close
కూరగాయలు...కొత్త రూపాల్లో..!

మనుషుల్ని పోలిన మనుషుల్ని చూసి ఆశ్చర్యపోతుంటాం. అలాగే కొన్ని కూరగాయలు సైతం ఇతర కూరగాయల్ని పోలి ఉండటం విశేషం. బీట్‌రూట్‌ని పోలిన క్యారెట్లూ పొట్లకాయల్ని పోలిన సొరకాయలూ చిలగడదుంపను పోలినబంగాళాదుంపలూ టొమాటోలాంటి క్యాప్సికమ్‌లూ... ఇవన్నీ ఆ కోవకు చెందినవే. అదీ ఎలాంటి జన్యుమార్పులూ చేయకుండా సహజంగానో సంకరీకరణం ద్వారానో పండించినవే.
క్యారెట్‌ అంటే పొడవాటి రూపం, బీట్‌రూట్‌ గుర్తొస్తే గుండ్రని రూపం మాత్రమే స్ఫురిస్తుంది. అంటే మనకు తెలిసిన కూరగాయలన్నిటికీ నిర్దిష్టమైన ఆకారం అనేది ఉంటుంది. కానీ కూరగాయల్లో భిన్న రంగులు ఉన్నట్లే మనకు తెలీని విభిన్న ఆకారాలూ ఉన్నాయి. అయితే ఆ రూపాలు అచ్చంగా అదే కుటుంబానికో లేదా పోషకాల్లో సారూప్యం ఉన్న కూరగాయలనో పోలినట్లు ఉండటమే విశేషం. అంటే- బీట్‌రూట్‌లాంటి క్యారెట్లూ, క్యారెట్‌ లాంటి బీట్‌రూట్లూ; చిలగడదుంపను పోలిన పొడవాటి బంగాళాదుంపలూ, బ్రకోలీని తలపించే కాలీఫ్లవరూ, పొట్లకాయల్ని తలపించే సొరకాయలూ; టొమాటో అనిపించే క్యాప్సికమ్‌లూ, వంకాయలూ... ఇలా ఈ కూరగాయలన్నీ అరుదైన రూపాల్లో పండుతున్నాయి.

క్యారెట్‌... బీట్‌రూట్‌ లాగా

రెండువేల సంవత్సరాల క్రితం ఉత్తర ఆఫ్రికాలో పుట్టిన తొలి బీట్‌రూట్‌ రంగు తెలుపు. ఆపై చాలా రంగుల్ని సృష్టించగలిగారు. కానీ పొడవు బీట్‌రూట్‌ని మాత్రం 1880 ప్రాంతంలో డెన్మార్క్‌లో రూపొందించారట. అప్పటినుంచీ అమెరికాలో దీన్ని భారీగా పండిస్తున్నారు. బీట్‌రూట్‌ సిలిండ్రాగా పిలిచే ఈ రకం, పొడవుగా పెరగడంవల్ల దిగుబడి ఎక్కువ. తొక్క పలుచన. సాధారణ బీట్‌రూట్‌లోని పోషకాలన్నీ ఇందులోనూ ఉంటాయి. పైగా దానికన్నా రుచిగా ఉండటంతో నేరుగానూ తినొచ్చు.

బీట్‌రూట్‌ లాంటి క్యారెట్‌

రోపాలో 19వ శతాబ్దంలో తొలిసారిగా పండించిన ఈ గుండ్రని క్యారెట్ల రకం మిగిలినవాటికన్నా త్వరగా పెరుగుతుందట. సైజూ ఆకారంతోబాటు పిల్లలకి లంచ్‌బాక్సులో పెట్టేందుకు అనువుగా ఉంటాయన్న కారణంతో దీన్ని చాలామంది ఇళ్లలో పెంచుతున్నారు. మిగిలిన క్యారెట్లతో పోలిస్తే ఇందులో విటమిన్‌-ఎ, సిలశాతం ఎక్కువ. నేరుగానూ కాల్చుకునీ తింటుంటారు.

ఇది క్యాప్సికమే..!

పాప్రికా ఇటాలియన్‌గా పిలిచే ఈ రకం క్యాప్సికమ్‌ చూడ్డానికే కాదు, రుచిలోనూ టొమాటోనే తలపిస్తుంది. ఇటలీ నుంచి అన్ని ప్రాంతాలకీ విస్తరించిన ఇది మాంచి రుచిగా ఉంటుందని సలాడ్లలోనూ వాడుతుంటారు.

సాగిన క్యాబేజీ

సెలెరీ ఆకుల్ని పోలినట్లుగా ఉండే ఈ రకాన్ని తొలిసారిగా 15వ శతాబ్దంలో చైనాలో పండించడంతో దీన్ని చైనీస్‌ క్యాబేజీగా పిలుస్తారు. విటమిన్‌-సి, కాల్షియం అధికంగా ఉండటంతోబాటు మంచి వాసన వస్తుంటుందీ క్యాబేజీ. సాధారణ క్యాబేజీలో మాదిరిగానే దీన్ని కూడా అన్ని రంగుల్లోనూ పండిస్తున్నారు.

కమలా కాదు, నిమ్మ..!

చ్చం కమలాల్ని తలపించే ఈ రకం చూడ్డానికి మాత్రమే అలా ఉంటుంది. రుచిలో మాత్రం మహాపులుపు. అయితే వీటిల్లో గింజలు తక్కువ. కాలిఫోర్నియాలో ఎక్కువగా పెంచే యురేకా నిమ్మలో రెండు దశాబ్దాల క్రితం ఏర్పడిన సహజ మార్పులతో పుట్టుకొచ్చిన ఈ రకంలో విటమిన్‌-సి అత్యధికం. బి-కాంప్లెక్స్‌, ఫోలేట్లు, కాల్షియం, ఐరన్‌, కాపర్‌, పొటాషియం వంటి ఖనిజాలూ పుష్కలమే.

ఇది... మిరప పండు!

గుండ్రని చెర్రీపండ్లని తలపించే ఈ మిర్చి తియ్యని వాసనతో ఉంటుంది. అందుకే దీన్ని ఫ్లోరల్‌ జెమ్‌ అనీ అంటారు. మిగిలిన మిర్చి రకాలతో పోలిస్తే ఘాటు చాలా తక్కువ.

ఉల్లి పొడుగైంది!

టోస్కా ఉల్లి 12-17 సెం.మీ. పొడవుతో ఉండే కాస్త తియ్యని రుచితో ఉంటాయి. కాబట్టి వీటిని  నేరుగానూ తినొచ్చు. ఎ, సి, బి విటమిన్లతోబాటు అన్ని రకాల ఖనిజాలూ సమృద్ధిగా ఉండే వీటిని మొదటగా చెక్‌ రిపబ్లిక్‌లో పండించారట.

టొమాటోలాంటి వంకాయలు!

ఫ్రికన్‌ వంకాయగా పిలిచే ఈ రకం చూడ్డానికి అచ్చం గుమ్మడి లేదా టొమాటోని తలపిస్తుంది. కానీ మహా చేదు. అందుకే దీన్ని చేదు టొమాటో అనీ అంటారు. కానీ పీచూ పొటా షియం, ఐరన్‌, కాల్షియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉండటంతో ఆఫ్రికన్లు దీన్ని రకరకాల వంటల్లో వాడుతుంటారు. సంతానోత్పత్తికి మంచిదన్న కారణంతో పెళ్లిళ్లలో దీన్ని బహుమతిగానూ ఇస్తుంటారట. చెర్రీ టొమాటోల్ని తలపించే మరో రకం వంకాయ కూడా ఆఫ్రికన్‌ దేశాల్లో పుట్టినప్పటికీ దక్షిణ, మధ్య అమెరికా దేశాల్లో ఎక్కువగా పండిస్తున్నారు. చేదు రుచితో ఉండే వీటిలో ఔషధగుణాలు అధికంగా ఉండటంతో వీటితో రకరకాల కూరలూ పచ్చళ్లూ చేస్తుంటారు.

దోసకాయలా... కీరాలా...!

దోసకాయల్ని తలపించే గుండ్రని కీరాల్నే లెమన్‌ లేదా ఆపిల్‌ కుకుంబర్‌గా పిలుస్తారు. ఇవి తియ్యని రుచితో తేలికగా జీర్ణమవుతాయి. వీటిల్లో విటమిన్‌-సి, కె లతోబాటు పొటాషియం, కాల్షియం, పీచు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా దొరుకుతాయి. భారత్‌లోనే పుట్టిన ఈ రకం, 16వ శతాబ్దం నుంచీ మధ్యతూర్పు, తరవాత ప్రపంచదేశాలకీ పరిచయమైందట. వీటిని కూరలతోబాటు సలాడ్లలోనూ వాడుతుంటారు.

కాలీఫ్లవరే... బ్రకోలీలా..!

కొంచెం బ్రకోలీనీ మరికొంచెం కాలీఫ్లవర్‌నీ తలపించే దీన్ని బ్రకోలీ రోమనెస్కో లేదా రోమనెస్కో కాలీఫ్లవర్‌ అంటారు. ఎందుకంటే ఆ రెండింటి సంకరీకరణతో రూపొందించిన ఈ ఇటాలియన్‌ రకాన్ని ఐరోపాలో ఎక్కువగా పండిస్తారు.ఇందులో విటమిన్లూ కెరోటినాయిడ్లూ పుష్కలమే.

ఆలూ... ఎంత బారో..!

కరకాల రంగుల్లో వేల రకాల్లో ఉండే బంగాళాదుంపలో చిలగడదుంపల మాదిరిగా ఉండేవీ ఉన్నాయి. వీటినే ఫింగర్‌లింగ్‌ పొటాటో అని పిలుస్తుంటారు. బంగాళాదుంపలో ఉండే అన్ని పోషకాలతోబాటు విటమిన్‌-సి, పొటాషియం వంటివి ఎక్కువ శాతంలో లభించడం విశేషం. 18వ శతాబ్దంలో ఐరోపాలో పండించిన ఈ రకం దుంపల్లో ఇటీవల వంకాయ, ఎరుపు, పసుపు వంటి రంగుల్నీ చొప్పించారు.

పాము సొరకాయ

పొట్లకాయలా పొడవుగా పెరిగే ఈ సొరకాయ రకాన్ని ఇటలీలో ఎక్కువగా పండిస్తుంటారు. దీని ఆకారం పాముని తలపించడంతో దీన్ని సిసీలియన్‌ సర్పెంట్‌ గార్డ్‌ అనీ పిలుస్తున్నారు. మూడు అడుగుల వరకూ పెరిగే దీన్ని మిగిలిన సొరకాయల మాదిరిగానే రకరకాల వంటల్లో వాడుతుంటారు.
వేకాదు, కూరగాయల్లో మనకు తెలీని రూపాలు ఎన్నో... మరెన్నో... వాటిల్లో సహజంగానే రూపంలో సారూప్యం ఉన్నవి కొన్నయితే, సంకరీకరణం ద్వారా రూపొందించినవి మరికొన్ని. సో, మనుషుల్లో మాదిరిగానే కూరగాయల్లోనూ ఒకదాన్ని పోలినవి మరొకటి ఉన్నాయనేది ఆశ్చర్యకరమైన విషయమే కదూ!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.