ఇఫ్తార్‌ విందుతో ఉపవాస ప్రతిఫలం

రంజాన్‌ సందర్భంగా చేసే సహర్‌ (ఉదయానికి ముందు చేసే భోజనం), ఉపవాసాలు, ఇఫ్తార్‌ విందులు, తరావీ నమాజులు.. భావోద్వేగాల్లో మార్పు మొదలుకొని ఆధ్యాత్మిక ఉన్నతి వరకూ అనేక ప్రయోజనాలూ, పరమార్థాలూ కలిగిస్తాయి.

Published : 14 Mar 2024 00:05 IST

రంజాన్‌ సందర్భంగా చేసే సహర్‌ (ఉదయానికి ముందు చేసే భోజనం), ఉపవాసాలు, ఇఫ్తార్‌ విందులు, తరావీ నమాజులు.. భావోద్వేగాల్లో మార్పు మొదలుకొని ఆధ్యాత్మిక ఉన్నతి వరకూ అనేక ప్రయోజనాలూ, పరమార్థాలూ కలిగిస్తాయి. ఇస్లాం సంప్రదాయంలో రంజాన్‌ మాసం కుటుంబ జీవనం, ఉపవాసం, దానం, ఆరాధనపై కేంద్రీకృతమై ఉంటుంది. కానీ దైనందిన జీవితంలో ఒత్తిళ్ల వల్ల మనకు విలువైన కానుకగా దొరికిన కుటుంబాన్ని అభినందించడాన్ని మర్చిపోతాం. ప్రియమైన వారితో సరదాగా గడపడం కొందరికి కొన్నిసార్లు కుదరకపోవచ్చు. అలాంటి సమయంలో మన ఇంటి తలుపులు తెరచి, పొరుగువారిని, ఉపవాసం చేస్తున్న బంధుమిత్రులను ఇంటికి ఆహ్వానించి వారితో ఇఫ్తార్‌ పంచుకోవడాన్ని నేర్పుతుంది రంజాన్‌. ‘ఉపవాసం చేసినవారికి దక్కినంత ఫలం, ఇఫ్తార్‌ ఇచ్చినవారికీ దక్కుతుంది, ఉపవాస ప్రతిఫలాన్ని ఇఫ్తార్‌ కొంచెం కూడా తగ్గించదు’ అన్నారు ముహమ్మద్‌ ప్రవక్త.

తోటివారికి ఆహారం అందించడం ప్రవక్త చెప్పిన సత్కార్యాల్లో ఒకటని మనందరికీ తెలుసు. అందుకే చాలామంది తాము తినేదాన్ని ఇతరులతో పంచుకుంటారు. ఒకరి పట్ల ఒకరు ప్రేమ, దయ కనబరుస్తారు. ప్రవక్త కాలంలో ఎవరూ తమంతట తాముగా ఉపవాసం విరమించేవారు కాదు. ఇంటికి వచ్చే వారిని వారు సాదరంగా ఆహ్వానించేవారు. ఎవరూ రాకపోతే తమ ఆహారాన్ని మస్జిద్‌ వద్దకు తీసుకెళ్లి అక్కడి ప్రజలతో పంచుకుని తినేవారు. ప్రేమ, స్నేహం, సోదర భావం, దయతో కూడిన చర్యలు స్వర్గప్రాప్తికి సహకరిస్తాయి. ‘మీరు విశ్వసించనంత వరకూ స్వర్గంలోకి ప్రవేశించలేరు, ఒకరి పట్ల ఒకరు ప్రేమ, దయ ప్రదర్శించనంత వరకు నిజమైన విశ్వాసులు కాలేరు’ అన్న ప్రవక్త ఉద్బోధను అనుసరించాలి.

ఉపవాసాన్ని విరమించే సమయంలో ఉత్తేజకరమైన వాతావరణం ఉంటుంది. కుటుంబసభ్యులు, ఇరుగు పొరుగువారితో కలిసి ప్రార్థనలు చేసి, ఇఫ్తార్‌లో పాల్గొంటాం. నలుగురితో కలిసి పని చేయడం, పంచుకోవడం ద్వారా దయా గుణాన్ని పెంచుకుంటాం. ఏకాంతంగా ప్రార్థించడం, ఖురాన్‌ పఠన, హృదయపూర్వకంగా అల్లాహ్‌ను స్మరించడం, అన్నపానీయాలకు దూరంగా ఉండటం, చేసే పనుల్లో సమతుల్యత, తోటివారితో కలిసి తరావీ ప్రార్థనలు, ఏతెకాఫ్‌ (మస్జిద్‌లో చేసే ప్రత్యేక ఆరాధన), ఇఫ్తార్‌ విందు- ఇవన్నీ నలుగురి కష్టసుఖాల్లో పాలుపంచుకునేలా, సంఘజీవనం సంతోషంగా సాగేలా దోహదం చేస్తాయి. రంజాన్‌ అనేది వ్యక్తిగత పరివర్తన, సాంగత్యం మధ్య ఏర్పడే మంచి మార్పుకు నిదర్శనం. ఇది ఏకాంతం, సంఘ జీవనం రెండింటికీ సంబంధించింది. పేదలు, నిరాశ్రయులను నిర్లక్ష్యం చేయక.. వారిని మన ఇళ్లకు ఆహ్వానించే మాసమిది. వారితో ఆత్మీయంగా మాట్లాడుతూ మంచి వాతావరణం కల్పించి, సమాజాన్ని రక్షించుకునే వసంతం. తోటివారితో సత్సంబంధాలు కొనసాగించే సమయం.

ఖైరున్నీసాబేగం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని