ధ్వజస్తంభం ఎందుకంటే..

ప్రతి ఆలయంలో ధ్వజస్తంభం ఉంటుందని మనందరికీ తెలుసు. కానీ ఎందుకుంటుందనే విషయం కొందరికి తెలియక పోవచ్చు.

Updated : 21 Apr 2024 17:10 IST

ప్రతి ఆలయంలో ధ్వజస్తంభం ఉంటుందని మనందరికీ తెలుసు. కానీ ఎందుకుంటుందనే విషయం కొందరికి తెలియక పోవచ్చు. కురుక్షేత్ర యుద్ధం తర్వాత శ్రీకృష్ణుడి సలహా మేరకు ధర్మరాజు అశ్వమేధ యాగానికి పూనుకున్నాడు. మయూరధ్వజుడి కుమారుడు తామ్రధ్వజుడు పాండవుల యాగాశ్వాన్ని బంధించాడు. వారితో యుద్ధంచేసి గెలవలేం, కపటోపాయంతో మాత్రమే జయించగలం- అనుకున్న శ్రీకృష్ణుడు, ధర్మరాజులు వృద్ధ బ్రాహ్మణులుగా మణిపురం చేరుకున్నారు. వారి కోరిక మేరకు మయూరధ్వజుడు తన సగం శరీరం కోసి ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. అతడి దాన గుణానికి మెచ్చిన కృష్ణుడు తన అసలు రూపాన్ని చూపి, ఏదైనా వరం కోరుకోమన్నాడు.

బదులుగా ‘పరమాత్మా! నా శరీరం నశించినా నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలా, అది నిత్యం మీ ఎదుట ఉండేలా వరాన్ని అనుగ్రహించండి’ అన్నాడు మయూరధ్వజుడు. కృష్ణపరమాత్ముడు ‘తథాస్తు!’ అని దీవించి, ‘మయూరధ్వజా! నేటి నుంచీ ప్రతి దేవాలయం ముందు నీ పేరున ధ్వజస్తంభం వెలుస్తుంది. ఆ స్తంభాలను ఆశ్రయించిన నీ ఆత్మ, నిత్యం దైవ సాన్నిధ్యంలోనే ఉంటుంది. ముందు  నిన్ను దర్శించి, ప్రదక్షిణ నమస్కారాలు చేసిన మీదటే  భక్తులు దైవాన్ని దర్శించుకుంటారు. నీ వద్ద ఎవరు దీపం ఉంచుతారో వారి జన్మ సఫలం అవుతుంది. నీ శిరస్సుపై ఉంచిన దీపం రాత్రులందు బాటసారులకు కాంతి పుంజమై దారి చూపిస్తుంది’ అన్నాడు. ఆనాటి నుంచీ ఆలయాల ముందు ధ్వజస్తంభాలు తప్పనిసరిగా ప్రతిష్టించడం ఆచారమైంది. భక్తులు ముందుగా ఆ స్తంభానికి మొక్కి, తర్వాతే మూలవిరాట్టు దర్శనం చేసుకోవడం అనేది సంప్రదాయంగా మారింది.              

- త్రినేత్ర


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని