జిల్లేడు మొక్కతో కశ్మీరీ ఊలు..! - Sunday Magazine
close
జిల్లేడు మొక్కతో కశ్మీరీ ఊలు..!

‘ప్రకృతి ఎంతో అద్భుతమైనది. ఎన్నో అందాలతో కనువిందు చేస్తుంది. ఆరోగ్యాన్ని అందిస్తుంది. పాఠాల్నీ నేర్పిస్తుంది, కొత్త ఆవిష్కరణలకూ స్ఫూర్తినిస్తుంది’ అంటాడు తమిళనాడుకి చెందిన గౌరీ శంకర్‌. అనడమే కాదు, గాలికి పెరిగే జిల్లేడు మొక్క నుంచి పష్మీనా ఉన్నిని పోలిన సుతిమెత్తని ఊలుని రూపొందించాడు. అంతర్జాతీయ కంపెనీలకీ ఎగుమతి చేస్తోన్న ఆ ఊలు కథ...

తమిళనాడులోని అరోవిల్లె ప్రాంతంలో ఉన్న కుయిలాపాళ్యం... ఒకప్పుడు ఎవరికీ పరిచయం లేని చిన్న గ్రామం మాత్రమే. కానీ ఇప్పుడు వేగన్‌ ఊలుకి చిరునామా. అక్కడ ‘ఫాబర్గ్‌’ పేరుతో శంకర్‌ నెలకొల్పిన చిన్న యూనిట్‌లో జిల్లేడు మొక్కల నుంచి పీచును తీసి ప్రాసెస్‌ చేస్తే, కరూరు, తిరుపూరుల్లోని చేనేత కార్మికులు ఆ ఊలుకి సహజ రంగులద్ది దారాలుగా రూపొందిస్తుంటారు. అలా ప్రస్తుతం ఈ కంపెనీ నెలకి 150 కిలోల దారాల్ని తయారుచేసి, పిల్లలకోసం దుస్తుల్ని తయారుచేసే ఇన్‌ఫాంటియమ్‌ విక్టోరియా వంటి బ్రాండెడ్‌ కంపెనీకి సరఫరా చేస్తోంది. గుచి, లూయీ వ్యూటన్‌, అలెగ్జాండర్‌ మెక్‌క్వీన్‌... వంటి మరికొన్ని సంస్థలూ ఈ ఊలుకోసం అడగడం విశేషం.

ఎలా సాధ్యమైంది?
తిరువణ్ణామలైలోని చేనేత కుటుంబం నుంచి వచ్చిన శంకర్‌కి దుస్తుల రూపకల్పన వారసత్వంగా వచ్చిన విద్యే. కానీ హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ చేసి, ఆపై ఫ్యాషన్‌ ప్రపంచానికి వచ్చిన శంకర్‌ అరటి, హెంప్‌ మొక్కల నుంచి పీచును తీసినట్లే- కొత్త మొక్కల నుంచి దారాల్ని తయారుచేయాలనుకున్నాడు. ఆ ఆలోచన చేస్తూనే ‘ఫాబర్గ్‌’ పేరుతో ఓ కంపెనీని నెలకొల్పి, దుస్తుల కంపెనీలకోసం పనిచేయడం ప్రారంభించాడు. ఓసారి యథాలాపంగా కిటికీలోంచి చూస్తోన్న అతన్ని జిల్లేడు పొదా, దాని చుట్టూ చేరిన పక్షులూ ఆకర్షించాయి.
ఆసక్తిగా వాటినే గమనించగా- విచ్చుకున్న వాటి కాయల్లో దారప్పోగులతో ఉన్న విత్తనాలు కనిపించాయి. నులిపోగుల్లాంటి ఆ మెత్తని దారాల కోసమే ఆ పక్షులు అక్కడ చేరాయనీ వాటితో అవి గూడు కడుతున్నాయనీ గుర్తించాడు. అంతే... అతనిలో ఓ కొత్త ఆలోచన మొగ్గ తొడిగింది. ఈ సహజ దారాలతో దుస్తులు తయారుచేస్తేనో... అనిపించింది. ఆపై జిల్లేడు మొక్కని క్షుణ్ణంగా అధ్యయనం చేయగా- దాని కాండంలోని దృఢమైన పీచూ, కాయల్లోని తేలికపాటి పీచులతో ఊలుని రూపొందించవచ్చని తెలిసింది.
అయితే, అవిసె మొక్క నుంచి లినెన్‌ దారాలు తీసినంత సులభం కాదు, జిల్లేడు నుంచి ఊలు చేయడమంటే. మొక్క నుంచి పీచుని వేరుచేయగానే వేడినీళ్లలో వేసి, ఉడికించి ఎండబెట్టాక కొంత పత్తి కలిపితే, కశ్మీరీ ఉన్నిలా తయారవుతుంది.

అర్క...మంచి ఎరువు!
పీచు తీయగా మిగిలిన మొక్క భాగాల్ని ఏం చేయొచ్చా అని శోధించగా- వాటినుంచి తీసిన సారంలో పోషకాలతోపాటు ఆల్కలాయిడ్లూ ఉన్నాయని తెలిసింది. ఇవి నేల సారాన్ని పెంచడంతోపాటు పురుగుల్నీ దరిచేరనివ్వవని గుర్తించాడు. దాంతో ఆ సారానికి వేప, యూకలిప్టస్‌, లెమన్‌ గ్రాస్‌ కలిపి ‘అర్క’ అన్న మందుని రూపొందించాడు. ఇది దోమల మందుగానూ పనిచేస్తుంది. దాంతో రైతులు అర్కను పురుగుల మందుగానూ; దోమల మందుగానూ వాడుతున్నారట. జిల్లేడు ఊలు దుస్తులవల్ల చర్మ వ్యాధులూ రావట. ఇతర ఉన్ని దుస్తులతో పోలిస్తే మన్నిక ఎక్కువ, ముడుచుకోవు. దాంతో లండన్‌లో జరిగిన ఫ్యూచర్‌ ఫ్యాబ్రిక్‌ ఎక్స్‌పోలో ఈ వేగన్‌ ఊలుని ప్రదర్శించడంతో డిమాండ్‌ ఏర్పడింది. కానీ సరిపడా మొక్కలు దొరకడం లేదట. అందుకే ‘ఇతర పంటలతోపాటు జిల్లేడు మొక్కల్నీ పెంచితే రైతులకీ మంచి ఆదాయం వస్తుంది. అప్పుడు దేశంలోని ప్రతి వంద కిలోమీటర్లకీ ఫాబర్గ్‌ యూనిట్టును నెలకొల్పవచ్చు’ అంటోన్న శంకర్‌ కల నెరవేరాలని ఆశిద్దాం.

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న