ఉపవాసం ఎందుకంటే..

మనమంతా కోరుకునేది ఆనందాన్ని. అందుకు మనశ్శాంతినిచ్చే పూజలూ, ఉపవాసాలూ ఎంతగానో తోడ్పడతాయి.

Published : 28 Mar 2024 00:06 IST

నమంతా కోరుకునేది ఆనందాన్ని. అందుకు మనశ్శాంతినిచ్చే పూజలూ, ఉపవాసాలూ ఎంతగానో తోడ్పడతాయి. ఉపవాసం గురించి ఆధ్యాత్మికవేత్తలు ‘మనసు ఎంత నిలకడలేనిదో నాలుక కూడా అంతే చంచలమైంది. అది ఎన్నెన్నో రుచులు కోరుకుంటుంది, ఏవేవో తినాలనుకుంటుంది. అలాంటి జిహ్వచాపల్యాన్ని తగ్గిస్తుంది ఉపవాసం. అంటే కేవలం ఆహారం తీసుకోకపోవడమే కాదు, పుణ్య దినాల్లో దైవాన్ని స్మరిస్తూ గడపటం. భక్తి పేరుతో అనుసరిస్తున్న ఈ ఆచారం శాస్త్ర ప్రకారమూ మంచిదే. ‘ఉపవాసం ఉపకారి’ అని మనం గుర్తుంచుకోవాలి. ఉపవాసం శారీరకంగా, మానసికంగా చురుగ్గా ఉండేలా చేస్తుంది. ఉపవాసం పూర్తయ్యాక భక్తిశ్రద్ధలతో దైవాన్ని స్మరించుకోవాలి. తర్వాత.. ఆయా కాలాలకు తగ్గట్టు ఆహారం తీసుకోవాలి. పూర్వం రుషులు కందమూలాలు మాత్రం తిని, సరోవరంలో తేటనీరు సేవించి.. సంవత్సరాల తరబడి తపస్సు చేసుకునేవారు. ఉపవాసం మంచిదైనప్పటికీ బాలలు, వృద్ధులు, రోగులు అభోజనంగా ఉండకూడదు’ అంటూ హితవు పలికారు.

ఉపవాసంతో తోటివారి ఆకలి బాధ అర్థమవుతుందనే ఆంతర్యమూ ఉంది. దాంతో అన్నదానం చేయాలనే స్ఫూర్తి కలుగుతుంది. ఇది అత్యుత్తమ దానం. ఆకలితో ఎవరూ తపించకూడదన్నదే ఉద్దేశం. సాటి మనుషులే కాదు, చుట్టూ ఉన్న మూగజీవాల ఆకలి తీర్చడమూ కర్తవ్యమే. అన్నం మినహా పండ్లు, ఫలహారాలూ అతిగా సేవించడం ఉపవాసం అనిపించుకోదు. ఇది పెద్దల ఉద్దేశానికి ఆటంకమే. అలాగే దేవుడికి కొబ్బరికాయ, పండ్లు, బెల్లం లాంటివి నైవేద్యంగా సమర్పించడంలో ధర్మసూక్ష్మం ఉంది. అవి ప్రసాదంగా తీసుకోవడం వల్ల నీరసం పోయి శక్తి చేకూరుతుంది. ఆహారం అధికమయ్యే కొద్దీ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. పొట్టలో కొంతభాగం ఖాళీగా ఉంటే జీర్ణప్రక్రియ సవ్యంగా ఉంటుంది, అనారోగ్యాలు దరిచేరవు. తామసగుణాన్ని పెంచే ఆహారం కూడదు, సూర్యాస్తమయం తర్వాత తినకూడదు- లాంటివి భక్తి, ఆచారం పేరుతో శ్రేయోదాయకం.

అచ్యుతుని రాజ్యశ్రీ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని