గోవిందుణ్ణి భజించు!

ఆదిశంకరాచార్యుల వారిని సాక్షాత్తూ పరమేశ్వరుడే అంటారు. భజగోవిందంలో అద్భుత తాత్విక సూత్రాలను అందరికీ అర్థమయ్యేలా చెప్పారాయన. ఆ శ్లోకాల్లో కొన్ని ముఖ్యాంశాలను గుర్తుచేసుకుందాం..

Published : 25 Apr 2024 00:03 IST

దిశంకరాచార్యుల వారిని సాక్షాత్తూ పరమేశ్వరుడే అంటారు. భజగోవిందంలో అద్భుత తాత్విక సూత్రాలను అందరికీ అర్థమయ్యేలా చెప్పారాయన. ఆ శ్లోకాల్లో కొన్ని ముఖ్యాంశాలను గుర్తుచేసుకుందాం..

అవసాన కాలంలో నీ వ్యాకరణ సూత్రాలు నిన్ను రక్షించలేవని గ్రహించి, గోవిందుణ్ణి భజించు మూర్ఖుడా!- అంటూ ఒక వ్యాకరణ పండితుడికి శంకరులు చేసిన హితోపదేశం అమూల్యమైంది. దేహంలో ఊపిరి ఉన్నంత వరకు నీ యోగక్షేమాలు తెలుసుకుంటారు. తర్వాత చెంతకు చేరరు. సంపాదించే శక్తి ఉన్నంతవరకూ అంతా బాగానే చూస్తారు. తర్వాత ఆ గౌరవం ఉండదు. కనుక ధనంపై ఆశ వదిలేసి సదాలోచనలకు చోటివ్వు. ఇంకా ఇంకా డబ్బు కావాలంటూ అత్యాశపడకు. ధనం గొప్పదని ఎన్నడూ తలవకు. దానివల్ల ఏ మాత్రమూ సుఖం ఉండదు. ధనికులకు కన్న కొడుకును చూసినా భయంగానే ఉంటుంది. మనసులోని మాలిన్యాలను తొలగించే గోవిందుణ్ణి భజించు. శరీరాన్ని చూసుకుని మోహానికి లోనవకు. అది కేవలం నెత్తుటితో నిండిన మాంసపుముద్ద. జనమంతా రోగపీడితులై, దేహాభిమానం విడిచిపెట్టకుండా దుఃఖంలో పడి కొట్టుకుపోతున్నారే కానీ సుఖపడేవారు ఒక్కరూ లేరు. వయసు పెరిగే కొద్దీ బంధాలు పెరుగుతాయి. రాత్రి, పగలు, శిశిరం, వసంతం.. ఒకదాని వెంట ఒకటిగా కాలచక్రం పరిభ్రమిస్తూనే ఉంటుంది. ఆశ అనే పెనుగాలి నిన్ను సంసారబంధంలోకి ఈడ్చుకెళ్తుంది. కర్మలు, బంధాల నుంచి విముక్తం అయ్యేందుకు గోవిందుని భజించు- అంటూ ఆశామోహాలను వివరించారు.

బాల్యంలో ఆటలు, యవ్వనంలో స్త్రీవ్యామోహం, వృద్ధాప్యంలో వ్యాకులం- ఇలా ప్రతి దశలోనూ లౌకిక విషయాలే తప్ప పరమాత్మునిపై ఆసక్తి ఉండదు. బ్రహ్మ జ్ఞానం కలిగించే గోవిందుని స్మరించు- అంటూ మాయాప్రపంచం గురించి తెలియజేశారు. నువ్వెవరు, నీ భార్యాపిల్లలు మునుపు ఎక్కడ ఉండేవారో తెలుసుకోగలవా? భ్రాంతి, అహంకార, మమకారాలతో కూడి ఉంది ప్రపంచం. అవన్నీ తెలుసుకునేందుకు గోవిందుణ్ణి భజించు. ఆధ్యాత్మిక జ్ఞానం గలవారితో సహవాసం లభించి నట్టయితే సంసార వ్యామోహం నశిస్తుంది. మోహానికి అతీతంగా ఉన్నప్పుడే శుద్ధజ్ఞానం కలుగు తుంది. అదే జీవన్ముక్తికి దారి తీస్తుంది. అలాంటి జ్ఞానాన్ని ఆశించి గోవిందుణ్ణి ధ్యానించు- అంటూ హితవు పలికారు.

మామడూరు శంకర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని