కైలాసం, వైకుంఠం ఎంతెంత దూరం?

ఓ గురువు తన చుట్టూ కూర్చున్న శిష్యులను ఉద్దేశించి ‘ఇక్కడి నుంచి కైలాసం ఎంత దూరం? వైకుంఠం ఎంత దూరం?’ అని ప్రశ్నించాడు. శిష్యులు బుద్ధికుశలతను ఉపయోగించి పురాణాలు, శాస్త్రాల ప్రమాణాలను ఉటంకిస్తూ ఎవరికి తోచిన సమాధానం వారు చెప్పారు.

Updated : 25 Apr 2024 07:00 IST

గురువు తన చుట్టూ కూర్చున్న శిష్యులను ఉద్దేశించి ‘ఇక్కడి నుంచి కైలాసం ఎంత దూరం? వైకుంఠం ఎంత దూరం?’ అని ప్రశ్నించాడు. శిష్యులు బుద్ధికుశలతను ఉపయోగించి పురాణాలు, శాస్త్రాల ప్రమాణాలను ఉటంకిస్తూ ఎవరికి తోచిన సమాధానం వారు చెప్పారు. అన్నీ విన్నాక.. ఆ గురువు చిరునవ్వు చిందించి.. ‘నేను చెబుతా వినండి.. కైలాసం చేతికందే దూరంలోనూ, వైకుంఠం పిలుపు వినిపించేంత దూరంలోనూ ఉన్నాయి’ అన్నాడు. ఆయన చెప్పింది విని.. శిష్యులు ఆశ్చర్యంగా చూశారు. వారి అయోమయాన్ని అర్థం చేసుకున్న ఆచార్యుడు ‘యమధర్మరాజు తన ప్రాణాలను హరించటానికి వచ్చినప్పుడు మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. శివుడు కైలాసం నుంచి వచ్చి.. యమధర్మరాజును శిక్షించి, మార్కండేయుణ్ణి రక్షించాడు. అంటే కైలాసం చేతికి అందేంత దూరంలో ఉన్నట్లే కదా! అలాగే తటాకంలో మొసలి నోటికి పట్టుబడిన గజేంద్రుడు ఎలుగెత్తి ‘నారాయణా’ అని పిలిచాడు. వైకుంఠంలో ఉన్న ఆ శ్రీహరి వెంటనే పరుగెత్తుకుంటూ వచ్చి గజేంద్రుణ్ణి రక్షించాడు. ఆర్తితో పిలిచిన భక్తుడి పిలుపు వైకుంఠం వరకూ వినబడిందంటే.. మరి ఆ వైకుంఠం.. పిలుపు వినిపించేంత దూరంలోనే ఉన్నట్లు కాదా చెప్పండి!’ అంటూ వివరించే సరికి శిష్యులు ముక్తకంఠంతో అవునన్నారు.                  

చక్రి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని