యక్ష ప్రశ్నలు ఎలా పుట్టాయి?

ఎవరైనా ఎడతెరిపి లేకుండా ప్రశ్నలు వేస్తుంటే ‘ఇక ఆపుతావా యక్ష ప్రశ్నలు?’ అనటం సర్వసాధారణం.

Published : 16 May 2024 00:12 IST

ఎవరైనా ఎడతెరిపి లేకుండా ప్రశ్నలు వేస్తుంటే ‘ఇక ఆపుతావా యక్ష ప్రశ్నలు?’ అనటం సర్వసాధారణం. కొంగ రూపంలో ఉన్న యక్షుడు అనే గంధర్వుడు అడిగిన ప్రశ్నలే ‘యక్ష ప్రశ్నలు’గా ప్రసిద్ధి చెందాయి. ధర్మరాజుకు, యక్షుడనే గంధర్వురుడికి మధ్య జరిగిన సంభాషణ నుంచే ‘యక్ష ప్రశ్నలు’ అనే జాతీయం పుట్టింది. తన అధీనంలో ఉన్న సరస్సులోని నీటిని తన మాట కాదని తాగబోయిన భీమార్జున నకుల సహదేవుల ప్రాణాలను యక్షుడు హరిస్తాడు. సోదరులను వెతుక్కుంటూ అక్కడికి వచ్చిన ధర్మనందనుడు- వారి గురించి ఆరా తీశాడు. ముందు తానడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పమన్నాడు యక్షుడు. మహాబల పరాక్రమ సంపన్నులైన తన తమ్ముళ్లను ఓడిôచాడంటే.. ఆ గంధర్వుడు సామాన్యుడు కాడని ధర్మరాజు గ్రహించాడు. అతడు పెట్టిన ఆంక్షకు అంగీకరించాడు. అప్పుడు యక్షుడు వేసిన ప్రశ్నలు, ధర్మరాజు చెప్పిన సమాధానాలు మన ధర్మంలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గవి. సర్వ మానవ శ్రేయస్సుకు సంబంధించిన తాత్త్విక, ఆధ్యాత్మిక, జీవన సత్యాలను యక్షుడు ధర్మరాజు నుంచి రాబట్టాడు. ఆ సమాధానాలతో సంతృప్తి చెంది, భీమార్జున నకుల సహదేవులను బతికించాడు. ఇంతకూ ఆ యక్షుడు మరెవరో కాదు.. సాక్షాత్తూ యమధర్మరాజు. ‘యక్ష ప్రశ్నలు’ ఘట్టం మహాభారతంలోని అరణ్యపర్వం చివరలో వస్తుంది.                          

మనోజ్ఞ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని