పాస్‌వర్డ్‌ పదిలంగా..
close

Published : 14/07/2021 01:30 IST
పాస్‌వర్డ్‌ పదిలంగా..

ఇ‘స్మార్ట్‌’గా

ఈ-మెయిళ్లకైనా, సామాజిక మాధ్యమాలకైనా, బ్యాంకు లావాదేవీలకైనా ప్రతిదానికీ పాస్‌వర్డ్‌లే. ఇన్నేసి సంకేత పదాల కోసం ఎన్ని తిప్పలు పడుతుంటామో. ఒకోదానికి ప్రత్యేకమైన పదాలను సృష్టించుకోవటం దగ్గర్నుంచి గుర్తుపెట్టుకోవటం వరకూ అన్నీ ఇబ్బందులే. చివరికి ఏదో ఒక పాస్‌వర్డ్‌ దగ్గర ఆగిపోతుంటాం. ఇక అన్నింటికీ దీన్నే ఎంచుకుంటాం. ఆన్‌లైన్‌ భద్రతకు ఇదే పెద్ద ముప్పు. హ్యాకర్‌ ఒక పాస్‌వర్డ్‌ను ఛేదిస్తే చాలు. మొత్తం సమాచారం రట్టయినట్టే. అలాగని సంకేతాలను మార్చుకుందామా అంటే అదో పెద్ద ప్రహసనం. మరి దీన్ని అధిగమించటమెలా? ఇందుకోసం క్రోమ్‌ వాడేవారికి ఇన్‌బిల్ట్‌గా ఎన్నో అవకాశాలున్నాయి. 

పాస్‌వర్డ్‌ మేనేజర్‌ సాయం
క్రోమ్‌ వినియోగదారులకు పాస్‌వర్డ్‌ మేనేజర్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పుడు క్రోమ్‌ దీన్ని నాలుగు స్థాయుల్లో అప్‌గ్రేడ్‌ చేస్తోంది. ఇతర పాస్‌వర్డ్‌ మేనేజర్ల నుంచి పాస్‌వర్డ్‌లను దిగుమతి చేసుకోవచ్చు. గూగుల్‌ సెక్యూరిటీ పరిధిలోకి తీసుకురావొచ్చు. వెబ్‌సైట్లు, ఆండ్రాయిడ్‌ యాప్స్‌ రెండింటిలోనూ వీటిని వాడుకోవచ్చు. క్రోమ్‌ పాస్‌వర్డ్‌ మేనేజర్‌ చేసే మరో ముఖ్యమైన పని బలహీనమైన పాస్‌వర్డ్‌లను గుర్తించి సరిచేయటం. ఉదాహరణకు
srinu@123 పాస్‌వర్డ్‌నే తీసుకుందాం. ఇది బలహీనమైదేమీ కాకపోవచ్చు. కానీ దీన్నే వివిధ వెబ్‌సైట్లకు వాడుతుంటే చేధించటం తేలికైపోతుంది. హ్యాకర్లు ఒకసారి దీన్ని తెలుసుకుంటే ఇతర ఖాతాల్లోకీ తేలికగా చొరబడతారు. ఇలాంటి ప్రమాదాన్ని గుర్తిస్తే క్రోమ్‌ వెంటనే హెచ్చరిస్తుంది. సమస్యను సరిచేసుకోవటానికి వీలు కల్పిస్తుంది.

డ్యూప్లెక్స్‌ తోడు
కృత్రిమ మేధతో పనిచేసే డ్యూప్లెక్స్‌ సైతం బలమైన పాస్‌వర్డ్‌లకు తోడ్పడుతుంది. రోబో గొంతుతో ఆన్‌లైన్‌లో టికెట్లు కొనటం, విమానాల అందుబాటును తెలుసుకోవటం, ఆహార పదార్థాలు ఆర్డర్‌ చేయటం వంటి వివిధ పనులకు డ్యూప్లెక్స్‌ ఉపయోగపడుతుంది. ఇది గూగుల్‌ అసిస్టెంట్‌తో కలిసి బ్రౌజింగ్‌, స్క్రోలింగ్‌, క్లికింగ్‌, ఫామ్స్‌ నింపటం వంటి పనుల్లో సాయం చేస్తుంది. అంతేకాదు, ఎప్పుడైనా వ్యక్తిగత వివరాలు చోరీకి గురైనట్టు గమనిస్తే బలమైన పాస్‌వర్డ్‌లను నిర్ణయించుకోవటానికీ ఈ పరిజ్ఞానం ఉపయోగపడుతుంది.

డేటా సింకింగ్‌తోనూ..
క్రోమ్‌లో డేటా సింక్‌ చేయటమంటే అన్ని పరికరాల్లోనూ అదే సమాచారాన్ని చూసుకోవటానికి వీలుండటం. బుక్‌మార్కులు, హిస్టరీ, ఓపెన్‌ చేసిన ట్యాబ్స్‌, పాస్‌వర్డ్‌లు, చెల్లింపుల సమాచారం, చిరునామాలు, ఫోన్‌ నంబర్ల వంటివన్నీ సింక్‌ అవుతాయి. అయితే ఎలాంటి సమాచారాన్ని సింక్‌ చేయాలన్నది మనమే నిర్ణయించుకోవచ్చు. ఇందుకోసం క్రోమ్‌ను ఓపెన్‌ చేసి అన్నింటికన్నా పైన కనిపించే మూడు చుక్కల మీద క్లిక్‌ చేసి, సెటింగ్స్‌లోకి వెళ్లాలి. అందులో ‘యూ అండ్‌ గూగుల్‌’ విభాగంలోని ‘సింక్‌ అండ్‌ గూగుల్‌ సర్వీసెస్‌’ను నొక్కాలి. ‘రివ్యూ యువర్‌ సింక్డ్‌ డేటా’ ద్వారా ఏయే అంశాలను సింక్‌ చేశామన్నది తెలుసుకోవచ్చు. తిరిగి సింక్‌ అండ్‌ గూగుల్‌ సర్వీసెస్‌లోకి వెళ్లి ‘మేనేజ్‌ వాట్‌ యూ సింక్‌’ను క్లిక్‌ చేయాలి. కావాలనుకుంటే సింక్‌ ఎవ్రీథింగ్‌ను ఎంచుకోవచ్చు. సింక్‌ చేయొద్దని భావించే సేవలను టర్న్‌ ఆఫ్‌ చేసుకోవచ్చు. ఆటోమాటిక్‌ పాస్‌వర్డ్‌ ఛేంజేస్‌ ఆప్షన్‌ అప్‌డేట్‌ అయ్యేంతవరకు పాస్‌వర్డ్‌లను మనకు మనమే మార్చుకోవాల్సి ఉంటుంది. ఇలా క్రోమ్‌ పాస్‌వర్డ్‌ మేనేజర్‌ పలు ఖాతాల కోసం ఎప్పటికప్పుడు బలమైన, విశిష్టమైన పాస్‌వర్డ్‌లను సృష్టించుకోవటానికి తోడ్పడుతుంది.

గూగుల్‌ మిషన్‌ సహకారం
క్రోమ్‌లో సింక్‌ను టర్న్‌ ఆన్‌ చేసుకుంటే.. ఏదైనా సైట్‌లో ఖాతాను తెరిచేటప్పుడు బలమైన పాస్‌వర్డ్‌లను సృష్టించుకోవటం తేలికవుతుంది. పాస్‌వర్డ్‌ టెక్స్ట్‌ బాక్స్‌ను క్లిక్‌ చేస్తే ‘యూజ్‌ సజెస్టెడ్‌ పాస్‌వర్డ్‌’ ప్రత్యక్షమవుతుంది. ఇందులో గూగుల్‌ మిషన్‌ పాస్‌వర్డ్‌ను సృష్టించి సిద్ధంగా ఉంచుతుంది. దీన్ని మున్ముందు వాడుకోవటానికి గూగుల్‌ దానంతటదే సేవ్‌ చేసి పెట్టుకుంటుంది కూడా.

* క్రోమ్‌ సెటింగ్స్‌లోని ‘సేఫ్టీ చెక్‌’ ద్వారానూ బలహీన పాస్‌వర్డ్‌లను గుర్తించొచ్చు. సేఫ్టీ చెక్‌లోకి వెళ్లి ‘చెక్‌ నౌ’ను నొక్కాలి. ఇది బలహీనమైన సంకేత పదాలను గుర్తించి, మార్చుకోవాలని సూచిస్తుంది.

పాస్‌వర్డ్‌లను సమీక్షించుకోవటానికి, కొత్తవాటిని సృష్టించుకోవటానికి ప్రతి నెలా కొంత సమయాన్ని కేటాయించుకోవటం మంచిది. దీనికి ౖకాస్త సమయం పట్టినా ఆన్‌లైన్‌ భద్రతకు ఎంతగానో ఉపయోగపడుతుందనటం నిస్సందేహం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న