకులు, దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు, జీలకర్ర, రెండు చెంచాల నెయ్యి కొద్దిగా  ఉప్పు వేయాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు కడిగిన బాస్మతీ బియ్యం వేయాలి. బియ్యం తొంభైశాతం ఉడికాక స్టౌని కట్టేసి, అన్నాన్ని ఓ ప్లేటులోకి తీసుకోవాలి. బాణలిని స్టౌమీద పెట్టి నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేయించి కీమాను వేయాలి. అది కూరలా అయ్యాక దింపేయాలి. కాస్త పెద్ద గిన్నె తీసుకుని అడుగున నెయ్యి రాసి... ఓ వరుసలో కీమామసాలాను పరిచి, దానిపైన అన్నం వేయాలి. ఇలా ఒకదాని పైన మరొకటి వేసుకుని మూత పెట్టాలి. స్టౌమీద పెనం పెట్టి ఈ గిన్నెను దానిపైన ఉంచి   పావుగంటయ్యాక దింపేయాలి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు