గోమాత ఎందుకు గొప్పదంటే..

తెలిసీ తెలియక చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి, మరుజన్మ లేకుండా మోక్షం పొందడానికి రుషులు అనేక మార్గాలు సూచించారు.

Published : 14 Mar 2024 00:04 IST

తెలిసీ తెలియక చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి, మరుజన్మ లేకుండా మోక్షం పొందడానికి రుషులు అనేక మార్గాలు సూచించారు. అందులో గోసేవ ముఖ్యమైంది, సులభమైంది, అత్యంత ప్రభావం చూపేదని పురాణేతిహాసాలు పేర్కొన్నాయి. గోసేవతో ఎందరో పాపాల నుంచి బయటపడ్డారు. మహిమాన్విత మైన గోసేవ గురించి అనేక ఉదంతాలున్నాయి. ఏదైనా పొరపాటు చేశానని భావిస్తే.. వెంటనే గోమాత వద్దకు వెళ్లి, గ్రాసం వేసి ప్రార్థిస్తే ఆ దోషం నుంచి బయటపడతారు. ఒక గంటసేపు ఆవు గంగడోలు నిమిరినా పాపం నుంచి విముక్తి లభిస్తుంది. ఆవుల మంద వస్తున్నప్పుడు వాటి గిట్టల నుంచి లేచిన ధూళి శరీరంపై పడినా.. పాపం నుంచి బయటపడతారు. ఆవు మీదుగా వచ్చే గాలి మనను సోకితే కూడా పాపప్రక్షాళన అవుతుంది. ఆవు చేసే అంబా అనే శబ్దం వింటే కూడా చేసిన పాపాలు పటాపంచలౌతాయి. గోవును మనం చూసినా, అది మనల్ని చూసినా పాపాలు తొలగిపోతాయి.

నమో గోభ్య శ్శీమ్రతీభ్యః సేరబేయీభ్య ఏ వచ
నమో బ్రహ్మ సుతాభ్యశ్చ పవిత్రాభ్యోనమో నమః

అనే మంత్రం రోజూ 108 సార్లు పఠిస్తే చేసిన పాపాలన్నీ నశిస్తాయి. ఇంత పెద్ద మంత్రం   చదవడం సాధ్యంకాదు అనుకునేవారు ‘గోమాత్రే నమః’ అని జపించినా పాపాల నుంచి బయటపడవచ్చు- అన్నాడు వ్యాసమహర్షి. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. మన ఆధ్యాత్మిక గ్రంథాల్లో గోమాత విశిష్టతను విస్తారంగా వివరించారు.

శివశ్రీ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని